breaking news
environmentally friendly funerals
-
కాలుష్యరహితంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చి పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరానికి అవసరమైన భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నగరం నడిరోడ్డున (కోర్ సిటీ) ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించాలని ఆదేశించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయా లని సీఎం చెప్పారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని శాఖలు సమగ్ర డీపీఆర్‌లు తయారు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పాటు నిర్మాణ రంగ వ్యర్థాలను ఇష్టారీతిన డంప్ చేయకుండా చూడాలని ఆదేశించారు.ఉద్దేశపూర్వకంగా డంప్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో మంచినీరు, మురుగు నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సది్వనియోగం చేసుకునేలా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సీవరేజీ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పర్యాటక ప్రదేశాలుగా వారసత్వ కట్టడాలు ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న వారసత్వ కట్టడాలను సంరక్షించడంతో పాటు పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించాలని సీఎం రేవంత్ సూచించారు. పాతబస్తీలో మెట్రో రైలు మార్గం పనులపైనా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలన్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటేడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్‌గూడ జంక్షన్లో మూసీ రివర్ ఫ్రంట్‌కు ప్రతీకగా గేట్ వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్, చారి్మనార్ తరహాలో ల్యాండ్ మార్క్‌ను నిర్మించాలని ఆదేశించారు. మీరాలం ట్యాంకు వద్ద అధునాతన హోటల్ నెహ్రూ జూ పార్క్, మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపైనా సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్‌తో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలని సూచించారు.సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు ఇలంబర్తి, టీకే శ్రీదేవి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె.శశాంక, వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిత్తల్, మెట్రో రైలు ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. -
ఖననంలోనూ పర్యావరణహితం
చనిపోకముందే సమాధులు కట్టించుకోవడం గురించి విన్నాం. పిల్లల్లేని వారు, పోయాక ఎవరూ పట్టించుకురని భావించేవారు ముందుచూపుతో అలా చేస్తుంటారు. ఈ ధోరణి బ్రిటన్‌లోనూ ఉంది. కాకపోతే అందులోనూ పర్యావరణ హితానికి వాళ్లు పెద్దపీట వేస్తుండటం విశేషం. యూకే వాసులు తమ అంత్యక్రియల కోసం ఎకో ఫ్రెండ్లీ శవపేటికలను ఎంచుకుంటున్నారు. యూకేలో అంత్యక్రియల్లో 80 శాతం దాకా ఖననాలే ఉంటాయి. అందుకు వాడే శవపేటికలు హానికర రసాయనాలతో తయారవుతున్నాయి. పైగా వాటిలో మృతదేహాల నిల్వకు వాడే ఫార్మాల్డిహైడ్ పర్యావరణానికి హానికారకమే. అది నేరుగా మట్టిలో కలుస్తుంది. కార్బన్ కన్సల్టెన్సీ సంస్థ ప్లానెట్ మార్క్ అధ్యయనం ప్రకారం ఒక్కో శవపేటిక నుంచి ఏకంగా లండన్–పారిస్ విమానం వదిలే కర్బన ఉద్గారాలకు సమానమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. శవపేటికను ఆరడుగుల లోతున పాతేస్తారు. ఇది మట్టిలో కలవడానికి వందేళ్లు పడుతోందట. కళాకృతి నుంచి వ్యాపారం వైపు బతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తరువాత పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధానంపై బ్రిటన్వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఎకోఫ్రెండ్లీ శవపేటికలను ఎంచుకుంటున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ‘ఎకో ఫ్రెండ్లీ’ అంత్యక్రియలను కోరుకుంటున్నట్లు ఇటీవల యూగవ్ నిర్వహించిన కో–ఆప్ ఫ్యునరల్ కేర్ సర్వేలో తేలింది. స్వతహాగా కళాకారిణి అయిన వెస్ట్ యార్క్‌షైర్‌లోని హెబ్డెన్ బ్రిడ్జికి చెందిన రేచల్ చావు, దుఃఖం, ప్రకృతి ఇతివృత్తంతో క్రియేటివ్‌గా శవపేటికను చేశారు. దాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దారు. స్నేహితుడికోసం ఊలు, చెట్ల ఆకులు, నార, ఇతర పదార్థాలతో పర్యావరణహితమైన శవపేటికను తయారు చేయడంతో అది ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది. యూకే అంతటా వ్యాపారం.. ఈ ఎకోఫ్రెండ్లీ శవపేటికలను కేవలం మూడు అడుగుల లోతులో మాత్రమే పాతేస్తారు. అయినా.. భూమి పైపొరల్లో ఉండే క్రిముల వల్ల, శవపేటికల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో శరీరాలు కుళ్లిపోవడానికి 20 నుంచి 30 ఏళ్లు మాత్రమే పడుతుందట. అందుకే మరణానంతరమూ తమవల్ల భూమి కాలుష్యం కాకూడదనుకుంటున్న వ్యక్తులు వీటిని ఎంచుకుంటున్నారు. రేచల్ 2016లో ప్రారంభించిన ఈ వ్యాపారం విస్తరించింది. ఇప్పుడు యూకే అంతటా ఈ ఎకో ఫ్రెండ్లీ స్మశాన వాటికలున్నాయి. భూమికి మేలు చేయాలనుకునేవారు తమను సంప్రదిస్తున్నారని రేచల్ చెప్పారు. ఇతర పర్యావరణ అనుకూల పరిశ్రమల మాదిరిగా, సహజ సమాధులకు ఎక్కువ ఖర్చు అవుతుంది.‘‘ఈ భూమ్మీద నా చివరి చర్య కాలుష్య కారకమైనదిగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. జీవితమంతా పర్యావరణహితంగా జీవించిన తాను.. మరణం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్న’’ అని చెప్పే 50 ఏళ్ల రేచల్ సొంతంగా శ్మశానవాటికను తయారు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉద్యాన వనాలుగా శ్మశానాలు
సిడ్నీ: ఊరవతలి దిబ్బపైనున్న శ్మశానంలో ఎండుటాకుల మధ్య నిట్ట నిలువుగా నిలబెట్టిన సమాధి రాళ్లను చూస్తే పగలే భయం వేస్తుంది. ప్రేతాత్మలను నమ్మే వారి సంగతి ఇక చెప్పక్కర్లేదు. అలాంటి చోటుకు వెళ్లి గతించిన ఆత్మీయులను తలచుకోవాలంటే, వారికి శ్రద్ధాంజలి ఘటించాలంటే గుండెల్లో గుబులు తప్పదు. ఆధునిక జీవన శైలిలో భాగంగా శ్మశానాలు కూడా ఇప్పుడు సుందర నందన ఉద్యాన వనాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో సమాధి రాళ్ల స్థానంలో చెట్లు పుట్టుకొచ్చాయి. ఆత్మీయులను సమాధి చేసిన చోట పెంచుతున్న మొక్క ఏపుగా పెరుగుతుందా, లేదా ? ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, అసలు ఆ మొక్క ఎక్కడుందో గుర్తించేందుకు మొబైల్ యాప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ అదే కోవలో ఎకో ఫ్రెండ్లీ శ్మశానానికి డిజైన్ చేసింది. పరిసరాలు అహ్లాదకరంగా ఉండేందుకు చుట్టూ చెట్లు నాటినా, శ్రద్ధాంజలికి సంబంధించిన సంస్కారాలు చేసేందుకు వీలుగా సమాధి స్థలాన్ని ఖాళీగానే వదిలేస్తున్నారు. వాటిపై సమాధి రాళ్లు కూడా ఉండవు. పేరు, ఊరు రాసి మార్కు చేసి కూడా ఉండదు. అయితే ఎవరి సమాధి ఎక్కడుందో గుర్తించేందుకు వీలుగా జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వ్యవస్థ ద్వారా సమాధుల జాడ కచ్చితంగా తెలుసుకోవచ్చు. సిడ్నీకి శివారులో ఓ 25 ఎకరాల స్థలంలో ‘అకేషియా రిమంబ్రెన్స్ సాంక్చరీ’ అనే సంస్థ, సిడ్నీలోని క్రోఫీ ఆర్కిటెక్ట్స్‌తో కలసి ఉద్యానవనం లాంటి ఈ ఎకో ఫ్రెండ్లీ శ్మశానాన్ని నిర్మిస్తోంది. అందమైన ల్యాండ్ స్కేప్తోపాటు గలగలపారే సెలయేళ్లు, వివిధ రకాల పుష్పాలతో బంధువులు సేదతీరేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నామని సాంక్చరీ యజమానులు తెలియజేస్తున్నారు. లండన్‌లో కూడా ఇలాంటి ఓ శ్మశాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందని వారు చెప్పారు.