పట్టువిడుపులుంటేనే పరిష్కారం! | Expert advice on Sadabainama | Sakshi
Sakshi News home page

పట్టువిడుపులుంటేనే పరిష్కారం!

Sep 17 2025 1:32 AM | Updated on Sep 17 2025 1:33 AM

Expert advice on Sadabainama

సాదాబైనామాపై నిపుణుల సూచన

చట్టం, నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకూడదు 

ఉదారంగా వ్యవహరిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం  

అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్‌ ఇవ్వాలనే నిబంధన రైతుకు ఇబ్బందికరంగా మారే చాన్స్‌ 

మళ్లీ కోర్టు కేసులు, ఇతరత్రా తలనొప్పులకు అవకాశం 

దీనిపై సానుకూలంగా ప్రభుత్వం! 

చుట్టుపక్కల వారిని విచారించి క్రమబద్ధీకరించాక నిబంధనగా చేర్చే యోచన.. ప్రత్యేక మార్గదర్శకాలతో ముందుకు వెళ్లాలంటున్న నిపుణులు  

సాక్షి, హైదరాబాద్‌: సాదా బైనామా.. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల దర ఖాస్తులకు సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది.  క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న, వ్యవహరించాల్సిన తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.  చట్టం, నిబంధనల పేరుతో రైతులపై కఠినంగా కాకుండా అందరి ఆమోదం మేరకు ఉదారంగా వెళ్లడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు.  

తొలుత మూడు.. ఆ తర్వాత మరిన్ని 
గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం తెచ్చినప్పుడు సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త అంశాలను చేర్చింది. సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకుని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉండాలని, సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది. 

అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13 బీ సర్టిఫికెట్‌ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాపై విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్‌ ఇవ్వాలనే నిబంధనలు విధించారు.
  
ఈ అఫిడవిట్‌తోనే తంటా.. 
రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరించే క్రమంలో చట్టంలోని నిబంధనల మేరకు వెళ్తే సన్న, చిన్నకారు రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తాయని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిష్కరించకుండా వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం సదరు దరఖాస్తులను పరిష్కరించకపోగా, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని, కోర్టుల పాలు చేసిందనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2007 కంటే ముందు సాదా బైనామాలను పరిష్కరించే సమయంలో అమ్మిన వ్యక్తి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఉండేది. 

కానీ దివంగత వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనను తీసేశారు. ఎప్పుడో అమ్మిన వ్యక్తి ఇప్పుడు అంగీకరించేందుకు ఇష్టపడక పోవచ్చు కాబట్టి చుట్టుపక్కల రైతులను విచారణ చేసి, లేదంటే గ్రామ పెద్దల స్టేట్‌మెంట్‌ ఆధారంగా కూడా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు పహాణీలోని సాగుదారు కాలమ్‌లో ఉన్న కొన్న వ్యక్తి పేరును ఆధారంగా పరిగణనలోకి తీసుకునేవారు. 2009–16 వరకు ఇదే పద్ధతిలో సాదా బైనామాలు క్లియర్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్న వారితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్‌ ఇవ్వాలంటే సమస్యను సృష్టించడమేనంటూ, ఆ నిబంధనను తొలగించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రైతుల నుంచి రాతపూర్వక అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు చుట్టు పక్కల రైతులను విచారించాలనేది నిబంధనగా చేర్చాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.  

ఆ దరఖాస్తుల సంగతేంటి? 
సాదా బైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 9.84 లక్షల దరఖాస్తులు రాగా కొన్నింటిని అప్పట్లోనే పరిష్కరించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాల పరిష్కార అంశం లేనప్పటికీ ఆన్‌లైన్‌లో వచ్చిన దాదాపు 4 లక్షల దరఖాస్తులపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారని, అందులో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారని తెలుస్తోంది. 

అయితే కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారం కోసం 2020లో దరఖాస్తు చేసి ఉండాలని మాత్రమే ఉంది కానీ, అప్పట్లో తిరస్కారానికి గురైతే మళ్లీ పరిశీలించకూడదని లేదు. ఈ చట్టం నిబంధనల్లోనూ దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం గురించిన ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మధ్యలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాల్సిందేనని నిపుణులు చెపుతున్నారు. 

అన్నింటి కంటే ముఖ్యంగా చట్టం, నిబంధనలపైనే ఆధారపడకుంగా సమ్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సాదా బైనామాలను ఉదారంగా పరిష్కరించకపోతే మరోమారు పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి రైతులు నష్టపోతారని, మళ్లీ సివిల్‌ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. చెక్‌లిస్టు, ఎంక్వైరీ ఫార్మాట్, ప్రాసెస్‌ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని అంటున్నారు. 

ఉదారంగా వెళ్లడమే మేలు 
సాదా బైనామా అనేది తెలంగాణలో పెద్ద భూసమస్య. 1989 నుంచి నలుగుతున్న సమస్య. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు సంబంధించింది. కొన్న మాట వాస్తవమా?.. కాదా?, సాగులో ఉన్నారా?.. లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలింకుని మిగిలిన అంశాల్లో పట్టుదలకు పోకుండా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అదే సమయంలో అవకతవకలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. 
– భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు 

సాదాబైనామా క్లియరెన్స్‌ కోసం ఏముండాలంటే...! 
– భూమి రైతు ఆదీనంలో కొనసాగుతుండాలి 
– 12 సంవత్సరాలుగా సదరు వ్యక్తి అనుభవంలో ఉండాలి 
– కొనుగోలు చేసినట్టుగా పత్రం లేదా పహాణీలోని సాగుదారు కాలమ్‌లో పేరు ఉండాలి.  

సాదా బైనామా.. కథా కమామిషు 
తెలంగాణ రైతాంగానికి సుపరిచితమైన ఈ సాదా బైనామాల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం రాజ్యం నుంచి నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర రైతాంగం కేవలం తెల్ల కాగితాలపై రాసుకోవడంతో పాటు నోటి మాటలతో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిపింది. వీటినే సాదా బైనామాలంటున్నారు. నిరక్షరాస్యతతో పాటు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కొందరు రైతులు ఈ ప్రక్రియ ద్వారా భూముల యాజమాన్య హక్కును మార్చుకునే వారు. కానీ కొన్ని వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హక్కులు వచ్చేవి కావు. 

తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)లో తొలిసారిగా 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1996, 97.. ఇలా ఇప్పటికి 13 సార్లు ఉచితంగా ఈ తరహా భూములను క్రమబద్ధీకరించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 2017లో కూడా క్రమబద్ధీకరణ జరిగింది. చివరిసారిగా 2020లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు. ఇప్పుడు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియనే జరుగుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement