హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లి గ్రామంలో మావోయి స్టు పార్టీ అగ్రనేత మడ్వి హిడ్మా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన కొయ్యడ సురేశ్, మ్యాక బుచ్చయ్య స్థానిక ప్రధాన రహదారి వెంట చర్చి గోడలకు శుక్రవారం అర్ధరాత్రి దాటాక హిడ్మా ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఆ ఫ్లెక్సీలో ‘ఓ వీరుడా.. నువ్వు కన్న కల దోపిడీలేని స్వేచ్ఛా దేశం. నీ సింధూరం పీడిత జనానికి కొత్త పొద్దు. ప్రజల గుండెల్లో నీ చరిత్ర సజీవం. పీడిత జనాల స్వేచ్ఛా పోరాటానికి నీవు నిత్యం రణభేరి నినాదం. జనతన సర్కార్ ఆశయం చిరస్థాయి వీరుడా హిడ్మా.. నీ పోరాటం అమరం. లాల్ సలాం కామ్రేడ్’అని రాయించి ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గ్రామానికి వెళ్లి ఫ్లెక్సీని తొలగించారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.


