యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు భావిస్తున్న పీహెచ్‌డీ స్కాలర్ జ్యోతి కుటుంబానికి అధికారులు అండగా నిలిచారు. విద్యార్థుల ఆందోళనలతో దిగి వచ్చి ఆమె కుటుంబానికి రూ.16 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పంజాబ్ యూనివర్సిటీ ప్రకటించింది. అంతేకాకుండా.. ఆమె కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు సోదరుడికి యూనివర్సిటీలోనే ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్లడించింది.
హరియాణాలోని రేవారీకి చెందిన 28 ఏళ్ల జ్యోతి.. పంజాబ్ యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. మంగళవారం క్యాంపస్‌లోని హాస్టల్ నుంచి తన విభాగానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వర్షాల కారణంగా క్యాంపస్‌లోని కొన్ని ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో జ్యోతి ప్రధాన మార్గానికి బదులుగా నీరు నిలిచిన ప్రాంతం పక్కనున్న దారిలో వెళ్లింది. ఆ సమయంలో.. సమీపంలోని విద్యుత్ జంక్షన్ బాక్స్ కరెంట్ వైర్ తెగిపడింది. విద్యుత్ షాక్‌తో కుప్పకూలిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
విద్యార్థుల నిరసనలు
జ్యోతి మృతిపై పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో విద్యుత్ భద్రతా లోపాలపై ప్రశ్నిస్తూ వందలాది మంది విద్యార్థులు వీసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. క్యాంపస్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్యోతి కుటుంబానికి తగిన పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత నిర్ణయం
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు జ్యోతి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం రూ.16 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే జ్యోతి సోదరుడికి యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. జ్యోతి సోదరుడు 10+2తో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్) విద్యార్హత కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతడిని యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్‌గా నియమించనున్నట్లు వెల్లడించారు.
A research scholar lost her life in Panjab University on 28 July 2026, suspected electrocution. Students staged protest in the campus against official's negligence on the matter. PU has agreed to pay Rs 16 lakh compensation to family and a job of electrician to her brother. pic.twitter.com/qUnMKVFHrj
— Patrkaar Priyanka (@Patrkarpriyanka) July 28, 2026
బాధ్యులపై దర్యాప్తు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్యాంపస్‌లో విద్యుత్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ కూడా జ్యోతి మృతిపై స్పందించారు. ఈ ఘటన హృదయ విదారకమని పేర్కొంటూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.


