
హైకోర్టు తీర్పు మేరకు సాదాబైనామాల క్రమబద్ధికరణకు సమయం పట్టే అవకాశం
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఆర్డీవోల ద్వారా నోటీసులు
క్రమబద్ధికరణ జరగాలంటే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిందే
రాష్ట్రంలో ఇప్పటివరకు 13 సార్లు సాదాబైనామాల క్రమబద్ధీకరణ
ఇంకోసారి అవకాశం లేకుండా భూభారతి చట్టంలో నిబంధన
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామాల క్రమబద్ధికరణ విషయంలో హైకోర్టులో ఉన్న అడ్డంకి తొలగిపోవడంతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఊరట లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 9.26 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, దాదాపు 10 లక్షల ఎకరాల భూమి ఈ దరఖాస్తుల పరిధిలో ఉంటుందని, ఈ మేరకు ఆ భూములన్నింటికీ త్వరలోనే విముక్తి లభిస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
అయితే, ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి అటూఇటుగా ఆరునెలల సమయం పట్టే అవకాశముంది. భూభారతి పేరుతో రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్‌వోఆర్ చట్టం ప్రకారం ఈ దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. రెవెన్యూ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే...!
⇒ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా సాదాబైనామాల ద్వారా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి తొలుత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి.
⇒ ఈ నోటిఫికేషన్ మేరకు పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల దరఖాస్తుదారులకు, సాదాబైనామాల ద్వారా ఆ భూమిని అమ్మిన వారికి ఆర్డీవో నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసుల జారీకి కనీసం నెలరోజుల సమయం పడుతుందని అంచనా.
⇒ ఈ నోటీసుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. ఆ భూమికి సంబంధించి తెల్ల కాగితంపై రాసుకున్న సాదాబైనామా లావాదేవీ సరైందా లేదా అన్నది పరిశీలించడంతోపాటు చుట్టుపక్కల ఉన్న రైతుల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు.
⇒ అప్పుడు సదరు భూమిని అమ్మింది, కొన్నది వాస్తవమే అని తేలితే ప్రత్యేక ఆర్డర్ ఇచ్చి రిజి్రస్టేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ కట్టి క్రమబద్ధికరించుకునే అవకాశం కల్పిస్తారు.
⇒ అలా స్టాంపు డ్యూటీ కట్టిన తర్వాత ఓ సర్టీఫికెట్ ఇస్తారు. ఈ సరి్టఫికెట్‌ను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద పరిగణనలోకి తీసుకుంటారు.
⇒ దీని ఆధారంగా ఆ భూమికి పాసు పుస్తకాలు వస్తాయి. ఈ సరి్టఫికెట్ ద్వారానే క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతాయి.
⇒ గతంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఉచితంగా చేసేవారు. కానీ, భూభారతి చట్టంలో మార్చిన నిబంధన ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి.
⇒ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2020లో దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు.
⇒ రాష్ట్రంలో ఇప్పటివరకు 13సార్లు సాదాబైనామాలను క్రమబద్ధికరించారు. 2020లో 14వ సారి జారీ చేసిన సాదాబైనామా ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ప్రక్రియకు మోక్షం కలగనుంది.
⇒ దీని తర్వాత సాదాబైనామాల క్రమబద్ధికరణకు ఆస్కారం ఉండదు. ఈ మేరకు భూభారతి చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించిన తర్వాత మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులను తీసుకునే వీల్లేదని పేర్కొన్నారు. మళ్లీ సాదాబైనామాల క్రమబద్ధికరణ చేపట్టాలనుకుంటే ఆ చట్టాన్ని సవరిస్తే కానీ సాధ్యం కాదు.
కోర్టు నిర్ణయం సంతోషకరం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ సమావేశాల్లో కూడా ఈ సాదాబైనామాలపై చాలాసార్లు చర్చించాం. అయితే, గతంలో అమల్లో ఉన్న ధరణి చట్టంలో సాదాబైనామాల పరిష్కార నిబంధనను పొందుపర్చలేదు. దీంతోనే కోర్టు కొట్టివేసింది. కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంలో ఆ నిబంధన పెట్టాం. ఇప్పుడు ఇదే నిబంధన ఆధారంగా కోర్టు సానుకూల తీర్పునిచ్చింది. ఇప్పటికైనా దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైనందుకు సంతోషంగా ఉంది. – భూమి సునీల్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు