సాక్షి, ముషీరాబాద్: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉమెన్స్ హాస్టల్‌లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వాష్‌రూమ్‌లో షార్ట్ సర్య్కూట్‌తో గీజర్ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు.. మంటలు వ్యాపించిన సమయంలో హాస్టల్‌లో ఉన్న ఇద్దరు అమ్మాయిలను స్థానికులు నిచ్చెన సాయంతో కిందకు తీసుకువచ్చినట్టు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీనగర్‌లో ‘సుధామ పీజీ అకామిడేషన్ ఫర్ విమెన్’ హాస్టల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా, వాష్‌రూమ్‌లో షార్ట్ సర్య్కూట్‌తో గీజర్ పేలి మంటలు చెలరేగినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్‌లో విద్యార్థినులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, హాస్టల్‌లో మంటలు వేగంగా వ్యాపించి భవనం నుండి భారీగా పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో హాస్టల్‌లోని ఫర్నిచర్, దుస్తులు, ఇతర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇక, హాస్టల్ యజమాన్యం నుండి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


