breaking news
CHANDIGARH High Court
-
తల్లిదండ్రుల పరువు తీశారు.. మీకు రక్షణ ఇవ్వాలా?
ప్రేమలో పడిన ఓ యువతీ–యువకుడు.. పెద్దల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇద్దరూ కలిసి కొత్త జీవితం మొదలుపెట్టారు. అయితే పెద్దలు తమను ఏమైనా చేస్తారేమోనని భయపడ్డారు. పోలీసులను ఆశ్రయిస్తే పని జరగలేదు. దీంతో రక్షణ కోరుతూ కోర్టు తలుపు తట్టారు. కానీ అక్కడ వారికి ఊహించని తీర్పు ఎదురైంది. “కుటుంబ గౌరవం, సామాజిక విలువలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అంటూ కోర్టు పోలీసు రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.పంజాబ్‌కు చెందిన ఈ జంట తాము పరస్పర అంగీకారంతో కలిసి జీవిస్తున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి, బెదిరింపులు ఎదురవుతున్నాయని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. తమకు భద్రత కల్పించాలని అభ్యర్థించింది. అయితే కేసును విచారించిన జస్టిస్ సందీప్ మౌద్గిల్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.లివ్-ఇన్ రిలేషన్షిప్ అనేది కొంతమంది ఎంచుకుంటున్న ఆధునిక జీవనశైలి అయినప్పటికీ.. ప్రతి సందర్భంలో దానిని చట్టబద్ధ సంబంధంగా గుర్తించలేమని కోర్టు స్పష్టం చేసింది. కేవలం కొంతకాలం కలిసి ఉండటంతోనే ఇది చట్టబద్ధ సంబంధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఇంకా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. తల్లిదండ్రుల ఇల్లు వదిలి వెళ్లిపోవడం కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తుందని పేర్కొంది. ఇది తల్లిదండ్రుల గౌరవంతో జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, సామాజిక విలువలు, కుటుంబ వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.విచారణలో కోర్టు గమనించిన విషయం ఏమిటంటే, ఈ జంట భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. తామిద్దరం లివింగ్ రిలేషన్లో ఉండేందుకు అర్హులమని వాదించింది. అయితే.. యువకుడు ఇంకా చట్టబద్ధ వివాహ వయస్సుకు చేరుకోలేదని కోర్టు గుర్తించింది. మొత్తంగా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి కలిసి జీవితం మొదలుపెట్టిన ఈ ప్రేమ జంటకు చివరికి హైకోర్టులో షాక్ తీర్పు ఎదురైంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉందన్న వాదన ఉన్నప్పటికీ, ప్రతి కేసులో కోర్టు జోక్యం చేసుకుంటే సామాజిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని భావించిన హైకోర్టు, పోలీసు రక్షణ ఇవ్వడానికి నిరాకరించి పిటిషన్‌ను కొట్టివేసింది. -
డేరా బాబాకు మరో దెబ్బ
సాక్షి, ఛండీగఢ్ : డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గుర్మీత్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఛండీగఢ్ హైకోర్టు కొట్టేసింది. బాధిత మహిళల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గుర్మీత్ వాదనను తోసిపుచ్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ అతను ఈ పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, ఇద్దరు సాధ్వీలపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల శిక్షను గుర్మీత్ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుర్మీత్ తరపున ఏ వాదనతో కూడా కోర్టు అంగీకరించలేకపోయింది. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా సీబీఐ న్యాయస్థానం తీర్పును సమర్థించింది. -
జైల్లో శృంగారం.. ప్రాథమిక హక్కు!
-
జైల్లో శృంగారం ప్రాథమిక హక్కు
చండీగఢ్: పంజాబ్, హర్యానా హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు (దంపతులు) వారి జీవిత భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడం తప్పుకాదని, అది వారి ప్రాథమిక హక్కు అని పేర్కొంది. ఖైదీలుగా ఉన్న భార్యాభర్తలు బిడ్డకు జన్మనివ్వడానికి కూడా ఆమోదం తెలిపింది. మంగళవారం చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాటియాల సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భార్యాభర్తలు సోనియా, జస్వీర్ సింగ్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. 16 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో వీరికి మరణశిక్ష పడింది. కాగా జైల్లో తామిద్దరూ కలసి జీవించాలని ఉందని, బిడ్డకు జన్మనిచ్చేందుకు అనుమతివ్వాలని సోనియా, జస్వీర్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. తామిద్దరూ కలసి జీవించడానికి ఏర్పాట్లు చేసేలా జైలు అధికారులను ఆదేశించాల్సిందిగా విన్నవించారు. తల్లిదండ్రులకు తానొక్కడే సంతానమని, తన పెళ్లయిన ఎనిమిది నెలలకే అరెస్ట్ చేశారని జస్వీర్ కోర్టుకు తెలియజేశాడు. నేరం, శిక్ష తీవ్రతను పరిశీలించాలన్న జస్వీర్ విజ్ఞప్తిని నిరాకరించిన కోర్టు.. అతని భార్యతో కలసి జీవించడానికి అనుమతిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ, బిడ్డకు జన్మినిచ్చే హక్కు ఉందని న్యాయస్థానం పేర్కొంది. నిందితులు, ఖైదీలకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని పేర్కొంది.


