
వారమంతా ఆఫర్ల సందడి...
6 పబ్లిక్ ఇష్యూలు షురూ
3 ఇష్యూల ముగింపు
5 కంపెనీల లిస్టింగ్
రేసులో పలు ఎస్‌ఎంఈలు
వచ్చే వారం (22–26) ప్రైమరీ మార్కెట్లలో సందడే సందడి.. మెయిన్‌బోర్డులో 6 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు మార్కెట్లను పలకరించనుండగా.. మరో 3 ఇష్యూలు ముగియనున్నాయి. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి చేసుకున్న మరో 4 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి. వెరసి వచ్చే వారం ఐపీవో నామవారంగా నిలవనుంది. వివరాలు చూద్దాం..
రానున్న సోమవారం(22) నుంచి శుక్రవారం(26) మధ్యలో ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. ఇటీవల జోరందుకున్న పబ్లిక్ ఇష్యూలు మరింతగా వెల్లువెత్తనున్నాయి. రూ. 560 కోట్ల సమీకరణకు ఈ వారం ప్రారంభమైన ఐవేల్యూ ఇన్ఫో 22న ముగియనుండగా.. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ(రూ. 900 కోట్లు), జీకే ఎనర్జీ(రూ. 465 కోట్ల సమీకరణ) 23న పూర్తికానున్నాయి.
ఇక 22–24 మధ్య అట్లాంటా ఎలక్ట్రికల్స్(రూ. 687 కోట్లు), గణేశ్ కన్జూమర్ ప్రొడక్ట్స్(రూ. 409 కోట్లు), 23–25 మధ్య ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్(రూ. 745 కోట్లు), శేషసాయి టెక్నాలజీస్(రూ. 480 కోట్లు), సోలార్ వరల్డ్(రూ. 490 కోట్లు), జారో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్స్(రూ. 450 కోట్లు), 24–26 మధ్య జైన్ రిసోర్స్ రీసైక్లింగ్(రూ. 1,250 కోట్లు), ఈప్యాక్ ప్రీఫ్యాబ్(రూ.504 కోట్లు) ఇన్వెస్టర్లకు జోష్‌నివ్వనున్నాయి.
ఈ కంపెనీలు ఉమ్మడిగా దాదాపు రూ. 7,000 కోట్లు సమీకరించనున్నాయి. కొద్ది నెలలుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటికే 60 కంపెనీలు లిస్టింగ్‌కు రావడం ద్వారా రూ. 78,000 కోట్లకుపైగా సమీకరించడం గమనార్హం!
లిస్టింగ్‌కు 5 కంపెనీలు రెడీ
ఇప్పటికే విజయవంతంగా ఐపీవోలు చేపట్టిన 5 కంపెనీలు వచ్చే వారం మెయిన్‌బోర్డులో లిస్ట్‌కానున్నాయి. జాబితాలో యూరో ప్రతీక్ సేల్స్ (23న), వీఎంఎస్ టీఎంటీ (24న), ఐవేల్యూ ఇన్ఫో (25న), సాతి్వక్ గ్రీన్, జీకే ఎనర్జీ(26న) చేరాయి.
ఎస్‌ఎంఈల దూకుడు
చిన్న, మధ్యతరహా కంపెనీ(ఎస్‌ఎంఈ)ల నిధుల సమీకరణకు వీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లను తీసుకువచి్చన నేపథ్యంలో కొన్నేళ్లుగా ఐపీవోలు క్యూ కడుతున్నాయి. ఈ బాటలో ఈ వారం పబ్లిక్ ఇష్యూలు పూర్తి చేసుకున్న 4 ఎస్‌ఎంఈలు వచ్చే వారం లిస్ట్‌కానుండగా.. ఏకంగా 16 కంపెనీలు ఐపీవోలకు రానుండటం విశేషం!
జాబితాలో ప్రైమ్ కేబుల్, సాల్వెక్స్ ఎడిబుల్స్, భారత్‌రోహన్ ఎయిర్‌బోన్, ఆప్టస్ ఫార్మా, ట్రూ కలర్స్, మ్యాట్రిక్స్ జియో, ఎన్‌ఎస్‌బీ బీపీవో సొల్యూషన్స్, ఎకోలైన్ ఎగ్జిమ్, సిస్టమాటిక్ ఇండస్ట్రీస్, జస్టో రియల్‌ఫిన్‌టెక్, రిద్ధీ డిస్‌ప్లే, గురునానక్ అగ్రికల్చర్, ప్రరూహ్ టెక్ తదితర కంపెనీలు చేరాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్