స్టాక్‌ మార్కెట్లే ఇప్పుడు దిక్కు | Sakshi Interview About Edelweiss AMC MD, CEO Radhika Gupta | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్లే ఇప్పుడు దిక్కు

Sep 23 2025 4:32 AM | Updated on Sep 23 2025 7:52 AM

Sakshi Interview About Edelweiss AMC MD, CEO Radhika Gupta

‘సాక్షి’తో ఎడిల్‌వీజ్‌ ఎండీ–సీఈఓ రాధికా గుప్తా  

ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలేవీ ఆకర్షణీయంగా లేవు

అందుకే యువత సహా ఇన్వెస్టర్లంతా ఇటు చూస్తున్నారు

అంతర్జాతీయ ప్రతికూలతలున్నా పెరుగుతున్నది అందుకే...

గడిచిన కొన్నేళ్లుగా వచ్చిన లాభాలు మార్కెట్లపై నమ్మకం పెంచాయి

కొన్ని షేర్లలో బబుల్స్‌ ఉండొచ్చు.. కానీ పునాదులు బలంగా ఉన్నాయి

లిస్టింగ్‌ లాభాల కోసం తాడూబొంగరం లేని అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో పెట్టొద్ద

దేశ వృద్ధిలో అన్ని రంగాలూ కీలకం.. అందుకే మ్యూచువల్‌ ఫండ్లు బెటర్‌

తక్కువైనా... స్థిరమైన రాబడులతోనే సంపద సృష్టి సాధ్యం

అమెరికా నుంచి ప్రతికూలతలు ఎదురవుతున్నా... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నా... భారత మార్కెట్లు అంతకంతకూ పెరుగుతుండటానికి కారణం దేశీ  ఇన్వెస్టర్లకు మార్కెట్లపై ఉన్న నమ్మకమేనని, కొన్నేళ్లుగా వారు కళ్లజూస్తున్న లాభాలే వారిని ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రేరేపిస్తున్నాయని ఎడిల్‌వీజ్‌ ఏఎంసీ ఎండీ– సీఈఓ రాధికా గుప్తా అభిప్రాయపడ్డారు. వినూత్న ఉత్పత్తులతో ఎడిల్‌వీజ్‌ను దేశవ్యాప్తంగా  విస్తరించి... దేశంలోని అగ్రశ్రేణి మ్యూచువల్‌ఫండ్‌ కంపెనీల్లో ఒకటిగా మార్చిన రాధికా గుప్తా... నిరంజన్‌ అవస్థితో కలిసి ‘మ్యాంగో మిలియనీర్‌’ అనే పర్సనల్‌ ఫైనాన్స్‌  పుస్తకాన్ని రాశారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో ఎంఎఫ్‌ పరిశ్రమ 200 లక్షల కోట్లకు  చేరుతుందంటున్న రాధికాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ఇది...

(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) 
→ అంతర్జాతీయంగా ఇబ్బందులెదురవుతున్నా భారత మార్కెట్లు కొత్త శిఖరాలను చేరుకోవటానికి కారణం? 
యువత ఆకాంక్షలు పెరుగుతున్నాయి. మరోవంక ఇన్వెస్ట్‌మెంట్‌కు మరీ ఎక్కువ ప్రత్యామ్నాయాలేవీ లేవు. ఎందుకంటే బ్యాంకు డిపాజిట్లు చేశారనుకుందాం. పన్నులు పోతే మిగిలేది తక్కువే. పెరుగుతున్న జీవన ప్రమాణాలకిది సరిపోదు. అందుకని సహజంగానే జనం ఈక్విటీ మార్కెట్ల వైపు చూస్తున్నారు. నేను ఎంఎఫ్‌ పరిశ్రమలో అడుగుపెట్టినపుడు ‘సిప్‌’ ద్వారా వచ్చే మొత్తం 4 వేల కోట్లుగా ఉండేది. ఇపుడది 28వేల కోట్లకు చేరింది. ఇందులో అత్యధిక భాగం దీర్ఘకాలికం. అదే ఇక్కడ కీలకం. ప్రత్యేకించి గడిచిన రెండేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న కొత్త ఇన్వెస్టర్లకు మంచి లాభాలొస్తున్నాయి.  

→ అయితే ఈ ర్యాలీ చల్లారిపోయేది కాదని, బుడగలేవీ లేవని అంటున్నారా? 
స్మాల్‌క్యాప్‌ కంపెనీలు... కొన్ని థీమ్స్‌..., కొన్ని కంపెనీల రూపంలో ఈ బబుల్స్‌ ఉండొచ్చు. పాలపై నురుగు ఓ 20 శాతం తప్పదు. ఏ బుల్‌ ర్యాలీకైనా ఇది వర్తిస్తుంది. దానర్థం మొత్తం మార్కెట్‌ ఇలానే ఉందని కాదుకదా? పునాదులు గట్టిగా ఉన్నాయన్నదే నా పాయింట్‌.  

