రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ‘రాయలసీమ ఎత్తిపోతల’ ఇన్సూరెన్స్ లాంటిది
ఇలాంటి పథకాన్ని చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు
శ్రీశైలంలో 777 నుంచి 825 అడుగుల మధ్య రోజూ 8 టీఎంసీలు తరలిస్తున్న తెలంగాణ
ఇలాగైతే శ్రీశైలం 881 అడుగులకు ఎప్పుడు చేరాలి?
పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కులు ఎప్పుడు తరలించాలి?
అందుకే రాష్ట్రానికి హక్కుగా దక్కిన వాటా జలాలను వాడుకునేందుకే ‘రాయలసీమ ఎత్తిపోతల’కు శ్రీకారం
తెలంగాణ ప్రజలకు నష్టం చేయాలని ఏనాడూ అనుకోలేదని పునరుద్ఘాటన
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులంటూ నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న ప్రజల గొంతు తడపాలన్నదే మా తపన, తాపత్రయం
సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై ఈ పథకాన్ని ఆపేయించానన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను బాబు ఖండిస్తారని.. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టరని అందరూ ఆశించారు
కానీ.. బరితెగించి రాయలసీమ ఎత్తిపోతల అవసరమే లేదన్నారు.. జల వనరుల మంత్రితోనే ఆ మాట చెప్పించారు
తద్వారా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి–చంద్రబాబు రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లే
స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహం, మోసమైనా చేయడానికి బాబు వెనుకాడడని మరోసారి రుజువైంది
తన స్వార్ధం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే.. జన్మనిచ్చిన సీమకూ వెన్నుపోటు
ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రారంభించాలి.. లేదంటే ఉద్యమిస్తాం
మేం అధికారంలోకి రాగానే వాయువేగంతో పూర్తి చేస్తామని స్పష్టీకరణ
శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. తెలంగాణ 777–825 అడుగుల మధ్య రోజుకు 8 టీఎంసీల నీళ్లు వాడుకుంటుంటే, మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. ఇలాగైతే నీటి మట్టం ఎప్పుడు 881 అడుగులకు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కిందనున్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏమిటి ? చిత్తూరు జిల్లాలోనే పుట్టిన చంద్రబాబు ఏరోజైనా ఈ ఆలోచన చేశాడా?
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఖండిస్తారని అందరూ భావించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే స్థాయికి దిగజారిపోరని ప్రతీ రైతూ ఆశించారు. కానీ.. ఆశ్చర్యకర రీతిలో రాయలసీమ ఎత్తిపోతల అవసరమే లేదంటూ చంద్రబాబు బరితెగించి మాట్లాడటమే కాకుండా, జలవనరుల మంత్రితో మాట్లాడించిన మాటలు చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తను (చంద్రబాబు) చేసుకున్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లుగా కన్పిస్తోంది. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు వెనుకాడడని మరోసారి రుజువైంది. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే.. జన్మనిచ్చిన సీమకు కూడా ఏమాత్రం వెనుకాడకుండా వెన్నుపోటు పొడుస్తాడన్నది మరోసారి నిరూపితమైంది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, గాలేరుృనగరి, ఎస్సార్బీసీ, చెన్నైకి తాగునీరు రూపంలో దాదాపు 101 టీఎంసీల కేటాయింపులున్నాయి. ప్రస్తుత స్పిల్ లెవల్ 841 అడుగులు. ఈ స్థాయిలో నీరు ఉంటే కేవలం 2 వేల క్యూసెక్కులు వస్తుంది. 854 అడుగులకు నీరు చేరితే 7 వేల క్యూసెక్కులు వస్తుంది. ఈ లెక్కన పూర్తి సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నీరు కిందకు (కాలువలోకి) రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరాలి. గత 20 ఏళ్లలో కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు వాడుకోగలిగాం. మరొకవైపు యథేచ్ఛగా ఎత్తిపోతలు, పవర్ హౌస్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 8 టీఎంసీలను శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల అత్యంత అవశ్యం.
గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోతున్న ప్రజల గొంతు తడపాలని, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ ఉండదు. ఎప్పుడుచూసినా దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలు. ప్రజల కోసం చీకు, చింతా లేవు. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ దొంగ పనులే. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చేందుకు గతంలో కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే పథకమే ఇది.
