breaking news
Raheja land dispute
-
99 పైసలకే 27.10 ఎకరాలా..? రహేజా కార్ప్‌కు భూకేటాయింపులపై హైకోర్టు విస్మయం
సాక్షి, అమరావతి: పలు ప్రైవేటు కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూములు కట్టబెడుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ– రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కూడా కేవలం 99 పైసలకే 27.10 ఎకరాలు కట్టబెట్టడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.ఇంత తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీకి అంత భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక వేళ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మరిన్ని కంపెనీలు కూడా ముందుకు వచ్చి ఉండేవని తెలిపింది.అలా ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రశ్నించింది. అందరికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకే భూములు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.రహేజాకు భూ కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాన్ని కూడా తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఎదురు రూ.91.2 కోట్లు చెల్లిస్తోంది: పొన్నవోలువిశాఖపట్నం, మధురవాడ, ఐటీ హిల్‌లో కేవలం 99 పైసలకే 27.10 ఎకరాల భూమిని రహేజాకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు, మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల్లో ముఖ్యాంశాలు..– పొన్నవోలు వాదనల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, కంపెనీలకు భూ కేటాయింపులపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ప్రస్తుత వ్యాజ్యంలో కూడా పిటిషనర్ భూ కేటాయింపులను, కేటాయింపుల విధానాన్ని సవాలు చేశారని వివరించారు. – అలా అయితే ఆ వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. – ఈ సమయంలో పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించిన వ్యవహారమని తెలిపారు. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు పలు ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులపై దాఖలైనవని వివరించారు. దీంతో ధర్మాసనం విచారణను కొనసాగించింది– రహేజా రియల్టీ సంస్థ కాదని ఏజీ చెబుతుండగా, పొన్నవోలు అడ్డుతగులుతూ అది రియల్ ఎస్టేట్ కంపెనీనేనని, కావాలంటే జీవో 204ను చూడాలని, అందులో రియల్ ఎస్టేట్ కంపెనీ అని స్పష్టంగా ఉందని చెప్పారు. – ప్రభుత్వం భూ కేటాయింపులతో సరిపెట్టలేదని, ప్రోత్సాహకాలుగా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎదురు రూ.91.2 కోట్లు చెల్లిస్తోందని వివరించారు. ఈ మొత్తాన్ని ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని, అందువల్ల తగిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. – పొన్నవోలు లేవనెత్తిన పాయింట్ సరైనదేనని, అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత అన్ని విషయాలను పరిశీలిస్తామని పొన్నవోలుకు ధర్మాసనం స్పష్టం చేసింది. -
99 పైసలకే 27.10 ఎకరాలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ కె.రహేజా రియల్ ఎస్టేట్ గ్రూపునకు విశాఖలో ఎకరం 99 పైసలకు 27.10 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మధురవాడలోని ఐటీ హిల్ నంబర్–3లో 27.10 ఎకరాలను ఏపీ ల్యాండ్ ఇన్సింటివ్స్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ ప్రకారం కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు రూ.91.2 కోట్లతో రహదారులను కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపింది.అనకాపల్లి వద్ద రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న బ్రూవరేజస్ ప్లాంట్ కోసం ఎకరం రూ.40 లక్షల చొప్పున 30 ఎకరాలను కేటాయించింది. రూ.744 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్‌కు రూ.330.52 కోట్ల టైలర్ మేడ్ రాయితీలను ప్రకటించింది. అనంతపురంలో రూ.1,274 కోట్లతో ఏర్పాటు చేయనున్న సుగుణ స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక రాయితీలు, రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఎపిటోమ్ కాంపోనెంట్‌కు 19.06 ఎకరాలు, కుప్పంలో ఎన్‌పీఎస్‌పీఎల్‌కు 130 ఎకరాలు, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 ఎకరాలు, ఫ్లూయెంట్ గ్రిడ్ రూ.150 కోట్ల పెట్టుబడులు, క్రేయాన్ టెక్నాలజీ రూ.1,079 కోట్లు, మదర్సన్ టెక్నాలజీకి రూ.109.73 కోట్లతో మధురవాడలో ఐటీ క్యాంపస్, ఉప్పాడలో కాకినాడ వద్ద రూ.44,000 కోట్లతో 1 మిలియన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ప్రాజెక్టులకు పలు రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తూ పలు ఉత్వరులు విడుదలయ్యాయి. -
‘రహేజా’ కేసు కొట్టివేత
పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఊరట సాక్షి, హైదరాబాద్: రహేజా భూవివాదంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన అభియోగాల్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్‌రావు 129 పేజీలతో కూడిన కీలక తీర్పును మంగళవారం వెలువరించారు. ఈ తీర్పుతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఊరట లభించింది. రహేజా ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను 11 శాతం నుంచి 0.55 శాతానికి తగ్గించడం వల్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని న్యాయవాది టి.శ్రీరంగారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేసిన ఏసీబీ... కేసును మూసివేయాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు అమల్లోకి వచ్చింది. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ న్యాయవాది శ్రీరంగారావు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఏసీబీ కోర్టు కేసు నమోదు చేసి నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు అందుకున్న వారిలో ఏపీఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీలుగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం, బీపీ ఆచార్య, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి/ ప్రత్యేక కార్యదర్శిగా చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కె.రత్నప్రభ, ఎం.గోపీకృష్ణ, ఐటీ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా చేసి రిటైర్ అయిన పీఎస్ మూర్తి, రహేజా ఎండీ నీల్ రహేజా, రహేజా మైండ్‌స్పేస్ అధినేత బి.రవీంద్రనాథ్‌లు ఉన్నారు. ఒకసారి మూసేసిన కేసును అదే ఏసీబీ కోర్టు తిరిగి తెరవడంపై వీరంతా అభ్యంతరాన్ని లేవనెత్తారు. కుట్ర ఆరోపణలకు ఆధారాలు లేవు... గోపీకృష్ణ, రత్నప్రభ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, బీపీ ఆచార్యపై ఉన్న అన్ని ఆరోపణలపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, చట్ట ప్రకారం పీఎస్ మూర్తిపై విచారణకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. అయితే ఏసీబీ కోర్టు ప్రాసిక్యూషన్‌కు అనుమతి పొందలేదంది. అంతే కాకుండా రహేజా, నీల్ రహేజా, రవీంద్రనాథ్‌లతో కలసి అధికారులు కుట్రపన్నారన్న ఆరోపణలకు ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. ఆ ముగ్గురి నుంచి లబ్ధి పొందారనడం, తప్పులు చేశారన్న ఆరోపణల్లో కూడా నిజం లేదని తన తీర్పులో పేర్కొంది. ఏసీబీ కోర్టు న్యాయవాది పిటిషన్‌ను విచారణకు స్వీకరించి జారీ చేసిన ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది.


