నిర్మల్: పండుగలు, వివాహాలు వంటి శుభ సందర్బాల్లో ఆడబిడ్డలకు చీరను సారెగా పెట్టడం తెలుగింటి సంప్రదాయం. గతంలో తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా పంపిణీ చేయడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఇంటికే వెళ్లి అధికారులు చీర అందిస్తారు. ఇందుకు డీఆర్డీవో ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామాల్లో పంపిణీ షురూ..
జిల్లాలో గ్రామీణ మహిళలకు ఇప్పటికే చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 9 వరకు పంపిణీ పూర్తి చేస్తారు. ఇక పట్టణ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు చర్యలు తీసుకుంటోంది. గ్రామాల్లో నేరుగా మహిళకు చీర ఇవ్వడంతోపాటు, ఆమె వివరాలు, ఫొటోను నమోదు చేసి, పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. నియోజకవర్గాల్లో ఆర్డీవోస్థాయి అధికారి పర్యవేక్షణ బాధ్యత తీసుకోనున్నారు.
జిల్లాలో ఇలా...
జిల్లాలో 19 మండలాలు, 400 గ్రామ పంచాయతీలు, 3 మున్సిపాలిటీలలో 1,70,331 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,14,681 చీరలు జిల్లాకు చేరాయి. మిగతా 55,650 చీరలు త్వరలో చేరనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళలకు గౌరవంతోపాటు, సంప్రదాయాన్ని బలపరిచే ప్రయత్నం జరుగుతోంది. సారెగా చీర పంపిణీ మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసంలో కొత్త వెలుగులు రేకెత్తించనుంది