కృష్ణా నదిలో వరద వచ్చే రోజులు ఏటా తగ్గిపోతున్నాయి. ఏడాదిలో 20ృ30 రోజులకు మించి వరద రావడం లేదు. మరొకవైపు లిఫ్టులు, పవర్ హౌస్‌ల ద్వారా తెలంగాణ ఎడాపెడా రోజుకు 8 టీఎంసీల నీళ్లు తోడేస్తోంది. శ్రీశైలం నుంచి 777ృ825 అడుగులకే నీళ్లు ఖాళీ చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో తక్కువ సమయంలోనే ఇప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు నింపలేని పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టాం. దీంట్లో కొత్త రిజర్వాయర్లు ఏమీ లేవు. ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు పంపేందుకు ఉద్దేశించిందే ఈ ప్రాజెక్టు.
అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్.. అందరూ మాట్లాడేది ఒకటే భాష. అందరూ అన్నదమ్ములమే. తెలంగాణ ప్రాంతం వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజూ ఆలోచన చేయడు. కానీ మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవడం మన ధర్మం. కొంత మంది పాలకులు ఇందులో ఎమోషనల్ డ్రామాలు ప్లే చేసి, భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం.. కలిసి మెలిసి ఉన్నాం.. కలిసి మెలిసి పెరిగాం.. అలాగే ఉండాలి.
-వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల సంజీవని అని, ఇన్సూరెన్స్ పాలసీ వంటిదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. అలాంటి రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని జల వనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలు వింటుంటే ‘వీళ్లు అసలు మనుషులేనా?’ అనిపిస్తోందని మండిపడ్డారు. వాళ్లు మాట్లాడిన ప్రతీ మాట రాక్షసులను గుర్తు చేస్తోందంటూ దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైనప్పుడు (క్లోజ్డ్ డోర్ మీటింగ్) రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయాలని తాను అడిగానని, తనపై ఉన్న గౌరవంతో చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ నిండు సభలో ప్రకటించారని గుర్తు చేశారు.
రేవంత్‌రెడ్డితో సాన్నిహిత్యం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టారో చెప్పేందుకు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనే నిదర్శనమన్నారు. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చొని స్వప్రయోజనాల కోసం సొంత రాష్ట్రాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టాడో.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తన స్వార్థం కోసం ఏ విధంగా పణంగా పెడుతున్నాడో చెప్పేందుకు రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలే సాక్ష్యాలని ధ్వజమెత్తారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతుల దృష్టిలో చంద్రబాబు ఓ విలన్ కేరక్టర్‌గా కన్పిస్తున్నారన్నారు. బహుశా దేశ చరిత్రలో ఇలాంటి చరిత్ర హీనుడు ఎవరూ ఉండకపోవచ్చని నిప్పులు చెరిగారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల, భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీ, పెట్టుబడులు–ఉపాధి కల్పన–అప్పులపై నాణేనికి మరో పార్శ్వం తదితర అంశాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా వాస్తవాలను వివరిస్తూ చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలిని ఏకిపారేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఖండిస్తారని అందరూ ఆశిస్తే.. ఆశ్చర్యకరంగా బాబు రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లుగా కన్పిస్తోందన్నారు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులను ప్రారంభించి.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతలను వాయు వేగంతో పూర్తి చేసి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
‘రాయలసీమ ఎత్తిపోతల’ గొప్ప ఆలోచన
నిజంగా రాయలసీమ ఎత్తిపోతల అనేది గొప్ప ఆలోచన. గొప్ప ఉద్దేశం. కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం ప్రశ్నార్థకమైన పరిస్థితులు.. తాగడానికి మంచినీళ్లు కూడా ఒక్కోసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ ఎత్తిపోతల అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. రాయలసీమతోపాటు నెల్లూరు, చెన్నైలకు సంజీవని లాంటిది. ఈ విషయంలో అందరూ ఆలోచించాలని చెబుతున్నా. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నై ప్రాంతాలకు నీటిని విడుదల చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్పిల్ లెవల్ 841 అడుగులు. కానీ ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గరిష్ఠ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులు.
ఆ స్థాయిలో ప్రధాన కాలువలోకి నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగుల్లో నీళ్లుండాలి. శ్రీశైలంలో 841 అడుగుల్లో నీరు ఉంటే కేవలం 2 వేల క్యూసెక్కులు, 854 అడుగులకు చేరితే 7 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రధాన కాలువలోకి వస్తుంది. ఈ లెక్కన 44 వేల క్యూసెక్కుల నీరు కిందకు (కాలువలోకి) రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, చెన్నైకి తాగునీరు రూపంలో దాదాపు 101 టీఎంసీల కేటాయింపులున్నా సరే... గడిచిన 20 ఏళ్లలో కేవలం 3–4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు వాడుకోగలిగాం. అందరూ ఆలోచించాల్సిన వాస్తవాలు ఇవి. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఒకవైపు ఉండగా, విభజన తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి పరిశీలించాలి.
ఓటుకు కోట్లు కేసు కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణం
⇒ 2015లో ఇక్కడ చంద్రబాబు సీఎంగా ఉండగా, అక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు తోడుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది. మరోవైపు 800 అడుగుల్లోనే రోజుకు మరో 2 టీఎంసీలు వాడుకునేందుకు వీలుగా పాలమూరు–రంగారెడ్డి–దిండి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. ఇంకో వైపున 825 అడుగులకే ఎస్‌ఎల్‌బీసీ నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లేలా నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
⇒ శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే జూరాల నుంచి నెట్టంపాడు, కోయల్ సాగర్, భీమా ఎత్తిపోతల ద్వారా మరొక టీఎంసీ నీళ్లు అటు నుంచి అటే తెలంగాణకు తరలిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు 777 అడుగుల నుంచి శ్రీశైలం ఎడమ వైపున ఉన్న పవర్ హౌస్‌లో విద్యుదుత్పత్తి కోసం రోజుకు 4 టీఎంసీల నీళ్లు ఇష్టమొచ్చినట్టుగా ఎడాపెడా తీసుకొని శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి.
⇒ ఇటువైపు మన రాష్ట్రంలో నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతుంటే.. మరొకవైపు అటు యథేచ్చగా ఎత్తిపోతలు, పవర్ హౌస్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 8 టీఎంసీలను శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏపీది అడ్డుకోలేని పరిస్థితి. శ్రీశైలం ఎడమ వైపున పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రోజుకు 4 టీఎంసీల నీళ్లను ఖాళీ చేస్తున్నా అడ్డుకోలేకపోతున్నాం. నాగార్జున సాగర్ ఎడమ గట్టు పవర్ హౌస్, దాని నిర్వహణ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి.
⇒ మొన్నటి వరకు మన భూ భాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, దాని నిర్వహణ కూడా తెలంగాణ చేతుల్లోనే ఉండేది. ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, దాని నిర్వహణను స్వాధీనం చేసుకుంది. నాగార్జున సాగర్ కిందనున్న పులిచింతల ప్రాజెక్టు, దాంట్లో ఎడమ వైపున ఉన్న పవర్ హౌస్ కూడా తెలంగాణ చేతుల్లోనే ఉంది. రాష్ట్రానికి, రాయలసీమకు తీవ్ర విఘాతం కల్గించే ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవే. ఇందుకు కారణం.. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నోరు మెదపని పరిస్థితి. అప్పట్లోనే మన రాష్ట్ర హక్కుల కోసం ప్రతిపక్ష నేతగా ఉన్న నేను కర్నూలులో జల దీక్ష కూడా చేశాను.
చంద్రబాబు మౌనం.. రాష్ట్రానికి శాపం
⇒ చంద్రబాబు మౌనం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమ వైపు తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులు 2019 వైఎస్సార్‌సీపీ వచ్చే నాటికి చకచకా జరుగుతున్నాయి. కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ విస్తరణ పనులతోపాటు పాలమూరు–రంగారెడ్డి–దిండి ఎత్తిపోతల పథకాలలో ఏ ఒక్కదానికి పర్యావరణ అనుమతుల్లేవు. ఈ పనులు ఆపాలని ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) 2021 అక్టోబర్‌లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదేశాలిచ్చినా వారు పట్టించుకోలేదు.
⇒ ఇదే విషయమై ఎన్జీటీ 2022లో తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్ల జరిమానా కూడా విధించింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతలు, పవర్ హౌస్ ఆపరేషన్స్ ద్వారా శ్రీశైలంలో 777 అడుగుల నుంచి 825 అడుగుల వరకు రోజుకు 8 టీఎంసీల నీళ్లు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే 834 అడుగుల వద్ద మల్యాల వద్ద చిన్న ఎత్తిపోతల ద్వారా 0.3 టీఎంసీలు, ముచ్చుమర్రిలో 795 అడుగుల వద్ద 0.3 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నాం.
⇒ తెలంగాణ వాళ్లు 8 టీఎంసీలు నీళ్లు వాడుకుంటుండగా, మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. శ్రీశైలం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు.. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. రోజుకు 777–825 అడుగుల వద్ద 8 టీఎంసీలు నీళ్లు ఖాళీ అవుతుంటే.. ఎప్పుడు 881 అడుగులకు నీరు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కిందనున్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏమిటి ? చంద్రబాబు చిత్తూరు జిల్లాలోనే పుట్టాడు. ఏరోజైనా ఆలోచన చేశాడా?
రిజర్వాయర్లకు.. స్టెబిలైజింగ్ రిజర్వాయర్లకు తేడా తెలియదా?
⇒ రాయలసీమ ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంటుందన్న జ్ఞానం కూడా ఈ పెద్దమనిíÙకి లేదు. పైగా ఈ ప్రాజెక్టును ఇంకా గందరగోళంలో పడేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ, నెల్లూరు ప్రజలను చులకన చేసి మాట్లాడతున్నాడు. ఆ ఎత్తిపోతలలో కింద స్టెబిలైజింగ్ రిజర్వాయర్లను పట్టుకొని రిజర్వాయర్లంటాడు. అక్కడ కట్టింది రిజర్వాయర్లు కాదన్న విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు.
⇒ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కట్టకపోతే కుప్పంకు, చిత్తూరుకు తాగునీళ్లు కూడా పోయే పరిస్థితి ఉండదు. తాను పుట్టిన చిత్తూరు జిల్లా ప్రజలపై మమకారం లేదు. తనకు ఓటేసి గెలిపించిన కుప్పం ప్రజలపై కృతజ్ఞతా లేదు. హంద్రీ–నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 500 కిలోమీటర్లకు పైబడి నీళ్లు ప్రయాణం చేయాలి. ఈ ప్రాంతం పూర్తిగా శివారు (టెయిల్ ఎండ్)లో ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, కుప్పంకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశాం. జీఎన్‌ఎస్‌ఎస్ (గాలేరు–నగరి) ద్వారా గండికోటకు నీళ్లు వస్తే.. అక్కడ ఎత్తిపోతలు పెట్టి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ (హంద్రీ–నీవా) కాలువలోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా తంబళ్లపల్లి, పీలేరు మదనపల్లె, పుంగనూరు, కుప్పం, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
⇒ ఇదే ఆలోచనతో పనులు చేపట్టాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు నిర్మించాం. వీటి నిల్వ సామర్థ్యం ఎంతో తెలుసా? కాలేటి వాగు సామర్థ్యం 1.2 టీఎంసీలు. ముదివేడు సామర్థ్యం 2 టీఎంసీలు. నేతిగుంటిపల్లి సామర్థ్యం ఒక టీఎంసీ. ఆవులపల్లి సామర్థ్యం 3 టీఎంసీలు. మా హయాంలో వీటిని కట్టాం. 500 కిలోమీటర్లు దాటి శివారు ప్రాంతానికి వెళ్లా్లలంటే, ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు లేకపోతే ఎలా వెళ్తాయో ఒక్కసారి ఆలోచన చేయండి.

భావోద్వేగాలను రెచ్చగొట్టి..
⇒ అటు తెలంగాణ కానివ్వండి.. ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి.. అందరూ మాట్లాడేది ఒకటే భాష. అందరూ అన్నదమ్ములమే. తెలంగాణ ప్రాంతం వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏరోజూ ఆలోచన చేయడు. కానీ మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవడం మన ధర్మం. ఇందులో ఎమోషనల్ డ్రామాలు ప్లే చేసి, భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు సృష్టించే కార్యక్రమం పాలకులుగా కొంత మంది చేస్తున్నారు. ఇది చాలా తçప్పు. వాస్తవాలు, నిజాలు నిక్కచ్చిగా చెప్పాలి. అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు.
⇒ అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం. కలిసి మెలిసి ఉన్నాం.. కలిసి మెలిసి పెరిగాం. అలాగే ఉండాలి. గతంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టును కూడా పూర్తిగా వాడుకోలేని పరిస్థితి. చంద్రబాబు 40 ఏళ్లు ఇండస్ట్రీ అంటాడు.‡ 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్లీ సీఎం పదవిలో కూర్చొని 19 నెలలవుతోంది. రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు నింపుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇదే పెద్దమనిషి ప్యాకేజీలు విడగొడతాడు.. జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 63 అంటూ డబ్బులు దోచేయడానికి జీవోలు జారీ చేస్తాడు. రేట్లు పెంచి, నామినేషన్ల పద్ధతిలో పనులిచ్చి దోచుకునే కార్యక్రమం చేస్తాడు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం మాట ఎలా ఉన్నా, ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు నింపే కార్యక్రమం చేపట్టకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. 
రాయలసీమ లిఫ్టునకు వ్యతిరేకంగా కేసులు వేయించాడు
⇒ ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిని చక్కబెట్టే దిశగా అడుగులు పడ్డాయి. ఇందులో భాగమే రాయలసీమ ఎత్తిపోతల. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే మనం కూడా 3 టీఎంసీల నీళ్లు తీసుకుని వెళ్లే వెసులుబాటును ఈ ఎత్తిపోతల ద్వారా కల్పించాం. దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చుతో చేపట్టి చకచకా పనులు కూడా జరిగాయి. ఈ ఎత్తిపోతల పూర్తయితే మా ప్రభుత్వానికి, వైఎస్ జగన్‌కు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనే భయంతో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సొంత టీడీపీ కార్యకర్తలతోనే తెలంగాణ నుంచి కేసులు వేయించి అడ్డుకోవాలని చూశాడు. ఎంత దుర్మార్గుడో చూడండి.
⇒ అయినా సరే రాయలసీమ, నెల్లూరు రైతులకు మేలు చేకూర్చేందుకు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కొనసాగించాం. ఈ ప్రాంత రైతుల దురదృష్టమేమిటంటే మా ప్రభుత్వం మళ్లీ రాకపోవడం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు చంద్రగ్రహణం పట్టింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, సీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు. కేవలం ఎన్జీటీ అభ్యంతరాల తర్వాత ఈఏసీ (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) 2024 నవంబర్, 2025 జనవరి, ఫిబ్రవరిలలో మూడుసార్లు సమావేశమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు కనీసం నోరు మెదపలేదు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే ఈ ప్రాజెక్టును ఈ పెద్దమనిషి ఖూనీ చేశాడు.
⇒ ఒకటికి మూడుసార్లు సమావేశమై తమ వాదన విన్పించేందుకు అవకాశం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకుండా ఈ ప్రాజెక్టుపై కత్తి పెట్టాడు. అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు. తన మనుషులతో మాట్లాడిస్తున్నాడు. పైగా ఆశ్చర్యకరంగా శ్రీశైలం డెడ్ స్టోరేజ్‌లో 34 టీఎంసీలే.. దాంట్లో ఏపీ వాటా 22 టీఎంసీలే.. దీని కోసం లిఫ్టు ఎందుకంటూ చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబూ.. నువ్వు అసలు మనిషివేనా.. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా.
అటువైపు 777–825 అడుగులకే రోజుకు 8 టీఎంసీల నీరు వాడుకుంటుంటే 881 అడుగులకు నీళ్లెప్పుడు చేరతాయి.. ఆ తర్వాత పోతిరెడ్డిపాడుకు ఎప్పుడు వస్తాయన్న కనీస ఆలోచన చేయకుండా మాట్లాడుతున్నాడంటే ఆయన్ను ఏమనాలి?
మా హయాంలో ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ వచ్చాం
⇒ రాయలసీమలో పేరుకు రిజర్వాయర్లున్నాయి. కానీ ఏ ఒక్క రిజర్వాయర్‌లోనూ వాటి పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు నింపలేని పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ వచ్చాం. ప్రజలకు మేలు చేయాలనే తపనతో పని చేశాం.
⇒ తెలుగు గంగ లింక్ కెనాల్ 0 నుంచి 18 కిలోమీటర్ల డిజైన్ మేరకు నీటిని పంపించుకోలేని పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500 కోట్లు ఖర్చు పెట్టి డిజైన్ మేరకు దాంట్లో 15 వేల క్యూసెక్కులు పంపేలా ఆధునికీకరించి వాడుకలోకి తీసుకొచ్చాం.
⇒ ఎస్‌ఆర్‌బీసీ–జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ సామర్థ్యం రెండూ కలిపి 30 వేల క్యూసెక్కులకు పెంచే కార్యక్రమం
చేపట్టాం. నిప్పుల వాగు నుంచి నెల్లూరు వరకు 30 వేల క్యూసెక్కులు వెళ్లేలా పనులు చేపట్టాం.
⇒ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కాలువలో కేవలం 2 వేల క్యూసెక్కుల నీళ్లు వెళ్తుంటే, మేము వచ్చిన తర్వాత ఆ కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టాం.
⇒ అవుకు టన్నెల్(సొరంగం)లో ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలేమీ పట్టించుకోలేదు. మేము వాటిని అధిగమించి మొదటి టన్నెల్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ ద్వారా మరో 10 వేల క్యూసెక్కుల నీళ్లు పంపగలిగాం. రెండు టన్నెళ్లు పూర్తి చేసేందుకు రూ.260 కోట్లు ఖర్చు చేశాం. అవుకులో మూడో టన్నెల్ పనులు కూడా మొదలు పెట్టాం.
⇒ గండికోట రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 27 టీఏంసీలు. కానీ.. ఏరోజూ 14–15 టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,000 కోట్లు ఆర్‌అండ్‌ఆర్ మీద ఖర్చు పెట్టి 27 టీఎంసీల నీళ్లు నిలిచేలా చేశాం.
⇒ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీళ్లు నిలపలేదు. మేము
అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.280 కోట్లు ఖర్చు చేసి.. ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేసి 10 టీఎంసీల నీళ్లు నిలిపేలా చేశాం.
⇒ బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు. కానీ.. ఏ రోజూ ఆ స్థాయిలో నిల్వ చేయలేదు. మేము వచ్చిన తర్వాత డయా ఫ్రమ్ వాల్ కొత్తది వేసి.. లీకేజీ సమస్యను అరికట్టి రూ.90 కోట్లు ఖర్చు చేసి.. 17 టీఎంసీల నీళ్లు నింపాం.
⇒ వెలుగొండలో రెండు టన్నెళ్లను పూర్తి చేసి రెండు దశాబ్దాల కలను సాకారం చేసి, జాతికి అంకితం చేశాం. మిగిలింది ఆర్ అండ్ ఆర్, లైనింగ్ పనులు మాత్రమే.
⇒ కొన్ని దశాబ్దాలుగా తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యంలో ఏ రోజూ నీళ్లను నిలపలేదు. మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీల నీళ్లను నిలుప గలిగాం. రూ.120 కోట్లు ఖర్చు చేసి ఈ డ్యామ్‌లలో పూర్తి సామర్థ్యంలో నీళ్లు నిలబెట్టగలిగాం.
⇒ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ పనులు మా హయాంలో పూర్తి చేశాం. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. ఏ ఒక్కరోజూ పూర్తి సామర్థ్యం మేరకు ఇక్కడ నీటిని నిల్వ చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్‌కు రూ.200 కోట్లు ఖర్చు చేశాం. 45 టీఎంసీలు స్టోరేజ్ చేశాం. ఇవన్నీ మా హయాంలో జరిగాయి. చిత్తశుద్ధి, సిన్సియారిటీ, కమిట్‌మెంట్ ఉంటే ఏదైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. పనులు జరుగుతాయి. అవి చంద్రబాబులో లోపించాయి.


