కాలుష్యరహితంగా హైదరాబాద్‌ | Telangana CM Revanth Reddy for reforms to make Hyderabad pollution-free | Sakshi
Sakshi News home page

కాలుష్యరహితంగా హైదరాబాద్‌

Jul 30 2025 4:13 AM | Updated on Jul 30 2025 4:13 AM

Telangana CM Revanth Reddy for reforms to make Hyderabad pollution-free

అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

వచ్చే 25 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు 

ఔటర్‌ రింగు రోడ్డు వెలుపలకు పరిశ్రమలు 

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం 

భూగర్భ డ్రైనేజీ, కేబులింగ్‌పై సమగ్ర డీపీఆర్‌లు 

పుర పాలక, పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చి పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ నగరానికి అవసరమైన భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నగరం నడిరోడ్డున (కోర్‌ సిటీ) ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌ రింగు రోడ్డు వెలుపలకు తరలించాలని ఆదేశించారు. మంగళవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి 
హైదరాబాద్‌ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు వచ్చే 25 ఏళ్ల అవసరాలను   దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయా లని సీఎం చెప్పారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని శాఖలు  సమగ్ర డీపీఆర్‌లు తయారు చేయాలన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పాటు నిర్మాణ రంగ వ్యర్థాలను ఇష్టారీతిన డంప్‌ చేయకుండా చూడాలని ఆదేశించారు.

ఉద్దేశపూర్వకంగా డంప్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో మంచినీరు, మురుగు నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సది్వనియోగం చేసుకునేలా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సీవరేజీ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. 

పర్యాటక ప్రదేశాలుగా వారసత్వ కట్టడాలు 
    ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉన్న వారసత్వ కట్టడాలను సంరక్షించడంతో పాటు పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కులీకుతుబ్‌ షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మార్గదర్శకాలను సవరించాలని సీఎం రేవంత్‌ సూచించారు. పాతబస్తీలో మెట్రో రైలు మార్గం పనులపైనా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలన్నారు. ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ వరకు ఎలివేటేడ్‌ కారిడార్‌ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో భాగంగా హిమాయత్‌సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్‌గూడ జంక్షన్‌లో మూసీ రివర్‌ ఫ్రంట్‌కు ప్రతీకగా గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, ఇండియా గేట్, చారి్మనార్‌ తరహాలో ల్యాండ్‌ మార్క్‌ను నిర్మించాలని ఆదేశించారు.  

మీరాలం ట్యాంకు వద్ద అధునాతన హోటల్‌ 
    నెహ్రూ జూ పార్క్, మీరాలం ట్యాంక్‌ అభివృద్ధి పనుల పురోగతిపైనా సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్‌ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్‌ నిర్మించాలని ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్‌తో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్‌ ఉండాలని సూచించారు.

సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు ఇలంబర్తి, టీకే శ్రీదేవి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ కె.శశాంక, వాటర్‌ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మయాంక్‌ మిత్తల్, మెట్రో రైలు ఎండీ ఎనీ్వఎస్‌ రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement