డిసెంబర్ 28న కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్
మెడల్, టీషర్టుల ఆవిష్కరణ పూర్తి
కామినేని ఆస్పత్రి ఆడిటోరియంలో ఘనంగా కార్యక్రమం
హైదరాబాద్: ఆరోగ్యం, ఫిట్నెస్‌పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2025కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ రన్నర్స్ సంస్థలో భాగంగా ఏర్పడిన ఎల్బీనగర్ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక వార్షిక రన్నింగ్ ఈవెంట్ ఈ నెల డిసెంబర్ 28న ఘనంగా జరగనుంది.
ఈ మారథాన్‌కు సంబంధించిన టీషర్టులు, మెడళ్ల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి ఇందిరా ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కామినేని ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డా.గోకుల్ రఘురామ్, ఆస్పత్రి మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఏఆర్ఎస్ సత్యనారాయణలు పాల్గొని అధికారికంగా టీషర్టులు, మెడళ్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎల్‌బీ నగర్ రన్నర్స్కు చెందిన సుమారు 30 మంది రన్నర్లు, అలాగే కామినేని ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఈ ఈవెంట్కు తమ మద్దతు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వార్షిక రన్నింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతీ సంవత్సరం పాల్గొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం విశేషం. హైదరాబాద్ నగరంతో పాటు నగరం వెలుపల ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజూ నడక, పరుగులపై ఆసక్తి ఉన్న అనేక మంది ఈ మారథాన్లో పాల్గొంటున్నారు.

ఈ సంవత్సరం నిర్వహించనున్న కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2025లో మొత్తం నాలుగు విభాగాలు ఉన్నాయి. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు), 10 మైళ్లు (16.1 కిలో మీటర్లు), 10 కిలో మీటర్లు, 5 కిలోమీటర్లు. ఈ నాలుగు విభాగాల్లో కలిపి సుమారు 2,000 మంది రన్నర్లు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 28న ఆదివారం ఉదయం నిర్వహించనున్న ఈ రన్నింగ్ ఈవెంట్లో ఆరోగ్యం, ఫిట్నెస్పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్బీనగర్ రన్నర్స్ నిర్వాహకులు పిలుపునిచ్చారు.


