
‘‘డాక్టర్! మా బిడ్డ ఫోన్‌లో కార్టూన్ పెడితేనే తింటాడు.’’ ‘‘సర్! నా భర్తకు నాతో మాట్లాడటానికి టైం లేదు. ఆయన ఎప్పుడూ వాట్సాప్‌లోనే ఉంటాడు. చూస్తేనే చిరాకేస్తుంది.’’ ‘‘మా అమ్మానాన్న ఎప్పుడూ రీల్స్‌లోనే బిజీ. వాళ్లతో మాట్లాడాలంటే కూడా వెయిట్ చేయాలి.’’ ఇవి నా కౌన్సెలింగ్ రూమ్‌లో ప్రతిరోజూ వినిపించే మాటలు. చాలామంది తల్లిదండ్రులు తమ పనులకు అడ్డు రాకుండా ఉంటారని పిల్లలకు ఫోన్ ఇస్తారు. ‘‘పని చేసుకోవాలి కదా’’ అని సమర్థించుకుంటారు.
కాని, ఆ రెండు నిమిషాల కంఫర్ట్ వల్ల పిల్లల మనసులు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఒక సైలెంట్ గ్యాప్ వస్తోంది. ‘‘నువ్వు నాకు టైమ్ ఇవ్వవు’’ అనే మాటకు బదులు – ఇద్దరూ ఒకే మంచం మీద పక్కపక్కన పడుకుని స్క్రీన్‌లతో బతుకుతున్నారు. ఒకప్పుడు కుటుంబ సమస్యలంటే కుర్రాళ్ల ప్రేమలు, అత్తాకోడళ్ల గొడవలు, భార్యాభర్తల వివాదాలు, పిల్లల మార్కుల టెన్షన్లు. కాని, ఇప్పుడు కౌన్సెలింగ్ రూమ్‌లోకి వస్తున్న కొత్త సమస్య – స్మార్ట్‌ఫోన్. ఈ చిన్ని యంత్రం – ఒక వైపు మనిషికి వరం, మరో వైపు నిశ్శబ్దంగా మన కుటుంబాల్ని కాలుస్తున్న శాపం.
వరం లాంటి అద్భుతం
మన జీవితంలో స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చిన విప్లవం అపారమైనది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. · ఇది కొద్ది సెకన్లలో జ్ఞానం, విద్య, సమాచారాన్ని అందిస్తుంది. · మ్యాప్‌లు, మెడిసిన్, బ్యాంకింగ్ అన్నీ ఒక క్లిక్ దూరంలో.
దూరంగా ఉన్నవారిని వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా దగ్గర చేస్తుంది.
కరోనా కాలంలో పాఠశాలలు, ఉద్యోగాలు, వైద్య సలహాలు అన్నీ ఫోన్ ద్వారానే నడిచాయి. · ఒక్క మాటలో చెప్పాలంటే, స్మార్ట్‌ఫోన్ మనిషిలో భాగంగా మారిపోయింది.
శాపంగా మారిన వరం
‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటారు పెద్దలు. స్మార్ట్ ఫోన్ విషయంలో ఇది నూటికి నూరుపాళ్లు నిజం. అతిగా వాడటంతో మన చేతిలోని ఫోన్ ఒక డిజిటల్ జైలుగా మారిపోయింది. · పసిపాపలు తినడానికి ఫోన్ కావాలి.
పిల్లలు ఆడుకోవడానికి స్క్రీన్ కావాలి.
యువత రీల్స్, గేమ్స్‌కు బానిసలైపోయారు.
భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది.
పెద్దలకు నిద్ర, ప్రశాంతత దూరమయ్యాయి.
మనిషి తల వంచి నడవడం ఇప్పుడు సిగ్గుతో కాదు – నోటిఫికేషన్ చూడటానికి. ఒకప్పుడు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని తినేవారు, ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చుని మొబైల్ స్క్రోల్ చేస్తున్నారు. ఇది ఒక సామాజిక విపత్తుగా మారింది అనడంలో ఆశ్చర్యం లేదు.
అతి వాడకంతో అనర్థాలు
సైకాలజిస్టుల దృష్టిలో, స్మార్ట్‌ఫోన్ వినియోగానికి మూడు స్థాయులు ఉన్నాయి.
వాడుక – అవసరమైన పనులకే వాడటం.
దుర్వినియోగం – అవసరం లేకపోయినా గంటలు గంటలు స్క్రోల్ చేయడం.
వ్యసనం – చేతిలో ఫోన్ లేకపోతే ఆందోళన, కోపం, మనసంతా శూన్యంలా అనిపించడం.
జనాభాలో చాలామంది ఇప్పటికే మూడో దశలో ఉన్నారు. దీనివల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అనేకానేక కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి.
నిరంతర నోటిఫికేషన్లతో మెదడు ఫోకస్ కోల్పోతుంది. పిల్లలు ఏకాగ్రత నేర్చుకోలేరు.
సోషల్ మీడియాలో పోలికల వల్ల డిప్రెషన్, అసూయ పెరుగుతుంది. ఫోన్ వల్ల భర్త–భార్యలు, తల్లిదండ్రులు– పిల్లలు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడడం తగ్గిపోతుంది.
మనిషి విలువను లైక్స్, ఫాలోవర్స్‌తో కొలుస్తున్నాం. · ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది, ఆందోళన పెరుగుతుంది.
సరిహద్దులు తప్పనిసరి
స్మార్ట్‌ఫోన్ ఒక వరం. కాని అది మనసు, బంధాలు, పిల్లల వికాసం కన్నా పెద్దదిగా మారితే – అదే శాపంగా మారుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్ ప్రభావాలు, దుష్ప్రభావాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అడిక్షన్ నుంచి తప్పించుకునే మార్గాల గురించీ వారం వారం సవివరంగా తెలుసుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం.
ముందుగా గ్రౌండ్ రూల్స్...
రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఫోన్ అస్సలు ఇవ్వకూడదు.
డైనింగ్ టేబుల్, బెడ్‌రూమ్ ఫోన్ ఫ్రీ జోన్లుగా మార్చాలి.
వారంలో ఒక రోజు డిజిటల్ ఫాస్టింగ్ చెయ్యాలి.
ఫ్యామిలీ టైమ్‌లో ఫోన్ పక్కన పెట్టేయాలి.
ముందుగా తల్లిదండ్రులే రోల్ మోడల్స్‌గా నిలవాలి. · పేరెంట్స్, స్పౌసెస్, ఇండివిడ్యువల్స్– ఈ రోజు ఒక ప్రశ్న అడగండి: ‘‘నా చేతిలో ఉన్న ఫోన్ నా జీవితానికి వరమా? శాపమా? ఆక్సిజనా? జైలా?’’
సైకాలజిస్ట్ విశేష్
ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్
www.psyvisesh.com
(చదవండి: గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందలు వాడాల్సిందేనా..?)