ప్రేమలో పడిన ఓ యువతీ–యువకుడు.. పెద్దల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇద్దరూ కలిసి కొత్త జీవితం మొదలుపెట్టారు. అయితే పెద్దలు తమను ఏమైనా చేస్తారేమోనని భయపడ్డారు. పోలీసులను ఆశ్రయిస్తే పని జరగలేదు. దీంతో రక్షణ కోరుతూ కోర్టు తలుపు తట్టారు. కానీ అక్కడ వారికి ఊహించని తీర్పు ఎదురైంది.
“కుటుంబ గౌరవం, సామాజిక విలువలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అంటూ కోర్టు పోలీసు రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
పంజాబ్‌కు చెందిన ఈ జంట తాము పరస్పర అంగీకారంతో కలిసి జీవిస్తున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి, బెదిరింపులు ఎదురవుతున్నాయని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. తమకు భద్రత కల్పించాలని అభ్యర్థించింది. అయితే కేసును విచారించిన జస్టిస్ సందీప్ మౌద్గిల్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అనేది కొంతమంది ఎంచుకుంటున్న ఆధునిక జీవనశైలి అయినప్పటికీ.. ప్రతి సందర్భంలో దానిని చట్టబద్ధ సంబంధంగా గుర్తించలేమని కోర్టు స్పష్టం చేసింది. కేవలం కొంతకాలం కలిసి ఉండటంతోనే ఇది చట్టబద్ధ సంబంధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఇంకా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. తల్లిదండ్రుల ఇల్లు వదిలి వెళ్లిపోవడం కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తుందని పేర్కొంది. ఇది తల్లిదండ్రుల గౌరవంతో జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, సామాజిక విలువలు, కుటుంబ వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
విచారణలో కోర్టు గమనించిన విషయం ఏమిటంటే, ఈ జంట భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. తామిద్దరం లివింగ్ రిలేషన్‌లో ఉండేందుకు అర్హులమని వాదించింది. అయితే.. యువకుడు ఇంకా చట్టబద్ధ వివాహ వయస్సుకు చేరుకోలేదని కోర్టు గుర్తించింది.
మొత్తంగా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి కలిసి జీవితం మొదలుపెట్టిన ఈ ప్రేమ జంటకు చివరికి హైకోర్టులో షాక్ తీర్పు ఎదురైంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉందన్న వాదన ఉన్నప్పటికీ, ప్రతి కేసులో కోర్టు జోక్యం చేసుకుంటే సామాజిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని భావించిన హైకోర్టు, పోలీసు రక్షణ ఇవ్వడానికి నిరాకరించి పిటిషన్‌ను కొట్టివేసింది.


