
‘హరిత యూరియా’ను ఆవిష్కరించి ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2025’ను గెల్చుకున్న స్వీడన్ స్టార్టప్ ‘నైట్రోక్యాప్ట్’
ప్లాస్మా టెక్నాలజీ ద్వారా పునరుత్పాదక ఇంధనం వాడుతూ గాలిలోని నత్రజనిని విచ్ఛిన్నం చేయటం ద్వారా విజయవంతంగా హరిత యూరియా ఉత్పత్తి
శిలాజ ఇంధనాలు అవసరం లేదు.. నీరు, గాలి, నేల కాలుష్యం ఉండదు
చిన్న పరిశ్రమల ద్వారా యూరియా ఉత్పత్తి చేసుకునే అవకాశం
పర్యావరణాన్ని, ప్రకృతిని కలుషితం చేస్తున్న రసాయనిక యూరియా వాడకానికి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయి. శిలాజ ఇంధనాలు వాడకుండా తయారు చేసే ‘హరిత యూరియా’ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్వీడన్‌లోని ‘నైట్రోక్యాప్ట్’ అనే స్టార్టప్ పూర్తిగా కాలుష్య రహిత పద్ధతిలో నత్రజని ఎరువును తయారు చేస్తోంది. అది కూడా స్వల్ప ఖర్చుతోనే. కేవలం వాతావరణంలోని నీరు, గాలితో పాటు ఒక యూనిట్ సోలార్ వంటి పునరుత్పాదక ఇంధనంతో ఏకంగా 40 వేల హెక్టార్లకు సరిపడా హరిత యూరియాను ఉత్పత్తి చేసే అద్భుత సామర్థ్యం తమ వినూత్న సాంకేతికత సొంతమని నైట్రోక్యాప్ట్ వ్యవస్థాపకుడు గస్టాఫ్ ఫోర్స్‌బెర్గ్
ప్రకటించారు.
ఏమిటీ సాంకేతికత విశిష్టత?
వాతావరణంలో మెరుపులు సహజంగా నత్రజనిని స్థిరీకరించే విధానాన్ని అనుకరిస్తూ ఈ స్టార్టప్ సరికొత్త సాంకేతికతను రూపొందించింది. గాలిలోని నత్రజని అణువులను విచ్ఛిన్నం చేయడానికి ప్లాస్మా టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా ఎరువులలో కీలకమైన భాగమైన నైట్రేట్‌ను ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత విశిష్టత. ఈ సాంకేతికత గాలి నుంచి గ్రహించి నేరుగా నత్రజని ఎరువును తయారు చేయటానికి ఆక్సిజన్, నీరు, పునరుత్పాదక శక్తిని మాత్రమే ఉపయోగిస్తుంది.
వందేళ్లుగా సంప్రదాయ రసాయనిక ఎరువుల ఉత్పత్తి ప్రక్రియలో మాదిరిగా ఖరీదైన, కాలుష్యకారక ఇంధనాన్ని ఉపయోగించి హైడ్రోజన్ తయారు చేసే అవసరం ఈ టెక్నాలజీతో తీరిపోనుంది. నైట్రోక్యాప్ట్ రూపొందించిన పద్ధతిలో హరిత యూరియా ఉత్పత్తికి పది రెట్లు తక్కువ శక్తి సరిపోతుంది. దీన్ని సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈ సాంకేతిక పురోగతి ఎరువుల తయారీ ప్రక్రియను పర్యావరణహితంగా మారుస్తుంది.
‘సనిఫిక్స్’ పేరిట పేటెంట్
స్వీడన్‌కు చెందిన భౌతికశాస్త్ర శాస్త్రవేత్త గస్టాఫ్ ఫోర్స్‌బెర్గ్ తన మిత్రుడు పీటర్ బేలింగ్‌తో కలసి 2016లో నైట్రోక్యాప్ట్ స్టార్టప్‌ను నెలకొల్పారు. ‘సనిఫిక్స్’ పేరిట పేటెంట్ పొందిన గ్రీన్ యూరియా టెక్నాలజీని 20 మంది శాస్త్రవేత్తలతో కూడిన నైట్రోక్యాప్ బృందం ఆవిష్కరించింది. ఇందులో శ్రీలంకలో పుట్టిన యువ శాస్త్రవేత్త శంఖ ననయక్కర కూడా ఉన్నారు.
స్వీడన్‌లోని ఉప్సల పట్టణంలోని గ్రీన్ ఇన్నోవేషన్ పార్క్‌లో ఏర్పాటైన చిన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్టర్ ద్వారా హరిత యూరియా ఉత్పత్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. హరిత యూరియాను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే 33 పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి 9 సంస్థలు ఆసక్తి చూపాయి. స్వీడన్‌లోని ‘వివెసియ’ సహకార సంఘం వాణిజ్యపరమైన తొలి పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో 9 వేల మంది రైతులు సభ్యులు. హరిత నత్రజని ఎరువుతో 7.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
స్టాక్‌హోమ్‌లో పురస్కార ప్రదానం
స్వీడన్‌కు చెందిన కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యావరణ పురస్కారం ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్’ను ప్రదానం చేస్తోంది. పర్యావరణహితమైన ఆహారోత్పత్తికి దోహదపడే ఆవిష్కరణలకు ఈ పురస్కారం ఇస్తారు. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నైట్రోక్యాప్ట్ గెల్చుకుంది. జ్ఞాపికతో పాటు 20 లక్షల డాలర్ల నగదు బహుమతిని జూన్ 13న స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో నైట్రోక్యాప్ట్ వ్యవస్థాపకుడు గస్టాఫ్ ఫోర్స్‌బెర్గ్ అందుకున్నారు. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ పొందటంతో ఈ ఆవిష్కరణ ప్రపంచం దృష్టికి వచ్చింది.
వికేంద్రీకరణకు అవకాశం
యూరియా ఉత్పత్తికి భారీ పరిశ్రమను స్థాపించాల్సిన అవసరం లేదు. కాబట్టి, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల రైతులకు ఈ సాంకేతికత వరప్రసాదంగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాక, రసాయనిక ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ఉత్పాదకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అనివార్యత నుంచి ఈ సాంకేతికత విముక్తి కలిగిస్తుందని ఆశిస్తున్నారు.
యూరియాను ఎక్కడో ఉత్పత్తి చేసి ఎక్కడికో తరలించాల్సిన అవసరం ఉండదు. దీని ఉత్పత్తిని వికేంద్రీకరించటానికి తగిన మాడ్యులర్ వ్యవస్థ ద్వారా నెలకొల్పే రియాక్టర్ల ద్వారా హరిత నత్రజనిని ఎక్కడికక్కడ తయారు చేసుకునేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందట. అదే జరిగితే, అంతర్జాతీయ జియోపొలిటికల్ ఉద్రిక్తతల ప్రభావం వ్యవసాయంపై పడకుండా జాగ్రత్తపడగలుగుతాం.
శిలాజ ఇంధనాలపై ఆధారపడే ఇప్పటి రసాయనిక ఎరువుల ఉత్పత్తి పరిశ్రమలో ఇది విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వాతావరణంలోకి విడుదలవుతూ భూగోళాన్ని అమితంగా వేడెక్కిస్తున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో దాదాపు 2.7 శాతం రసాయనిక ఎరువుల పరిశ్రమ నుంచి వస్తున్నాయి. ఇందులో 50% వాటా యూరియాదే. ఎటువంటి ముడిసరుకును దిగుమతి చేసుకోనవసరం లేనందున యూరియా ఉత్పత్తిలో ఇక ఏ చిన్న దేశమైనా సంపూర్ణ స్వావలంబన సాధించడానికి ఈ ఆవిష్కరణ దోహదం చేయనుంది.
ప్రపంచ దేశాల రైతులకు వరం
ప్రపంచ నత్రజని ఎరువుల పరిశ్రమను అతలాకు తలం చేసే సామర్థ్యం నైట్రోక్యాప్ట్ ఆవిష్కరణకు ఉందని ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ అవార్డు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ జ్యూరీ పేర్కొంది. ‘భూమి, నీరు, ఎరువులను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఉపయోగించడం ద్వారా మాత్రమే ప్రపంచంలోని ప్రజలందరికీ తగినంత మొత్తంలో పోషకాహారాన్ని అందించగలం. నత్రజని, భాస్వరం ఎరువులను అధిక మొత్తంలో వినియోగిస్తున్నాం. పెద్ద మొత్తంలో హరితగృహ వాయువులను విడుదల చేసే ప్రక్రియల ద్వారా నత్రజని ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయి.
నైట్రోక్యాప్ట్ స్టార్టప్ ఆవిష్కరణ ఈ చరిత్రను తిరగరాస్తోంది. హరిత విద్యుత్తు ఆధారిత ప్లాస్మా టెక్నాలజీతో గాలిలోని నత్రజని మూలకా లను విభజించడం ద్వారా నత్రజని ఎరువులను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఇంధన వినియోగాన్ని ఈ సాంకేతికత పది రెట్లు తగ్గిస్తుంది.
స్థానికంగా చిన్న యూనిట్లలో హరిత ఎరువులను ఉత్పత్తి చేయవచ్చు. శిలాజ ఇంధనాలను పూర్తిగా నివారిస్తుంది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచగల, నిశ్చింతగా ఉపయోగించగల నైట్రేట్ ఎరువులను ఈ సాంకేతికత అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రైతులకు ఇది వరం..’ అని జ్యూరీ పేర్కొంది.
ఉద్గారాల్లేని యూరియాతో విప్లవాత్మక మార్పు
నత్రజని ఎరువుల పరిశ్రమను కర్బన ఉద్గార రహితంగా మార్చటం నైట్రోక్యాప్ట్ లక్ష్యం. ప్రస్తుతం నత్రజని ఎరువు ఉత్పత్తి చేస్తున్న శిలాజ ఇంధన ఆధారిత ప్రక్రియ కథ ముగింపు దశకు చేరుకుంది. యూరియా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆహారోత్పత్తిని పెంచటానికి కూడా హరిత యూరియాతో మనం దోహదపడవచ్చు. పైలట్ ప్రాజెక్టు ద్వారా హరిత యూరియాను ఇప్పటికే ఉత్పత్తి చేస్తూ పంటలకు వాడుతున్నాం. పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించే తొలి యూనిట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాం. నత్రజని పరిశ్రమలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టే దశకు మా సాంకేతికతను తీసుకురావడానికి ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ మాకు చాలా ఉపయోగపడుతుంది.
– గస్టాఫ్ ఫోర్స్‌బెర్గ్, సీఈవో, వ్యవస్థాపకుడు, నైట్రోక్యాప్ట్, స్వీడన్
– పంతంగి రాంబాబు