land problem
-
తాగునీటి సమస్యపై తస్మాత్ జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. తాగునీటి సరఫరా విషయంలో నీటి పారుదల శాఖ, తాగునీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో వేసవి తాగునీటి ప్రణాళిక, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.కలెక్టర్లు డ్యాష్ బోర్డు ద్వారా ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా సమ స్య తలెత్తితే పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలని చెప్పారు. పలు గ్రామాలకు తాగు నీటి సరఫరా పైపులైను వ్యవస్థ లేదని, పలు ఇళ్లకు నల్లాలు లేవని.. ఆయా ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు. కోయగూడేలు, చెంచు పెంటలు, ఇతర గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. భూభారతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను న్యాయస్థానాల మెట్లు ఎక్కించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా విస్తృత అధ్యయనం తర్వాత తీసుకువచ్చిన భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రెవెన్యూ యంత్రాంగమే ఇకపై ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దీనిపై అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైతులు, ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.ఈ చట్టాన్ని క్షేత్ర స్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలని, ప్రతి జిల్లా కలెక్టర్ మండల స్థాయి సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమ య్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలని చెప్పారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఈ రెండింటినీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.భూభారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారని, ఆయా మండల కేంద్రాల్లో సదస్సులకు కలెక్టర్లు కచ్చితంగా హాజరుకావాలని, ఆ మండలాల్లోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. వీటికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతారని తెలిపారు.ఇళ్ల మంజూరులో ఒత్తిళ్లకు తలొగ్గొద్దు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపాలని.. ఇన్చార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖరారవుతుందని చెప్పారు. సరైన పర్యవేక్షణకు వీలుగా ప్రతి నియో జకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమి టీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్చార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని రేవంత్ వివరించారు.గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గ వద్దని, ఎక్కడైనా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే మండల స్థాయి క మిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇళ్ల కేటాయింపు ఉండాలని, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలని సూ చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూ పల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదా రు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, షబ్బీర్ అలీ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ చెప్పారంటే..చేస్తారంతే..
-
భద్రాద్రిలో గిరిజనులకు రక్షణ లేదా.!
భద్రాచలంటౌన్: ఏజెన్సీలో గిరిజ నులకు రక్షణ లేకుండా పోతుందని పెట్రోల్ బంక్ నిర్వాహకురాలు బాణోత్ వాణికుమారి ఆరోపించా రు. శనివారం పట్టణంలోని టీఎస్ టూరిజం హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. పట్టణంలో పలువురు వ్యక్తులు భూకబ్జాలకు పాల్ప డుతూ అమాయకుల భూములను లాక్కోంటున్నారని ఆరోపించారు. ఆంధ్రాలోని యటపాక మండలంలోని చింతలగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 38/2, 38/3, 38/4 నెంబర్లలో ఉన్న 10 ఎకరాల భూమిని తాను కొనుక్కుంటే పట్టణ ప్రముఖుడిగా చలామణి అవుతున్న ప్రసాద్ అనే వ్యక్తి ఆ భూమిని తాను కొన్నానంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించారు. తాను కొన్న భూమికి సంబంధించిన పత్రాలు చూపించమంటే ఉన్నాయంటూ చెబు తూ, చివరకు తనపై బెదిరింపులకు దిగడం జరిగిందన్నారు. ప్రసాద్‌తో పాటు మరో నలుగురుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశానని, కేసు కూడా నమోదు అయిందని క్రైమ్ నెంబర్లు చూపించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తమ్మళ్ల రాజేష్, వసంతాల రాజేశ్వరీ, ముద్దా పిచ్చయ్య, నీరజ, కుమారి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ నాయకుల విమర్శలు దారుణం
