సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఎల్లో మీడియా వార్తలు ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా పిచ్చి రాతలు మానుకోవాలని హితవు పలికారు. మీడియా ముసుగులో ఫేక్ పోస్టులు పెట్టే ఎల్లో మీడియాపై చట్టపరంగా ముందుకు వెళ్తాం’ అని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ మొన్న హైదరాబాద్‌కు వస్తే ఆయనను చూసేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. దానిపై ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు ప్రచురించింది. హైదరాబాద్‌కు జగన్ వస్తే వేల మంది ఆంధ్ర నుంచి వచ్చారని ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాసింది. అలా రావాలంటే ఎన్ని వందల బస్సులు పెట్టాలో అర్థం చేసుకోండి. కోర్టు వారి అనుమతి లేకుండా వీడియోలు తీసి.. ఎలా ప్రచారం చేస్తారు?. చెత్త పలుకులు రాసే రాధాకృష్ణ అప్‌డేట్ కావాలి. రాధాకృష్ణ ఎప్పటికప్పుడు నేర్చుకొని వార్తలు రాయాలి. ఆంధ్రజ్యోతి, టీవీ5 జర్నలిజం కించపరిచే విధంగా వార్తలు ప్రచురిస్తున్నాయి. మీడియా ముసుగులో ఫేక్ పోస్టులు పెట్టే ఎల్లో మీడియాపై చట్టపరంగా ముందుకు వెళ్తాం.
రాధాకృష్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడా? న్యాయవ్యవస్థను నడుపుతున్నాడా? అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి.. కోర్టులో ఒక విధంగా, కోర్టు బయట ఒక విధంగా తప్పుడు వార్తలు రాసింది. జగన్ ఎక్కడ అడుగుపెట్టినా జన సునామే. జగన్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని చెత్త డిబేట్లు పెట్టి మాజీ ముఖ్యమంత్రిపై చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీ అంతు చూస్తాం. ఒక పార్టీ అధ్యక్షుడిని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్‌కౌంటర్ చేయాలి అనడం అహంకారానికి నిదర్శనం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాయబద్ధంగా పాలించారు. ఇవాళ ఆంధ్రాలో కొన్ని గ్రామాల్లో గ్రామాలను వదిలి పారిపోయే పరిస్థితికి చంద్రబాబు పాలన తీసుకొచ్చారు.


