లోక్‌సభ డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం: మంత్రి కేటీఆర్

KTR Says Southern states Grossly Unfair Lok Sabha Delimitation - Sakshi

హైదరాబాద్‌: లోక్‌ససభ డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరగనుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. 2026 తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. 

అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు.. జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటల్ని, విధానాలను దక్షిణాది రాష్ట్రాలు నమ్మాయి. ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేశాయి. అలాంటిది ఇవాళ డీలిమిటేషన్‌ వల్ల తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డీలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు (MP Seats) పొందడం అన్యాయం, బాధాకరమని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ తెలిపారు. 

మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయని.. ఇది దురదృష్టకరమన్నారు. జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలు.. తమ ప్రగతిశీల విధానాలకు తీవ్రంగా శిక్షించబడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 

కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పారాయన. 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35 శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి (GDP) నిధులు అందిస్తున్నాయని, జాతీయ ఆర్థికాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదని అభిప్రాయపడ్డారాయన.

తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధిపొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపైన నాయకులు, ప్రజలు గళమెత్తాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: కేసీఆర్‌ కోవర్టులు అంతటా ఉన్నారు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top