రిలయన్స్‌కు ఎకరం రూ.40 లక్షల చొప్పున అనకాపల్లిలో 30 ఎకరాలు
పలు కంపెనీలకు భూములు, ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ కె.రహేజా రియల్ ఎస్టేట్ గ్రూపునకు విశాఖలో ఎకరం 99 పైసలకు 27.10 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మధురవాడలోని ఐటీ హిల్ నంబర్–3లో 27.10 ఎకరాలను ఏపీ ల్యాండ్ ఇన్సింటివ్స్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ ప్రకారం కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు రూ.91.2 కోట్లతో రహదారులను కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపింది.
అనకాపల్లి వద్ద రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న బ్రూవరేజస్ ప్లాంట్ కోసం ఎకరం రూ.40 లక్షల చొప్పున 30 ఎకరాలను కేటాయించింది. రూ.744 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్‌కు రూ.330.52 కోట్ల టైలర్ మేడ్ రాయితీలను ప్రకటించింది. అనంతపురంలో రూ.1,274 కోట్లతో ఏర్పాటు చేయనున్న సుగుణ స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక రాయితీలు, రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఎపిటోమ్ కాంపోనెంట్‌కు 19.06 ఎకరాలు, కుప్పంలో ఎన్‌పీఎస్‌పీఎల్‌కు 130 ఎకరాలు, ఐస్పేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 ఎకరాలు, ఫ్లూయెంట్ గ్రిడ్ రూ.150 కోట్ల పెట్టుబడులు, క్రేయాన్ టెక్నాలజీ రూ.1,079 కోట్లు, మదర్సన్ టెక్నాలజీకి రూ.109.73 కోట్లతో మధురవాడలో ఐటీ క్యాంపస్, ఉప్పాడలో కాకినాడ వద్ద రూ.44,000 కోట్లతో 1 మిలియన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ప్రాజెక్టులకు పలు రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తూ పలు ఉత్వరులు విడుదలయ్యాయి.


