మహిళల కోటాపై కదలిక | Sakshi Editorial On Delimitation Women reservations | Sakshi
Sakshi News home page

మహిళల కోటాపై కదలిక

Mar 26 2026 1:26 AM | Updated on Mar 26 2026 2:11 AM

Sakshi Editorial On Delimitation Women reservations

వచ్చే నెలలో జనగణన తొలి దశ ప్రారంభం కాబోతుండగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, అందరూ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలకు సంబంధించిన పనులు ప్రారంభం కావాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది. ఈ రెండింటికీ 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాస్తవానికి 2023లో మహిళా కోటా బిల్లును ఆమోదించినప్పుడు ఆ మరుసటి సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికలకే దాన్ని వర్తింపజేయాలని విపక్షాలు కోరాయి. 

కానీ 2026 జనగణనకు ముందుగా ఇది సాధ్యంకాదని అప్పట్లో కేంద్రం చెప్పింది. నియోజకవర్గాల పునర్విభజనకూ దీన్నే కారణంగా చూపింది. ఈ హఠాత్‌ పునరా లోచనకు గల కారణమేమిటో కేంద్రం వివరించలేదు. అలాగే మహిళల కోటా నిర్ణయంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారన్నది కూడా చెప్పలేదు. వీటికి సంబంధించిన విధి విధానాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియపై రాజకీయ పక్షాల మధ్య స్పర్థలున్నా మహిళల కోటా విషయంలో అన్ని పక్షాలూ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. అయినా ఆ చట్టం అమలు వాయిదా పడింది.

కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ, మనకన్నా వెనకబడివున్న దేశాలూ కూడా మహిళలకు దశాబ్దాల క్రితమే చట్టసభల్లో కోటా ఇచ్చి గౌరవించాయి. రువాండాలో రాజ్యాంగం ప్రకారం 30 శాతం కాగా, ఆచరణలో దాదాపు 64 శాతం మంది మహిళలున్నారు. క్యూబాలో 55.7 శాతం, ఫ్రాన్స్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, బొలివియా, మెక్సికోల్లో 50 శాతంవరకూ రిజర్వేషన్‌లున్నాయి. నేపాల్‌లో 33 శాతం కోటా అమలవుతోంది. మన ఎంపీల్లో మహిళలు 14 శాతం మించిలేరు. ఈ గణాంకాలు గమనిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. ఈ ఏడాది జనగణన ప్రక్రియ మొదలైనా, తుది గణాంకాలకు ఏడాది పడుతుంది. స్వాతంత్య్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు కావస్తున్నా జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు కోటా దక్కలేదు. ఇంకా ఆలస్యం చేయొద్దనుకోవటం మంచి నిర్ణయమే. 

అయితే నియోజకవర్గాల పునర్విభజన వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్య నిర్ణయించటమే ఇందుకు కారణం. 2011 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవటంవల్ల లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ 816కు ఎగబాకుతాయనీ, ఇందులో 273 స్థానాలు మహిళలకు లభిస్తాయనీ ఒక అంచనా. 2029 సార్వత్రిక ఎన్నికలకు దీన్ని వర్తింపజేస్తారు. తెలంగాణలో ఇప్పుడున్న 17 ఎంపీ స్థానాలు 26కు... 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగు తాయంటున్నారు. ఏపీకి ఇప్పుడున్న 25 ఎంపీ స్థానాలు దాదాపు 38కి, ప్రస్తుత 175 అసెంబ్లీ స్థానాలు 263కి చేరుతాయి. 

ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిన మహిళలు చదువుల్లో, వృత్తి ఉద్యోగాల్లో ముందుండటం, కుటుంబ నియంత్రణ వంటి కారణాలవల్ల జనాభా పెరుగుదల రేటు తగ్గింది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్‌కన్నా కొంత ఎక్కువ కాగా... ఆరు దశాబ్దాల తర్వాత బిహార్‌ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు అధికం. జనాభా ప్రాతిపదిక కాక, రాష్ట్రాల్లోని స్థానాలపై కొంత శాతం అధికంగా సీట్లిచ్చే విధానం ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ సూచిస్తున్నారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండాలన్న రాజ్యాంగ అధికరణానికి ఇది విరుద్ధం. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. కానీ జనాభారీత్యా యూపీ ఓటరు ఓటుకుండే విలువకన్నా తమిళనాడు లేదా కేరళ ఓటరు విలువ ఎక్కువుంది. ఈ వ్యత్యాసం కొనసాగనీయటం సమర్థనీయ మేనా అన్న సందేహం తలెత్తుతుంది.

ప్రతి జనగణన తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నా, ఇందులో ఇమిడివున్న సమస్యలను పసిగట్టి గత పాలకులందరూ వాయిదాల్లో గడిపారు. 2000 సంవత్సరం వరకూ స్తంభింపజేస్తూ 1976లో... దాన్ని 2026 వరకూ పొడిగిస్తూ 2001లో రాజ్యాంగ సవరణలు తెచ్చారు. మొత్తానికి ఈ భారం ప్రస్తుత పాలకులపై పడింది. ఎవరికీ అన్యాయం జరగకుండా, ఉత్తర–దక్షిణాల వ్యత్యాసం రాకుండా సమస్యను పరిష్కరించగలిగితే దేశ సమైక్యతకు అది దోహదపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement