breaking news
Pollution-free
-
హరిత యూరియా వస్తోంది!
పర్యావరణాన్ని, ప్రకృతిని కలుషితం చేస్తున్న రసాయనిక యూరియా వాడకానికి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయి. శిలాజ ఇంధనాలు వాడకుండా తయారు చేసే ‘హరిత యూరియా’ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్వీడన్‌లోని ‘నైట్రోక్యాప్ట్’ అనే స్టార్టప్ పూర్తిగా కాలుష్య రహిత పద్ధతిలో నత్రజని ఎరువును తయారు చేస్తోంది. అది కూడా స్వల్ప ఖర్చుతోనే. కేవలం వాతావరణంలోని నీరు, గాలితో పాటు ఒక యూనిట్ సోలార్ వంటి పునరుత్పాదక ఇంధనంతో ఏకంగా 40 వేల హెక్టార్లకు సరిపడా హరిత యూరియాను ఉత్పత్తి చేసే అద్భుత సామర్థ్యం తమ వినూత్న సాంకేతికత సొంతమని నైట్రోక్యాప్ట్ వ్యవస్థాపకుడు గస్టాఫ్ ఫోర్స్‌బెర్గ్ ప్రకటించారు. ఏమిటీ సాంకేతికత విశిష్టత?వాతావరణంలో మెరుపులు సహజంగా నత్రజనిని స్థిరీకరించే విధానాన్ని అనుకరిస్తూ ఈ స్టార్టప్ సరికొత్త సాంకేతికతను రూపొందించింది. గాలిలోని నత్రజని అణువులను విచ్ఛిన్నం చేయడానికి ప్లాస్మా టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా ఎరువులలో కీలకమైన భాగమైన నైట్రేట్‌ను ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత విశిష్టత. ఈ సాంకేతికత గాలి నుంచి గ్రహించి నేరుగా నత్రజని ఎరువును తయారు చేయటానికి ఆక్సిజన్, నీరు, పునరుత్పాదక శక్తిని మాత్రమే ఉపయోగిస్తుంది. వందేళ్లుగా సంప్రదాయ రసాయనిక ఎరువుల ఉత్పత్తి ప్రక్రియలో మాదిరిగా ఖరీదైన, కాలుష్యకారక ఇంధనాన్ని ఉపయోగించి హైడ్రోజన్ తయారు చేసే అవసరం ఈ టెక్నాలజీతో తీరిపోనుంది. నైట్రోక్యాప్ట్ రూపొందించిన పద్ధతిలో హరిత యూరియా ఉత్పత్తికి పది రెట్లు తక్కువ శక్తి సరిపోతుంది. దీన్ని సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈ సాంకేతిక పురోగతి ఎరువుల తయారీ ప్రక్రియను పర్యావరణహితంగా మారుస్తుంది. ‘సనిఫిక్స్’ పేరిట పేటెంట్స్వీడన్కు చెందిన భౌతికశాస్త్ర శాస్త్రవేత్త గస్టాఫ్ ఫోర్స్‌బెర్గ్ తన మిత్రుడు పీటర్ బేలింగ్‌తో కలసి 2016లో నైట్రోక్యాప్ట్ స్టార్టప్‌ను నెలకొల్పారు. ‘సనిఫిక్స్’ పేరిట పేటెంట్ పొందిన గ్రీన్ యూరియా టెక్నాలజీని 20 మంది శాస్త్రవేత్తలతో కూడిన నైట్రోక్యాప్ బృందం ఆవిష్కరించింది. ఇందులో శ్రీలంకలో పుట్టిన యువ శాస్త్రవేత్త శంఖ ననయక్కర కూడా ఉన్నారు. స్వీడన్‌లోని ఉప్సల పట్టణంలోని గ్రీన్ ఇన్నోవేషన్ పార్క్‌లో ఏర్పాటైన చిన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రియాక్టర్ ద్వారా హరిత యూరియా ఉత్పత్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. హరిత యూరియాను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే 33 పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి 9 సంస్థలు ఆసక్తి చూపాయి. స్వీడన్‌లోని ‘వివెసియ’ సహకార సంఘం వాణిజ్యపరమైన తొలి పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో 9 వేల మంది రైతులు సభ్యులు. హరిత నత్రజని ఎరువుతో 7.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్టాక్‌హోమ్‌లో పురస్కార ప్రదానంస్వీడన్కు చెందిన కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యావరణ పురస్కారం ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్’ను ప్రదానం చేస్తోంది. పర్యావరణహితమైన ఆహారోత్పత్తికి దోహదపడే ఆవిష్కరణలకు ఈ పురస్కారం ఇస్తారు. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నైట్రోక్యాప్ట్ గెల్చుకుంది. జ్ఞాపికతో పాటు 20 లక్షల డాలర్ల నగదు బహుమతిని జూన్ 13న స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో నైట్రోక్యాప్ట్ వ్యవస్థాపకుడు గస్టాఫ్ ఫోర్స్‌బెర్గ్ అందుకున్నారు. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ పొందటంతో ఈ ఆవిష్కరణ ప్రపంచం దృష్టికి వచ్చింది. వికేంద్రీకరణకు అవకాశంయూరియా ఉత్పత్తికి భారీ పరిశ్రమను స్థాపించాల్సిన అవసరం లేదు. కాబట్టి, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల రైతులకు ఈ సాంకేతికత వరప్రసాదంగా మారుతుందని చెబుతున్నారు. అంతేకాక, రసాయనిక ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ఉత్పాదకాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అనివార్యత నుంచి ఈ సాంకేతికత విముక్తి కలిగిస్తుందని ఆశిస్తున్నారు. యూరియాను ఎక్కడో ఉత్పత్తి చేసి ఎక్కడికో తరలించాల్సిన అవసరం ఉండదు. దీని ఉత్పత్తిని వికేంద్రీకరించటానికి తగిన మాడ్యులర్ వ్యవస్థ ద్వారా నెలకొల్పే రియాక్టర్ల ద్వారా హరిత నత్రజనిని ఎక్కడికక్కడ తయారు చేసుకునేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందట. అదే జరిగితే, అంతర్జాతీయ జియోపొలిటికల్ ఉద్రిక్తతల ప్రభావం వ్యవసాయంపై పడకుండా జాగ్రత్తపడగలుగుతాం. శిలాజ ఇంధనాలపై ఆధారపడే ఇప్పటి రసాయనిక ఎరువుల ఉత్పత్తి పరిశ్రమలో ఇది విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వాతావరణంలోకి విడుదలవుతూ భూగోళాన్ని అమితంగా వేడెక్కిస్తున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో దాదాపు 2.7 శాతం రసాయనిక ఎరువుల పరిశ్రమ నుంచి వస్తున్నాయి. ఇందులో 50% వాటా యూరియాదే. ఎటువంటి ముడిసరుకును దిగుమతి చేసుకోనవసరం లేనందున యూరియా ఉత్పత్తిలో ఇక ఏ చిన్న దేశమైనా సంపూర్ణ స్వావలంబన సాధించడానికి ఈ ఆవిష్కరణ దోహదం చేయనుంది. ప్రపంచ దేశాల రైతులకు వరం ప్రపంచ నత్రజని ఎరువుల పరిశ్రమను అతలాకు తలం చేసే సామర్థ్యం నైట్రోక్యాప్ట్ ఆవిష్కరణకు ఉందని ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ అవార్డు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ జ్యూరీ పేర్కొంది. ‘భూమి, నీరు, ఎరువులను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఉపయోగించడం ద్వారా మాత్రమే ప్రపంచంలోని ప్రజలందరికీ తగినంత మొత్తంలో పోషకాహారాన్ని అందించగలం. నత్రజని, భాస్వరం ఎరువులను అధిక మొత్తంలో వినియోగిస్తున్నాం. పెద్ద మొత్తంలో హరితగృహ వాయువులను విడుదల చేసే ప్రక్రియల ద్వారా నత్రజని ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయి.నైట్రోక్యాప్ట్ స్టార్టప్ ఆవిష్కరణ ఈ చరిత్రను తిరగరాస్తోంది. హరిత విద్యుత్తు ఆధారిత ప్లాస్మా టెక్నాలజీతో గాలిలోని నత్రజని మూలకా లను విభజించడం ద్వారా నత్రజని ఎరువులను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఇంధన వినియోగాన్ని ఈ సాంకేతికత పది రెట్లు తగ్గిస్తుంది. స్థానికంగా చిన్న యూనిట్లలో హరిత ఎరువులను ఉత్పత్తి చేయవచ్చు. శిలాజ ఇంధనాలను పూర్తిగా నివారిస్తుంది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచగల, నిశ్చింతగా ఉపయోగించగల నైట్రేట్ ఎరువులను ఈ సాంకేతికత అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రైతులకు ఇది వరం..’ అని జ్యూరీ పేర్కొంది.ఉద్గారాల్లేని యూరియాతో విప్లవాత్మక మార్పు నత్రజని ఎరువుల పరిశ్రమను కర్బన ఉద్గార రహితంగా మార్చటం నైట్రోక్యాప్ట్ లక్ష్యం. ప్రస్తుతం నత్రజని ఎరువు ఉత్పత్తి చేస్తున్న శిలాజ ఇంధన ఆధారిత ప్రక్రియ కథ ముగింపు దశకు చేరుకుంది. యూరియా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆహారోత్పత్తిని పెంచటానికి కూడా హరిత యూరియాతో మనం దోహదపడవచ్చు. పైలట్ ప్రాజెక్టు ద్వారా హరిత యూరియాను ఇప్పటికే ఉత్పత్తి చేస్తూ పంటలకు వాడుతున్నాం. పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించే తొలి యూనిట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాం. నత్రజని పరిశ్రమలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టే దశకు మా సాంకేతికతను తీసుకురావడానికి ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ మాకు చాలా ఉపయోగపడుతుంది.– గస్టాఫ్ ఫోర్స్‌బెర్గ్, సీఈవో, వ్యవస్థాపకుడు, నైట్రోక్యాప్ట్, స్వీడన్– పంతంగి రాంబాబు -
వారణాసిలో సీఎన్జీ బోట్లు
వారణాసి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నదిలో తిరిగే అన్ని బోట్లకు పర్యావరణ హిత సీఎన్జీ ఇంజిన్లను అమరుస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. 500 బోట్లను డీజిల్‌కు బదులు సీఎన్జీ ఇంజిన్లను అమర్చడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 583 బోట్లను మార్చామన్నారు. మరో 2వేల బోట్లను సీఎన్జీకి మార్చే పనిలో ఉన్నామని చెప్పారు. ఇకపై పెద్ద శబ్దాలతో కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ బోట్లకు బదులుగా గంగానదిలో శబ్దంలేని, తక్కువ కలుషితాలను మాత్రమే వదిలే సీఎన్జీ బోట్లు పూర్తి స్థాయిలో రానున్నాయని చెప్పారు. సీఎన్జీ వల్ల పడవల నిర్వాహకులకు ఏటా రూ.30 వేల దాకా ఆదా అవుతుందన్నారు. -
ఈ–రిక్షా మేడిన్ జనగామ
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో కాలుష్య రహిత ఈ–రిక్షాలను తయారు చేస్తున్నారు. ఢిల్లీ, వారణాసి తదితర ప్రాంతాలకే పరిమితమైన ఈ ఈ–రిక్షాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. జనగామకు చెందిన పెద్ది రవీందర్ పెంబర్తి రోడ్డులో ఈ–రిక్షా తయారీ కేంద్రాన్ని ప్రారంభిం చారు. చెనా, ఢిల్లీ, చైన్నై ప్రాంతాల నుంచి ముడిసరుకులను తీసుకువచ్చి ఇక్కడే ఈ– రిక్షాలను తయారు చేయిస్తున్నారు. ఫ్రేమ్స్, డూమ్‌లు, మోటార్లు, చార్జర్లు, కంట్రోల్ ప్యానెల్, బ్యాటరీ, వైరింగ్, ఎల్ఈడీ లైట్లను దిగుమతి చేసుకొని సొంతంగా తయారీని ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 ఈ–రిక్షాలను తయారు చేశారు. ప్యాసింజర్, గూడ్స్ రిక్షాలు.. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఈ–రిక్షాల్లో ప్రయాణికులను తరలించడానికి ఈ–రిక్షా, వస్తువులను రవాణా చేయడానికి ఈ–కార్ట్ రిక్షాలను వేర్వేరుగా తయారు చేస్తున్నారు. ప్యాసింజర్ రిక్షాలో ఐదుగురు కూర్చోవడా నికి వీలుగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ–కార్డ్ రిక్షాలో 4 క్వింటాళ్ల బరువు వరకు రవాణా చేయడం వీలవుతుంది. కాగా, ప్యాసింజర్ ఆటోను రూ. 1.10 లక్షలకు విక్రయిస్తే, గూడ్స్ ఆటోను లక్ష రూపాయలకు విక్రయిస్తున్నట్లు నిర్వాహకుడు తెలిపారు. 4 గంటలు చార్జింగ్.. ప్రయాణం 80 కిలోమీటర్లు.... ఈ–రిక్షాకు 4 గంటల పాటు చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలు ఉంటుంది. అంతేకాకుండా రేర్మిర్రర్, స్పీడో మీటర్, ఇండికేటర్, సౌండ్ సెట్టింగ్ వంటి సదుపాయాలన్నీ ఇందులో పొందుపరిచారు. అనుమతులు అక్కర్లేదు.. ఈ–రిక్షాలను నడపడం కోసం ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. గేర్లు లేకుండానే వాహనం నడిపే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ కూడా లేదు. -
కాలుష్యరహిత శ్మశానవాటిక
రాష్ట్రంలోనే మొదటిది తిరుమలగిరిలో ప్రారంభం బొల్లారం, న్యూస్‌లైన్: రాష్ట్రంలోనే మొట్టమొదటి కాలుష్య రహిత, పర్యావరణ అనుకూల శ్మశానవాటిక నగరంలో ఏర్పాటైంది. ప్రభుత్వ సహకారంతో రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ వాటిక.. సిటీలో తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని లీలా గార్డెన్ సమీపంలో ఆహ్లాదకర వాతావరణంలో రూపుదిద్దుకుంది. రెండున్నర ఎకరాల స్థలంలో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ స్వర్గ్ వాటిక శుక్రవారం ప్రారంభమైంది. పచ్చగా.. ఆహ్లాదంగా.. ఆత్మబంధువుల మృతితో దు:ఖంతో వచ్చేవారికి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మానసిక ప్రశాంతతను కల్పించేందుకు పచ్చనిచెట్లు, తోటలు, వాటర్ ఫాల్స్, ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు. శవాలను తీసుకువచ్చేందుకు ట్రాన్స్పోర్ట్ వాహనాలు చితా భస్మాలను సేకరించుకునేందుకు ఒక ప్రత్యేక గది, మృతదేహలను భద్రపరిచేందుకు కోల్డ్స్టోర్ గదుల సౌకర్యాన్ని కల్పించారు. అంతేకాదు.. ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్‌తో పాటు ఎలక్ట్రిక్ కరెంట్‌తో దహన సంస్కారాలను నిర్వహించే విధంగా ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. శ్మశాన వాటికలో దహనానంతరం ఏర్పడే కాలుష్యాన్ని నిర్మూలించడానికి పొల్యూషన్ కంట్రోల్ సిస్టంను ఏర్పాటు చేశారు. వ్యర్థాలు, మలిన పదార్థాల వాసనను తొలగించేందకు 100 అడుగుల ఎత్తు పొగ గొట్టాన్ని నిర్మించారు. మొత్తంగా పర్యావర ణానికి మేలు చేసే విధంగా రూపొందిందీ శ్మశానవాటిక. ఇక్కడ దహన సంస్కారాలను చేపట్టేందుకు ఐడీ ప్రూఫ్‌తో రిజిస్టర్ చేసుకోవాలని ట్రస్ట్ ప్రతినిధి రంజన్ సూద్ తెలిపారు. దహన సంస్కారాలకు రూ. 3,000 నుంచి రూ. 3700 వరకు ఫీజు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆమోదంతో త్వరలో ఈ వాటిక నుంచే డెత్ సర్టిఫికెట్లను జారీ చేస్తామన్నారు.