కావలి: ప్రైవేట్ వ్యక్తుల భూములను కావలికి చెందిన బీజేపీ నాయకురాలు వరలక్ష్మమ్మ పేదలకు అమ్మేసిందని, ఆ భూముల యజమానుల ఫిర్యాదు మేకు అధికారులు చర్యలు తీసుకుంటుంటే అధికార పార్టీ అన్యాయం చేస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ తమను విమర్శించడం దారుణమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కావలిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ తనకు ఫోన్ చేసి కావలి సబ్ కలెక్టర్ కొందరు రౌడీలను తీసుకొచ్చి పట్టణంలోని 16వ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్లో పేదల ఇళ్లను జేసీబీలతో కూల్చేస్తున్నారని చెప్పారన్నారు. తాను అప్పడే మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడానికి బయలుదేరుతున్నానన్నారు. అయినప్పటికీ సబ్ కలెక్టర్‌తో మాట్లాడుదామని కార్యాలయానికి రావాలని కందుకూరి వెంకట సత్యనారాయణను సూచించానని ఎమ్మెల్యే వెల్లడించారు. సరే అని సత్యనారాయణ చెప్పడంతో తాను సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆయన కోసం ఎదురు చూశానన్నారు. ఆయన రాలేదని తానే ఆయనకు ఫోన్ చేసి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నానని, ఎప్పుడు వస్తారని సత్యనారాయణను అడిగాననని ఎమ్మెల్యే వివరించారు. తాను ఇళ్లు కూల్చేసే చోట ఉన్నానని ఆయన చెప్పడంతో, తాను అక్కడ్నుంచి బయలుదేరి మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నానన్నారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నానని ఎమ్మెల్యే చెప్పారు. కాగా తాను ఈ వివాద వ్యవహరాన్ని ఆరా తీయగా, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఇంటి స్థలాలను బీజేపీ నాయకురాలు వరలక్షమ్మ పేదలకు అక్రమంగా అమ్మేసి సొమ్ము చేసుకుందని ఆరోపించారు. అందులో ఇతరులు ఇళ్లు నిర్మించుకోగా, స్థల యజమానులు చేసిన ఫిర్యాదు మేరకు సబ్ కలెక్టర్, డీఎస్పీలు విచారించి చర్యలు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. జరిగిన వాస్తవం ఇది అయితే తమ పార్టీ వారు పేదల ఇళ్లును కూల్చేశారంటూ బీజేపీ నాయకుడు కందుకూరి వెంకట సత్యనారాయణ ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆక్రమణలను ప్రోత్సహించవద్దని, సంపూర్ణంగా అరికట్టాలనే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢమైన నిర్ణయంతో ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాము కూడా కావలిలో ఆక్రమణలను ప్రోత్సహించే వారిని సహకరించబోమన్నారు. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు చెబుతామన్నారు. బాలకృష్ణారెడ్డి నగర్లో పేదల వద్ద సొమ్ము వసూలు చేసిన బీజేపీ నాయకురాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు లేని పేదలు ఉంటే వారందరికీ తాము ఇంటి స్థలాలు, ఇళ్లు ప్రభుత్వం ద్వారా మంజూరయ్యేలా చేస్తామన్నారు. పేదలకు న్యాయం చేస్తామే కాని, అట్లాగని ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను ఆక్రమించుకుంటామని, పేదలు వద్ద వసూళ్లకు పాల్పడుతామని అంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. -
భూమి ఆన్లైన్ నమోదు కోసం ఆత్మహత్యాయత్నం
ఒకపక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమది రైతు ప్రభుత్వమంటూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే.. ఆ స్ఫూర్తిని పొందలేని కొందరు సిబ్బంది గ్రామీణులను చిన్నచూపు చూస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలీని ఓ చదువులేని రైతు చెప్పులరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన బాధితుడు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సాక్షి, వంగర (శ్రీకాకుళం): సాగులో ఉన్న భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలి.. తొందరగా పని పూర్తి చేసి ఆదుకోవాలి.. ఇదీ ఆ రైతు విన్నపం. కానీ 40 రోజులుగా తిరుగుతున్నా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోలేదు. ఇది అతనిని ఎంతో ఆవేదనకు గురి చేసింది. చివరి ప్రయత్నంగా అధికారి ముందు బైఠాయించినా ఫలితం లేకపోవడంతో మరణమే శరణమనుకున్నాడు. వంగర మండలం వెలుగు కార్యాలయంలో శనివారం ఈ దురదృష్టకర ఘటన జరిగింది. సంగాం గ్రామానికి చెందిన మహిళా రైతు బోను లక్ష్మీనారాయణమ్మ పేరుతో ఉన్న సాగుభూమిని ఆన్లైన్లో నమో దు చేయాలని ఆమె కుమారుడు బోను మధు 40 రో జులుగా వీఆర్వో రాంబాబు చుట్టూ తిరుగుతున్నాడు. సర్వే నెంబర్ 88లో తమకున్న 75 సెంట్ల భూమి లెక్కలు ఆన్లైన్లో తప్పుగా ఉన్నాయని, సర్వే నెంబర్ 151లో తమకున్న 31 సెంట్ల భూమి ఆన్లైన్ నమోదు కాలేదని వేడుకున్నాడు. అయినా ఫలితం లేదు. తమకు అవగాహన లేక ఆన్లైన్లో దరఖాస్తు చేయలేకపోయామని, వీఆర్ఓ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మధు వాపోయాడు. ఫలితం లేకపోవడంతో వెలుగు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డీటీ గోవిందరావు వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులందరూ బైఠాయించారు. తమ సమస్య పట్టించుకోలేదంటూ అసహనానికి గురైన మధు ఓ టిన్నులో తెచ్చిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతనిని వారించిన డీటీ బి.గోవిందరావు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ బండారు రామారావు కలుగజేసుకొని సర్వేయర్ ఎ.కృష్ణతోపాటు సంగాం గ్రామం వెళ్లి భూములు పరిశీలించి సర్వే చేశారు. ఆన్లైన్లో నమోదుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
వృద్ధురాలిపై దౌర్జన్యం
నెల్లూరు(వీఆర్సీసెంటర్) : తమకు విక్రయించిన స్థలంలో పాకా వేసిందనే నెపంతో ఓ వృద్ధురాలిపై తల్లి, కొడుకు దౌర్జన్యం చేసిన ఘటన నగరంలోని 53వ డివిజన్ గాంధీగిరిజనకాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు..గాంధీగిరిజన కాలనీకు చెందిన పసుపులేటి శేషమ్మ తనకు చెందిన స్థలంలో పాకా వేసుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన కట్టా మంజుల తన కుమారుడితో కలిసి వచ్చి పాకాను పీకివేశారు. శేషమ్మ 14 ఏళ్ల క్రితం కట్టా మంజుల వద్ద రూ.10వేలు అప్పుగా తీసుకుంది. అప్పట్లో ఓ కాగితంపై వేలిముద్ర వేయించుకుని స్థలాన్ని ఆక్రమించారని వృద్ధురాలు చెబుతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. పక్షవాతానికి గురైన కుమారుడితో కలిసి ఉండేందుకు శుక్రవారం స్థలంలో చిన్నపాకను వేసుకోబోగా దౌర్జన్యంగా పీకివేశారని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కాగా తమకు 14 ఏళ్ల క్రితమే ఇంటి స్థలాన్ని శేషమ్మ విక్రయించిందని, తమ వద్ద శేషమ్మతో పాటు ఆమె ఇద్దరి కొడుకులు సంతకాలు చేసిన కాగితాలు ఉన్నాయని మంజుల చెబుతోంది. అయితే శేషమ్మ రెండో కొడుకు శ్రీనుకు పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోయాయని, సంతకం పెట్టడం కూడా రాదని, అలాంటప్పుడు ఎలా సంతకం చేశాడని స్థానికులు అనుమానాలు వ్వక్తం చేస్తున్నారు. వివాదాన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోకుండా వృద్ధురాలిపై అమానుషంగా ప్రవర్తించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
జగిత్యాలలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించారు. ఒకరు ఎస్పీ కార్యాలయం ఎదుట, మరొకరు అటవీశాఖ కార్యాలయం ముందు పురుగుల మందు తాగారు. వారిద్దరూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాయికల్ మండలం మైతాపూర్‌కు చెందిన ఎట్టెం జైపాల్‌కు ఎకరం భూమి ఉండగా.. నేమిళ్ల నారాయణ భూమి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఏడాదిగా వీరిమధ్య రహదారి వివాదం జరుగుతోంది. మంగళవారం మరోసారి గొడవ జరగగా.. జైపాల్‌పై నారా యణ దాడిచేశాడు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బుధవారం ఎస్పీని కలిసేందుకు జైపాల్ వెళ్లి.. కార్యాలయం బయటే పురుగుల మందు తాగాడు. పోలీసులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ అనంతశర్మ అతడి నుంచి వివరాలు సేకరించారు. కేసు పెట్టారని మరొకరు... సారంగాపూర్ మండలం రేచపల్లి శివారులో మంగళవారం ఉదయం విద్యుత్ షాక్‌పెట్టి ఓ సాంబర్ అనే అటవీ జంతువును హతం చేశారు. అనంతరం దాని మాంసాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా.. అటవీశాఖ అధికారులు గమనించి అజ్మీరా రవి, సుబ్రహ్మణ్యంలను పట్టుకుని కేసు నమోదు చేశారు. బుధవారం కార్యాలయానికి తీసుకువచ్చారు. కోర్టులో హాజరు పరుస్తారనే భయంతో రవి వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగాడు. రవిని తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
కొత్త విద్యుత్ ప్లాంట్లకు స్థల సమస్య
గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీ సంస్థలో ప్రస్తుతం 200 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లు, 500 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లతో మొత్తం 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. భవిష్యత్‌లో ప్లాంట్‌ను విస్తరించేందుకు అనువుగా ఎన్టీపీసీ స్థలాన్ని అందుబాటులో పెట్టుకుంది. 8, 9 యూనిట్లను నెలకొల్పేందుకు మూడేళ్ల క్రితమే ప్రణాళికలు సిద్ధం చేసింది. బొగ్గు కేటాయింపులు లభించక ఇన్నాళ్లూ వేచిచూసింది. తెలంగాణలో తీవ్ర కరెంటు సంక్షోభం నేపథ్యంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సింగరేణి నుంచి స్థలం సేకరిస్తామని చెప్పారు. ఎన్టీపీసీ కూడా ఇందుకు సమ్మతించింది. ఆ సంస్థ సీఎండీ సైతం ముఖ్యమంత్రిని కలిశారు. కానీ, ప్రతిపాదిత ప్లాంట్ల నిర్మాణానికి ఐదు వేల ఎకరాల స్థలం అవసరముండగా రామగుండం ప్రాంతంలో, సింగరేణిలో అంతమొత్తంలో స్థలం లభించడం కష్టంగానే ఉంది. ఇప్పటికే అధికారులు అన్ని చోట్ల పరిశీలించినా... ఆ స్థాయిలో భూమి ఎక్కడా లభించడం లేదు. దీంతో వెయ్యి ఎకరాల తన సొంత స్థలంలోనే కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీపీసీ శ్రీకారం చుట్టింది. మొత్తం 4 వేల మెగావాట్లలో కేవలం 1600 (800 మెగావాట్ల రెండు యూనిట్లు) మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ స్థలం సరిపోతుంది. ఈ రెండు యూనిట్లకు అవసరమైన యాష్‌పాండ్ కోసం 700 ఎకరాల స్థలం అవసరం కానుండగా... రామగుండం పరిసర ప్రాంతాల్లో అంతపెద్ద మొత్తంలో ప్రభుత్వ స్థలం ప్రస్తుతం కనిపించడం లేదు. యాష్‌పాండ్‌కు ఇతర ప్రాంతాల్లో స్థలం కేటాయించే అవకాశాలున్నాయి. రామగుండం పట్టణంలో 500 ఎకరాల వరకు స్థలం ఉన్నప్పటికీ అది అటవీశాఖతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీకి ఇవ్వడానికి స్థలం దొరుకుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కోర్టు వివాదంలో బీపీఎల్ స్థలం 1994లో రామగుండం మండలకేంద్రంలో 520 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో బీపీఎల్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన 543.05 ఎకరాలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి 1291.31 ఎకరాల భూమి సేకరించింది. రూ.150 కోట్లతో 1996లో ప్లాంట్ చుట్టూ ప్రహరీ, ఇతర నిర్మాణాలు చేపట్టిన ఆ సంస్థ విద్యుత్ కొనుగోలు రేట్ల విషయంలో ప్రభుత్వంతో ఒప్పందం జరగక ప్లాంట్ నిర్మాణ పనులు నిలిపివేసింది. ఈ వివాదంపై బీపీఎల్ సంస్థ కోర్టును ఆశ్రయించగా... నేటికీ ఆ సమస్య ఎటూ తేలలేదు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్టే వెకేట్ చేయిస్తే తప్ప బీపీఎల్‌కు కేటాయించిన స్థలాన్ని ఎన్టీపీసీకి అప్పగించే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పే పరిస్థితి ఏర్పడదు. ఒక్క చోట కాకుండా రామగుండం చుట్టుపక్కల విడివిడిగా స్థలం చూపించడానికి ప్రభుత్వం ముందుకు వస్తే... 800 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు నెలకొల్పేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త ప్లాంట్ల నిర్మాణంపై అయోమయం నెలకొంది.