పోలీసుల కళ్లుగప్పి.. ఎట్టకేలకు చిక్కి!
పెదగంట్యాడ: బెయిల్‌పై బయటకు వచ్చి.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన సూర్య చలపతిరావు గతంలో తాను నేవీ ఆఫీసర్‌నని నమ్మబలికి, నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసగించాడు. బాధితుల ఫిర్యాదుతో అప్పట్లో న్యూపోర్టు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన నిందితుడు, కోర్టు విచారణకు హాజరుకాకుండా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో గాజువాక 8వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ సదరు నిందితుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు అందిన సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు.


