విశాఖ చేరుకున్న మరో భారీ ఎల్‌పీజీ నౌక.. | Another Massive Lpg Vessel Arrives At Visakhapatnam Port | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న మరో భారీ ఎల్‌పీజీ నౌక..

Apr 2 2026 12:11 PM | Updated on Apr 2 2026 1:39 PM

Another Massive Lpg Vessel Arrives At Visakhapatnam Port

సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ కష్టాల నుంచి స్వల్ప ఊరట లభించింది.  మరో భారీ ఎల్‌పీజీ నౌక.. విశాఖ పోర్టుకు చేరుకుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి విశాఖకు వచ్చిన 'పైన్ గ్యాస్' ఎల్‌పీజీ నౌక.. 47 వేల టన్నుల గ్యాస్ మోసుకొచ్చింది. ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన గ్యాస్ నౌకను విశాఖకు మళ్లించారు. తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ డిమాండ్, నిల్వలను దృష్టిలో పెట్టుకుని నౌకను విశాఖకు మళ్లించినట్టు సమాచారం.

కాగా, వరుసగా క్రూడాయిల్, వంట గ్యాస్‌ వెసల్స్‌ రాకతో విశాఖ పోర్టు కళకళలాడుతోంది. ఐదు రోజుల క్రితం(శుక్రవారం) కూడా భారీ స్థాయిలో ముడిచమురు, ఎల్‌పీజీ నౌకలు విశాఖ పోర్టుకు చేరుకున్నాయి. రష్యా నుంచి ‘ఎమ్‌టీ జంబో’ భారీ నౌక 1,36,728 మెట్రిక్‌ టన్నుల ముడిచమురుతో వచ్చింది. మరోవైపు, దేశీయ అవసరాల నిమిత్తం నెదర్లాండ్స్‌ నుంచి బీడబ్ల్యూ బిర్చ్‌ వెసల్‌ 24,000 మెట్రిక్‌ టన్నుల భారీ ఎల్‌పీజీ నౌక వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఎమ్‌టీ సెంచూరియన్‌–1 వెసల్‌లో ఉన్న లక్ష టన్నుల ముడి చమురును అన్‌లోడ్‌ చేశారు. కాగా, అమెరికా నుంచి మరిన్ని గ్యాస్‌ నౌకలు విశాఖపట్నం రానున్నట్లు పోర్టు అధికారులు వెల్లడించారు.

యుద్ధ సంక్షోభం తరువాత నాలుగు ఎల్‌పీజీ నౌకలు విశాఖ వచ్చాయని విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ అంగముత్తు తెలిపారు. లక్ష టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకున్నామని.. మరో 3 గ్యాస్ నౌకలు రానున్నాయని తెలిపారు. 13 క్రూడ్ ఆయిల్ నౌకలు వచ్చాయని.. మరో 4-5 క్రూడ్ ఆయిల్ నౌకలు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖ పోర్టు.. ముంబై పోర్టుతో సమానంగా కార్గో హ్యాండిలింగ్ చేస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement