లాకర్‌.. సేఫేనా? | Locker keeps gold physically secure, but it does not protect | Sakshi
Sakshi News home page

లాకర్‌.. సేఫేనా?

Jun 29 2026 6:31 AM | Updated on Jun 29 2026 6:31 AM

Locker keeps gold physically secure, but it does not protect

బంగారం భద్రతకు బ్యాంక్‌ లాకర్‌ ఒక్కటే సరిపోదు 

బ్యాంకుల బాధ్యతలకు పరిమితులు 

లాకర్‌ సేఫ్‌ సంపదకు పూర్తి సేఫ్టీ కాదు 

నగల రక్షణకు ఇన్సూరెన్స్‌ అవసరం 

హోమ్‌ సేఫ్, డాక్యుమెంట్‌ బ్యాకప్‌ తప్పదు

ఏళ్ల తరబడి కూడబెట్టిన బంగారం. వారసత్వంగా వస్తున్న కుటుంబ నగలు, విలువైన ఆస్తిపత్రాలు లాకర్‌లో ఉంటే చాలు ఇక టెన్షన్‌ లేదు అనే నమ్మకం భారతీయ కుటుంబాల్లో బలంగా ఉంది. విలువైన సంపదనంతా లాకర్లో దాచేసి తాళం చెవిని చూసుకుంటూ అంతా సేఫ్‌ అనుకునే రోజులు పోయాయి. దేశంలోని పలు నగరాల్లో ఇటీవలి కాలంలో వరుసగా వెలుగుచూసిన బ్యాంక్‌ లాకర్‌ వివాదాలు  ప్రజల నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నాయి. 

లాకర్‌లో ఉంచిన నగలు మాయమైతే బ్యాంకు బాధ్యత పరిమితమే అనే విషయం లాకర్లో వస్తువులు మాయమయ్యాక తెలుస్తోంది. నష్టపోయిన వస్తువులకు బ్యాంకులు చెల్లించే పరిహారం పోగొట్టుకున్న వాటి పూర్తి విలువలో పావువంతు కూడా ఉండదన్న  విషయం అనేకమందికి చేతులు కాలాక కానీ అవగాహనకి రావడంలేదు.  లాకర్‌ నిజంగా మీ విలువైన వస్తువులకు భద్రత ఇస్తుందా... ఇస్తే అది ఎంత భద్రత ఇస్తుంది? బంగారం, ఆస్తి పత్రాలను పూర్తిగా కాపాడుకోవాలంటే ఇంకేం చేయాలి  అని వివరించి గైడ్‌ చేసే వెల్త్‌ స్టోరీ...

బెంగళూరులో ఒక డాక్టర్‌ బ్యాంక్‌ లాకర్లో దాచుకున్న రూ.24 లక్షల విలువైన బంగారం పోయింది. మరో కేసులో ఢిల్లీలో ఓ కుటుంబం లాకర్లో ఎప్పటినుంచో పెడుతున్న రూ.60 లక్షల నగలు ఒకసారి కనిపించకుండా పోయాయి. సీసీటీవీలు ఉన్నాయి. ఫుటేజీల్లో పోయిన విషయం వెల్లడైంది. అయినా బాధితులకు న్యాయం అందలేదు. ఇక్కడ అసలు షాక్‌ ఏమిటంటే బ్యాంక్‌కు మీ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాల్సిన బాధ్యత లేదు. ఆర్‌బీఐ రూల్స్‌ ప్రకారం మీకు తెలియాల్సిన నిజం ఏమిటంటే ,బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు బాధ్యత లాకర్‌ రెంట్‌కు వంద రెట్లు మాత్రమే.. 

లాకర్లో వస్తువులు పోతే కస్టమర్‌ చెల్లించే లాకర్‌ రెంటుకు  వంద రెట్లు నష్టపరిహారం మాత్రమే బ్యాంకు చెల్లిస్తుంది. అంటే ఒక లాకర్‌కు ఏడాదికి రూ.7000 అద్దె కడుతుంటే నష్టపోయినపుడు దక్కే పరిహారం రూ.7 లక్షలు మాత్రమే. పోగొట్టుకున్న మీ  సంపద 70 లక్షలకు పైగా ఉన్నా దక్కేది అదే..అంటే బ్యాంక్‌ లాకర్‌ మాత్రమే విలువైన వస్తువులకు సేఫ్‌ కాదు. మరి బంగారాన్ని, ఇతర వస్తువులు, డాక్యుమెంట్లు ఎలా రక్షించుకోవాలి? అందుకు మల్టీ లేయర్‌ స్ట్రాటజీ  పాటించాలి.  ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఒక రక్షణ పద్ధతిపై మాత్రమేఆధార పడటం ప్రమాదకరం. ఫైనాన్స్‌ నిపుణులు సూచిస్తున్నది కూడా మల్టీలేయర్‌ ప్రొటెక్షన్‌ స్ట్రాటజీనే అదేమీ బంగారం, డాక్యుమెంట్స్‌కు అసలైన భద్రత.


జ్యువెలరీ ఇన్సూరెన్స్‌
ఎక్కువ మంది పట్టించుకోని పెద్ద రక్షణ
భారతదేశంలో నగలు కొనేవారు ఇంటికి ఒకరు చొప్పున కోట్లలో ఉన్నా  కొన్న నగలకు ఇన్సూరెన్స్‌ చేసే వారు మాత్రం అరుదే. లక్షల విలువ చేసే నగలు కొనగానే బీమా చేస్తే  దొంగతనం జరిగినపుడు అది ఇంట్లో అయినా, బయట అయినా. లాకర్‌ లో జరిగినా పూర్తిగా నష్టపరిహారం బీమా రూపంలో 
అందుతుంది.  అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు, ప్రయాణాల్లో నగలు పోగొట్టుకున్నా బీమా భద్రత పూర్తిగా లభిస్తుంది.ఇది బ్యాంకు తప్పిదంవల్ల జరిగిన నష్టానికి అందే పరిహారం కంటే ఎక్కువ. బ్యాంక్‌ కవరేజ్‌ లిమిట్‌ను దాటి, అసలు విలువను రక్షించేది ఇదే.

ప్రీమియం ఎంత? 
సంవత్సరానికి 0.3శాతం నుంచి 1శాతం లోపే 
రూ.10 లక్షల బంగారానికి రూ.3,000  రూ.10,000 వరకు మాత్రమే అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాలసీలో మీరు డిక్లేర్‌ చేసిన నగలకు మాత్రమే కవరేజ్‌ లభిస్తుంది. బీమా చేశాక నగలు కొత్తగా కొంటే వాటిని బీమాలో అప్‌డేట్‌ చేయాలి

జ్యువెలరీ వాల్యుయేషన్‌
చిన్న తప్పు, పెద్ద నష్టం
మీ నగల విలువను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మదుపు చేయించాలి. అదీ పాత బిల్లుతో కాదు. ప్రస్తుత మార్కెట్‌ విలువతో ఇన్సూర్‌ చేయించాలి. ఎందుకంటే పదేళ్ల క్రితం కొన్న బంగారం విలువ ప్రస్తుతం అనేక రెట్లు పెరిగి ఉంటుంది. పాత విలువతో బీమా చేయిస్తే పోగొట్టుకున్నప్పుడు లభించే బీమా క్లెయిమ్‌ తక్కువే ఉంటుంది. అందుకే నగలను ఎప్పటికప్పుడు సర్టిఫైడ్‌ జ్యువెలర్‌తో వాల్యుయేషన్‌ చేయించాలి. కనీసం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారైనా అప్‌డేట్‌ చేసుకోవాలి.

హోమ్‌ సేఫ్‌ ఏర్పాటు
ఫస్ట్‌ లైన్‌ ఆఫ్‌ డిఫెన్స్‌
ప్రతి ఇంట్లో ఉండాల్సిన మినీ వాల్ట్‌ ఉండాలి. రోజువారీ క్యాష్, నగల కోసం ఇంట్లో ఒక మంచి హోమ్‌ సేఫ్‌ ఏర్పాటు చేసుకోవాలి.  అది ఎలా ఉండాలంటే దృఢమైన స్టీల్‌ బాడీతో తయారు చేసినదై ఉండాలి. పిన్‌/ ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ సౌకర్యం ఉండాలి. అగ్ని ప్రమాదాలను తట్టుకునేలా ఫైర్‌ రెసిస్టెంట్‌ అయి ఉండాలి. గోడకు కానీ నేలకు కానీ బిగించాలి. రూ.5000 నుంచి 25000 ఖర్చుతో సేఫ్‌ ఏర్పాటు చేసుకుని తరచూ వేసుకునే నగలతోపాటు, లాకర్లో పెట్టిన వస్తువుల కాపీలు, రసీదులు, డాక్యుమెంట్ల జిరాక్సులు రెడీగా ఉంచుకోవాలి.

హోమ్‌ ఇన్సూరెన్స్‌ 
అండర్‌ రేటెడ్‌ కవరేజ్‌
చాలా మందికి హోమ్‌ ఇన్సూరెన్స్‌ ఉండదు. ఫరి్నచర్, ఎల్రక్టానిక్స్‌ వస్తువులతో పాటు, నగలు కూడా (సబ్‌ లిమిట్‌)తో బీమా చేయించాలి. జువెలరీ లిమిట్‌ ని అదనంగా పెంచుకోవచ్చు.

డిజి లాకర్‌
డాక్యుమెంట్లకు డిజిటల్‌ రక్షణ
భారత ప్రభుత్వం పౌరులందరికి అందిస్తున్న ఫ్రీ సర్వీస్‌ ఈ డిజిలాకర్‌.. డ్రైవింగ్‌ లైసెన్సులు, పాన్‌ కార్డులు, రిజి్రస్టేషన్‌ కార్డులు వంటి డాక్యుమెంట్లను డిజిటల్‌ రూపంలో ఇక్కడ దాచుకో?వచ్చు. ఇవన్నీ ఎక్కడైనా లీగల్‌గా వాలిడిటీ కలిగి ఉంటాయి. ఎక్కడైనా, ఎక్కడినుంచైనా ఇంటర్‌ నెట్‌ ద్వారా, ఫోన్‌లో కూడా యాక్సెస్‌ చేయచ్చు. అయితే ఒకవిషయం గుర్తుంచుకోవాలి. డిజి లాకర్‌లో అప్‌ లోడ్‌ చేసిన డాక్యుమెంట్లు స్కాన్‌ కాపీలు మాత్రమే. రిఫరెన్స్‌ కోసమే. ఒరిజినల్స్‌ను మరోచోట సేఫ్‌ గా భద్రపరచుకోవాలి.

ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌
స్మార్ట్‌ హ్యాండ్లింగ్‌ తప్పనిసరి
ఇళ్లు, స్థలాలకు సంబంధించిన ప్రాపర్టీ  డాక్యుమెంట్లు పోతే వాటిని తిరిగి పొందడానికి, కనీసం డూప్లికేట్‌ కాపీలు సంపాదించడానికి సంవత్సరాలు సాగుతాయి. అందువల్ల డాక్యుమెంట్‌ కాపీలను మల్టిపుల్‌ కాపీలు గా చేసి లాకర్‌తో పాటు, ఇంట్లో, దగ్గరి బంధువులు, స్నేహితులు దగ్గర ఒక కాపీ ఉంచాలి. హైక్వాలిటీ స్కాన్‌ చేయించి గూగుల్‌ డ్రైవ్‌లో, డిజిలాకర్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఒక కాపీని పర్సనల్‌ మెయిల్‌కి పంపుకుని సేవ్‌ చేసి ఉంచుకోవాలి?

డాక్యుమెంటేషన్‌
పోయిన వస్తువుల, నగల క్లెయిమ్‌కు ఇదే బేస్‌
కొన్న ప్రతి నగకు ఫోటోలు తీయించాలి. వాటి వెయిట్, ప్యూరిటీ నోట్‌ చేసి ఉంచాలి. బిల్లులు అన్నీ ఎక్స్‌ ట్రా కాపీ భద్రంగా ఉంచాలి. ఎక్కడ ఉంచారో రికార్డు చేయాలి. 
ఈ రికార్డు లేకపోతే బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయే చాన్స్‌ ఎక్కువ.

లాకర్లో నగలు మాయమైతే ఏం చేయాలి? 
బ్యాంకు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. సీసీటీవీ ఫుటేజ్‌ అడిగి తీసుకోవాలి, వెంటనే బీమా కంపెనీకి సమాచారం అందించాలి. నగలకు సంబంధించిన ఫొటోలు, విలువకు సంబంధించిన పత్రాల కాపీలు అందించాలి. 
బెంగళూరు, ఢిల్లీ కేసులు యాదృచ్ఛికం కాదు  నిర్లక్ష్యానికి హెచ్చరిక. అన్ని వస్తువులకు బ్యాంకు లాకరే భద్రత కాదు. అసలు భద్రత సిస్టమ్‌ ప్లస్‌ ప్లానింగ్‌. సేఫ్టీ అనేది ప్రమాదం సంభవించిన తర్వా త కాదు. ముందే నిర్మించుకోవాల్సిన విషయం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement