అసలు, వడ్డీకి చంద్రబాబు ప్రభుత్వం గ్యారెంటీ
ఉత్తర్వులు జారీచేసిన సర్కారు
హడ్కో నుంచి ఇప్పటికే రాజధానికి రూ.11,000 కోట్ల అప్పు
తాజా అప్పుతో కేవలం హడ్కో నుంచి బాబు సర్కారు చేసిన మొత్తం రుణాలు రూ.15,451 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ గ్యారెంటీల అప్పులకు అంతులేకుండా పోతోంది. బడ్జెట్ అప్పులు మంగళవారాల్లో చేస్తుండగా.. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రతీనెలా అప్పులు చేస్తోంది. తాజాగా.. హడ్కో ద్వారా ఏపీ టిడ్కో రూ.4,451 కోట్లు అప్పు తీసుకునేందుకు బాబు సర్కారు గ్యారెంటీ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు ఆర్థిక శాఖ నుంచి కంఫర్ట్ లెటర్‌ను అందించడానికి సర్కారు అంగీకరించింది. అసలు, వడ్డీకి హామీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. రుణ వ్యవధి మొత్తం కాలానికి ప్రభుత్వ హామీ చెల్లుబాటవుతుంది.
వడ్డీ రేటు, కాలపరిమితి, మారటోరియం వ్యవధి మొదలైన షరతులు వంటి వివరాలతో పాటు అసలుతో పాటు వడ్డీ తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ను సమర్పించాల్సిందిగా ఏపీ టిడ్కోకు ప్రభుత్వం సూచించింది. రుణ సంస్థకు బాధ్యతలను చెల్లించడంలో టిడ్కో విఫలమైన సందర్భంలో మాత్రమే ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. రుణ డీడ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ అ«దీకృత అధికారి సంతకం చేస్తారు. మొత్తం రుణంపై ఏపీ టిడ్కో ఐదు శాతం గ్యారెంటీ కమీషన్‌ను చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రాజధాని పేరుతో హడ్కో నుంచి రూ.11,000 కోట్లు అప్పుచేసింది. ఇప్పుడు చేస్తున్న ఈ రూ.4,451 కోట్లతో కలిపితే చంద్రబాబు సర్కారు హడ్కో నుంచి చేసిన మొత్తం అప్పు రూ.15,451 కోట్లకు చేరుతోంది.


