
జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి విక్రమార్క, కొండా సురేఖ, జూపల్లి, పొంగులేటి, శాంతికుమారి, ఉత్తమ్, దామోదర, శ్రీధర్‌బాబు, వేం నరేందర్‌రెడ్డి
వేసవిలో ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకూడదు
ప్రతి గ్రామంలో తాగు నీటి వనరులు, సరఫరా పర్యవేక్షించాలి
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
భూ సమస్యలను ఇకపై రెవెన్యూ యంత్రాంగమే పరిష్కరిస్తుంది
గతంలో రైతులను న్యాయ స్థానాల మెట్లు ఎక్కించారు
భూభారతిపై ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలన్న సీఎం
ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు కేటాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. తాగునీటి సరఫరా విషయంలో నీటి పారుదల శాఖ, తాగునీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో వేసవి తాగునీటి ప్రణాళిక, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్లు డ్యాష్ బోర్డు ద్వారా ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా సమ స్య తలెత్తితే పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలని చెప్పారు. పలు గ్రామాలకు తాగు నీటి సరఫరా పైపులైను వ్యవస్థ లేదని, పలు ఇళ్లకు నల్లాలు లేవని.. ఆయా ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు. కోయగూడేలు, చెంచు పెంటలు, ఇతర గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.
భూభారతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి
గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను న్యాయస్థానాల మెట్లు ఎక్కించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా విస్తృత అధ్యయనం తర్వాత తీసుకువచ్చిన భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రెవెన్యూ యంత్రాంగమే ఇకపై ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దీనిపై అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైతులు, ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.
ఈ చట్టాన్ని క్షేత్ర స్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలని, ప్రతి జిల్లా కలెక్టర్ మండల స్థాయి సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమ య్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలని చెప్పారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఈ రెండింటినీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
భూభారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారని, ఆయా మండల కేంద్రాల్లో సదస్సులకు కలెక్టర్లు కచ్చితంగా హాజరుకావాలని, ఆ మండలాల్లోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. వీటికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతారని తెలిపారు.
ఇళ్ల మంజూరులో ఒత్తిళ్లకు తలొగ్గొద్దు
గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచించారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపాలని.. ఇన్‌చార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖరారవుతుందని చెప్పారు. సరైన పర్యవేక్షణకు వీలుగా ప్రతి నియో జకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమి టీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని రేవంత్ వివరించారు.
గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గ వద్దని, ఎక్కడైనా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే మండల స్థాయి క మిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించా రు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇళ్ల కేటాయింపు ఉండాలని, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలని సూ చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూ పల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదా రు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, షబ్బీర్ అలీ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.