→ మరి ఇలాంటి సమయంలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు మీరేం చెబుతారు? 
అన్నిటికన్నా ముఖ్యం... అతిగా ఆశించకపోవటం. నా పుస్తకంలో కూడా అదే చెప్పాను. చాలామంది ఇన్వెస్టర్లు గత సంవత్సరాన్ని బేరీజు వేసుకుంటూ 30–40 శాతం రాబడి వస్తుందనే అంచనాలతో ఉన్నారు. అది సరికాదు. రెండోది... హైబ్రిడ్‌ ఫండ్లు, మల్టీ అసెట్‌ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్ల వంటి మధ్యస్త ఆదాయాన్నిచ్చే ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి మరీ సంప్రదాయకంగా కాకుండా... మరీ దూకుడుగా కాకుండా మధ్యస్తంగా ఇన్వెస్ట్‌చేస్తాయి. స్థిరంగా నిలకడైన రాబడులనిస్తాయి. సంపద సృష్టించాలంటే అలానే సాధ్యం. 

→ డిఫెన్స్‌ థీమ్, ప్రభుత్వ బ్యాంకుల థీమ్‌ అంటూ రకరకాల స్టోరీలను ఈ మధ్య చూస్తున్నాం. చాలామంది రిటైల్‌ ఇన్వెస్టర్లు వీటిని నమ్ముతున్నారు కదా? 
నిజమే!. రిటైలర్లు ఇలాంటి స్టోరీల వెంటనే పరిగెడతారు. చివరకు దురదృష్టకరంగా ఎగ్జిట్‌ అవుతారు. నేనైతే ఈ థీమ్‌లను నమ్మను. ఏ ఒక్క రంగం వల్లనో దేశం ముందుకెళ్లదు. హోటల్స్, హాస్పిటల్స్, డేటా సెంటర్స్, క్యాపిటల్‌ మార్కెట్స్, టెక్నాలజీ.. ఇలాంటి రంగాలన్నీ దేశాభివృద్ధితో ముడిపడి ముందుకెళతాయి.  

→ మార్కెట్లో ఏ ఒక్క రంగమైనా మరీ అతిగా పెరిగినట్లు భావిస్తున్నారా? 
అలాగని చెప్పలేం. అయితే కొన్ని అన్‌లిస్టెడ్‌ కంపెనీలు, ఎస్‌ఎంఈ ఐపీవోల విషయంలో మాత్రం ఆందోళన ఉంది. లిస్టింగ్‌లోనే లాభాలొస్తాయి కదా అని చాలామంది రిటైల్‌ ఇన్వెస్టర్లు కంపెనీ పూర్వాపరాలేవీ పట్టించుకోకుండా అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పేరు చెప్పలేను కానీ... ఈ మధ్య ఒక ఐపీవోలో దెబ్బతిన్నారు. కొన్ని ఎస్‌ఎంఈ కంపెనీలూ అంతే. వీటిలో పెద్ద లిక్విడిటీ ఉండదు. పరిస్థితులు అనుకూలించకపోతే ఇరుక్కుపోయే ప్రమాదమే ఎక్కువ. అందుకే నేనెప్పుడూ రిటైల్‌ ఇన్వెస్టర్లను ఇండెక్స్‌ ఫండ్లలో గానీ, ఏవైనా ఇతర మ్యూచువల్‌ ఫండ్లలో గానీ పెట్టుబడి పెట్టమని చెబుతాను.  

→ కానీ కొన్ని కంపెనీలు ఏడాదిలో 50 శాతం... రెండుమూడు రెట్లు పెరగటం చూస్తున్నారు కదా? ఇవి రిటైలర్లను ఆకర్షిస్తాయి కదా? 
ఇలా పెరిగిన రెండుమూడు గురించే అంతా చెబుతారు. కానీ కుదేలైన షేర్ల గురించి చెప్పరు. స్టాక్‌ మార్కెట్లో లాభాలు ఆర్జించిన వారిని తప్ప నష్టపోయిన వారి స్టోరీలు బయటకు రావు. ఇలా ఒక షేర్లో పెట్టి లాభపడ్డ వారు కూడా మిగిలిన షేర్లలో రాబడి గురించి చెప్పరు. ఆ షేర్‌ను ఎంచుకోవటం వెనక వారి శ్రమ, సమయం కూడా ఉంటాయి కదా? ఏడాదికి 10–12 శాతం రాబడినిచ్చే మ్యూచువల్‌ ఫండ్లు బోరింగ్‌గా అనిపించవచ్చు. కానీ ఆ రాబడి స్థిరంగా ఉంటుంది. సురక్షితం కూడా. 

→ చిన్న పట్టణాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్కృతి పెరుగుతోందా? 
చాలా. ఎడిల్‌వీజ్‌ను 5 నగరాల్లో ఆరంభించాం. ఇపుడు 60 పట్టణాల్లో ఉన్నాం. త్వరలో 200 పట్టణాలకు విస్తరిస్తాం. స్థానిక భాషల్లో ఆర్థిక పాఠాల లభ్యత.. వారికి సలహాదారులు, డిస్ట్రిబ్యూటర్లు అందుబాటులో ఉండటమన్నదే ప్రధానం.  

→ పాసివ్‌ (ఇండెక్స్‌) ఫండ్లకు ఆదరణ పెరుగుతోంది కదా.. మరి యాక్టివ్‌ ఫండ్లకు వీటితో పోటీ ఉంటుందా? 
అలాంటిదేమీ లేదు. చాలామంది ఇన్వెస్టర్లు రెండింట్లోనూ పెట్టుబడి పెడుతున్నారు. బాగా రాబడులనిచి్చన యాక్టివ్‌ ఫండ్లలోకి పెట్టుబడులొస్తాయి. లేదంటే పాసివ్‌ ఫండ్లలోకి వెళతాయి. రెండూ పెరుగుతున్నాయనేది మనం గమనించాలి.  

→ ఇపుడు చాలామంది ఇన్వెస్టర్లు అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయాలని చూస్తున్నారు. ఎడిల్‌వీజ్‌ ప్రణాళికలేంటి? 
టెక్నాలజీ, చైనా సహా కొన్ని గ్లోబల్‌ ఫండ్లను మేం నడిపిస్తున్నాం. కాకుంటే వీటికి ఆర్‌బీఐ పరిమితులున్నాయి. వీటిని గిఫ్ట్‌ సిటీ ద్వారా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే గిఫ్ట్‌సిటీలో కార్యాలయాన్ని ఆరంభించాం. 

→ ఐదు పదేళ్లలో ఎంఎఫ్‌ పరిశ్రమ ఎలా ఉండొచ్చు? 
2030 నాటికి ఇది 200 లక్షల కోట్లకు చేరుతుందన్నది నా అంచనా. దీన్లో 130–140 లక్షల కోట్లు ఈక్విటీలోనే ఉంటాయి. సిప్‌ పెట్టుబడులు నెలకు రూ. లక్ష కోట్లను చేరుతాయి. దేశంలో 30–40 శాతం మంది మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేయటమే వికసిత భారత్‌కు అర్థమన్నది నా భావన.

→ యువత చాలామంది ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ చేస్తున్నారు. మీరేమంటారు? 
అదో దుర్మార్గం. ఎఫ్‌ అండ్‌ ఓ అనేది సంస్థలు రిస్‌్కను తగ్గించుకోవటానికి ఉపయోగించుకోవాల్సిన సాధనం. అంతేతప్ప అప్పులు తెచ్చి ట్రేడింగ్‌ చేసే యువత కోసం కాదు. విద్యార్థులు, చిన్నచిన్న వర్కర్లు, డ్రైవర్లు రుణాలు తీసుకుని ట్రేడింగ్‌ చేస్తున్న వ్యవహారాన్ని నేనూ విన్నా. ఇది గ్యాంబ్లింగ్‌. ప్రమాదకరం. రిటైల్‌ ఇన్వెస్టర్లు సిప్, మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా తేలిగ్గా సంపద సృష్టించుకోవచ్చు. గ్యాంబ్లింగ్‌ అవసరం లేదు.  

→ భారత్‌ బాండ్‌ ఫండ్‌ మాదిరి ఎడిల్‌వీజ్‌ నుంచి కొత్త ఉత్పత్తులేమైనా వస్తున్నాయా? 
అక్టోబర్‌ 1న మేం దేశంలో మొట్టమొదటి హైబ్రిడ్‌ స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెండ్‌ ఫండ్‌ను (ఎస్‌ఐఎఫ్‌) ఆరంభించబోతున్నాం. సెబీ ఇటీవలే దీనికి అనుమతిచి్చంది. దీన్లో కనీస 
పెట్టుబడి సైజు రూ.10 లక్షలు. దీన్లో రిస్క్‌ తక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బ్యాలెన్స్‌ చేసుకోవటానికి ఈ ఫండ్‌ ఉపయోగపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement