జస్టిస్ మల్లికార్జునరావు వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ థీరజ్ సింగ్ ఠాకూర్
వీడ్కోలు కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు
ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తి
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ముందే వీడ్కోలు
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ మల్లికార్జునరావు ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెల 9 నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడం, 18వ తేదీ ఆదివారం కావడంతో హైకోర్టు ఆయనకు గురువారమే వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, ‘జిల్లా జడ్జిగానే పదవీ విరమణ చేస్తానని నేను భావించా.
అయితే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వల్ల పరిస్థితులు మారాయి. నేను కూడా హైకోర్టు న్యాయమూర్తిని అయ్యాను’అని తెలిపారు. అంతకుముందు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ మల్లికార్జునరావు న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలు అందించారన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇన్‌చార్జ్ అధ్యక్షుడు కేవీ రఘువీర్‌లు జస్టిస్ మల్లికార్జునరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావు, హైకోర్టు న్యాయవాదులు, రిజి్రస్టార్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘన సన్మానం
అనంతరం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ మల్లికార్జునరావు దంపతులను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


