
అతడి డ్రీమ్ ఆకాశమంత..కానీ కుటుంబ నేపథ్యం ప్రకారం అంత ఈజీ కాదు. అయినా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆహర్నిశలు కష్టపడి అనుకున్నది సాధించి తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచాడు. నాడు డెలివరీ బాయ్ అనిపిలిచినవాళ్లే..గౌరవంతో లేచినిలబడే స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఇది అతడి ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాట ఫలితం.
అతనే జార్ఖండ్(Jharkhand)కి చెందిన సూరజ్ యాదవ్(Suraj Yadav). అతడి తండ్రి సాధారణ మేస్త్రీ. అతడి కుటుంబం తరుచుగా ఆర్థిక సమస్యలతో అల్లాడుతుండేది. కానీ ఈ పరిస్థితలు ఎలా ఉన్నా అతడి కల మాత్రం ఆకాశమంత పెద్దది పెట్టుకున్నాడు. అయితే అతడు జీవనోపాధి కోసం తన స్నేహితులు సాయంతో సెకండ్‌హ్యాండ్ బైక్ కొనుగోలు చేసి ఫుడ్ డెలివరి ఏజెంట్‌గా, బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇక అతడి సోదరి ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేది.
ఇక అతడి స్నేహితులు, భార్య భావోద్వేగ పరంగా మద్దతిస్తూ ప్రోత్సహించేవారు. పగలంతా ఈ ఉద్యోగాలతో తన శరీరం ఎంతలా అలిసిపోయి విశ్రాంతి కోరేదో తనకే తెలుసనని, అయితే తన డ్రీమ్ తనని బలంగా ముందుకు నడిపించిందని చెప్పుకొచ్చాడు. అలా సూరజ్ ఎనిమిదేళ్ల కష్టానికి ఫలితంగా..జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షలో ఉత్తీర్ణుడై..110వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్(Deputy Collector)గా నియమాకం పొందాడు. ఇక ఇంటర్వ్యూలో బోర్డు మెంబర్లకి తన డెలివరీ ఉద్యోగం సమయ నిర్వహణను, లాజిస్టిక్స్‌కి సంబంధించిన విలువైన పాఠాలు నేర్పించిందని వివరించి మెప్పించాడు.
నిర్వాహకుడిగా తనకు సహాయపడ్డ ఈ నైపుణ్యాలే తన ఉద్యోగంలో తనకెంతగానో తోడ్పడతాయని కూడా ఆత్మవిశ్వాసంగా చెప్పాడు. ఇక సూరజ్ ఈ విజయం అందుకున్న వెంటనే చాలా భావోద్వేగంగా అనిపించిందని, ఈ విషయం తన భార్యతో ఫోన్‌లో చెప్పిన వెంటనే తనివితీర ఏడ్చేశామని ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించాడు కూడా. ఎనిమిదేళ్ల వివాహ అనంతరం తమ కలలన్నీ నిజమవుతున్న వేళ అని చాలా ఆనందంగా చెప్పుకొచ్చాడు సూరజ్.
అంతేగాదు ఇంతకుముందు అందరూ స్విగ్గీ డెలివరీ బాయ్(Swiggy Delivery Boy) అనిపిలిచేవారు కానీ ఇప్పుడూ డిప్యూటీ కలెక్టర్‌గారు అని గౌరవంగా పిలుస్తారని సగౌర్వంగా చెప్పాడు. ఇక తాను చేసిన రెండు ఉద్యోగాలు చాలా అమూల్యమైన పాఠాలు నేర్పించాయని, ఒకటి మనగడ ఎలా అనేది, మరొకటి సేవ చేయడం ఎలాగో తెలియజేసిందని చెప్పుకొచ్చాడు. ఇక్కడ సూరజ్ కథ దృఢ సంకల్పం గురించే కాదు ఏ పనైనా చులకనగా కాదు నిబద్ధతతో చేస్తే..సక్సెస్‌కి మార్గం ఏర్పడుతుందని చాటి చెప్పాడు.
(చదవండి: ఆ టీనేజర్ స్థైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..! ఆమె కథ వింటే కన్నీళ్లు ఆగవు..)