
నా వయసు 32 సంవత్సరాలు. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు పని ఉంటుంది. ఇంటికి వచ్చాక వంట, పిల్లాడి హోంవర్కు, ఇల్లు చూసుకోవడం అన్నీ నామీదే పడతాయి. నా భర్త కూడా ఇంకో ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగి. ఇంటి పనుల్లో అసలు సహాయం చేయడు.
దీనివల్ల నాకు ఎప్పుడూ అలసటగా, చిరాకుగా అనిపిస్తుంటుంది. దీనికితోడు నాభర్త, అత్తమామలు ఇప్పుడు ఇంకో బిడ్డ కావాలని ఒత్తిడి చేస్తున్నారు. బ్యాంక్ పనిలో వత్తిడి, అత్త మామల విమర్శలు, భర్త సపోర్ట్ లేకపోవడం... ఇలా వీటన్నిటి మధ్య చాలా అశాంతికి లోనవుతున్నాను. మీరే ఏదైనా మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను.
– దీపిక, నిజామాబాద్
మీది మన సమాజంలో చాలామంది మహిళలు ఎదుర్కొనే పరిస్థితే! పని, ఇల్లు రెండూ ఒంటరిగా మేనేజ్ చేయడం వల్ల అలసట, చిరాకు రావడం సహజం. అందుకే ముందుగా మీ భర్తతో ఓపిగ్గా మాట్లాడి అతను కూడా ఇంటి పనులు పంచుకోవడం అవసరమని చెప్పండి. చిన్న చిన్న పనులలో అయినా సరే అతను చేసే సహాయం మీ అలసటను తగ్గించడమే కాకుండా మీ మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తుందని అతనికి అర్థం అయ్యేలా వివరించండి. మీ అత్తమామలు, భర్త, ఇంకో పిల్లాడు కావాలని వత్తిడి తెస్తున్నారని చెప్పారు.
పిల్లల విషయం అనేది మీరు, మీ భర్త కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప మీ అత్తమామలు నిర్ణయించే విషయం కాదని మీ ఆయనకి నచ్చ చెప్పండి. మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా సిద్దం కాకతే కేవలం వాళ్ళ వత్తిడి మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం మీ అత్త మామలని మీ ఇంట్లోనే ఉండమని మీ బాబును చూసుకోవడంలో, ఇంట్లో పనుల్లో సహాయం చేయమని అడగండి. వాళ్ళు అందుకు ఒప్పుకుంటే అప్పుడు రెండో పిల్లాడి గురించి ఆలోచించవచ్చు.
ఉద్యోగం, కుటుంబం రెండూ కలిపి నడపడం కష్టం అయినా, అసాధ్యం అయితే కాదు! ఇంట్లో పనుల కోసం పని వాళ్ళని ఏర్పాటు చేసుకోండి. ఆఫీస్ లో కూడా అన్ని పనులు మీ నెత్తిమీద వేసుకోకుండా మిగిలిన మీ వారికి కూడా డెలిగేట్ చేయడం నేర్చుకోండి. అలాగే మీకోసం రోజుకు కొంచెం సమయం కేటాయించండి.. కాసేపు నడక, ధ్యానం, సంగీతం, లేదా మీకు ఇష్టమైన పనులు చేస్తూ రిలాక్స్ అవ్వండి.
వర్క్, పర్సనల్, ఫ్యామిలీ లైఫ్‌ను, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే, మీ వత్తిడి క్రమేణా తగ్గుతుంది. కావాలంటే మీ దంపతులు ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఒకసారి కౌన్సెలింగ్‌కి వెళ్తే కౌన్సిలర్స్ మీకు సరైన నిర్ణయం తీసుకునేందుకు సహాయం చేస్తారు. ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
(చదవండి: డిప్యూటీ కలెక్టర్‌గా స్విగ్గీ డెలివరీ బాయ్..! తండ్రి మేస్త్రీ, డ్రీమ్ ఆకాశమంత..)