ద్విచక్ర వాహనాల చోరీ కేసు.. నిందితుల్లో ముగ్గురు మైనర్ల
గోపాలపట్నం : ద్విచక్రవాహనాలను దొంగిలించిన ముగ్గురు మైనర్లను గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని.. జువైనల్ హోమ్‌కు తరలించారు. గోపాలపట్నం క్రైమ్ ఎస్‌ఐ జి.తేజేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన ఇంటి ముందు పెట్టిన స్కూటీని ఈ నెల 12వ తేదీన రాత్రి ఎవరో ఎత్తుకుపోయారని బాజి జంక్షన్ ఎస్సీ కాలనీకి చెందిన రౌతు తరుణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే క్రమంలో కొత్తపాలెం, చంద్రనగర్, బాజి జంక్షన్ ప్రాంతాల్లో తమ ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయని చామర్తి సందీప్, బూసల గణేష్, శిరీష, మనుబాల సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెస్ట్ సబ్ డివిజన్ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎస్‌ఐ తేజేశ్వరరావు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాతనేరస్తులపై నిఘా పెట్టారు. జీవీఎంసీ 89వ వార్డు చంద్రనగర్ గ్రౌండ్ వద్ద చంద్రనగర్‌కు చెందిన ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు. వారిని ప్రశ్నించగా పై దొంగతనాలు తాము చేసినట్లుగా అంగీకరించారు. వారి వద్ద నుంచి మొత్తంగా 5 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు.


