
జూన్‌లో మంత్రివర్గ విస్తరణ జరగాలని కోరుకుంటున్నా...
రేవంత్‌రెడ్డికి, నాకు మధ్య సఖ్యత ఉంది.. జోడెడ్లలా కలిసి పనిచేస్తున్నాం
బీఆర్‌ఎస్ పరిణామాలను మేము రాజకీయంగా మలచుకోవాలని అనుకోవడం లేదు
‘సాక్షి’తో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ విస్తర ణలో అత్యధిక శాతం బీసీలు ఉండాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. టీపీసీసీ కార్యవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ, మైనారిటీలకు 70% వరకు అవకాశం ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ కోరుకున్న విధంగా అందరికీ సమాన భాగస్వామ్యం ఉంటుందన్నారు.
ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బీసీ నినాదం అనేది దేశవ్యాప్తంగా అంటుకుందని చెప్పారు. రా హుల్ జాతీయస్థాయిలో ఓబీసీల విషయంలో గొంతెత్తడంతో కొంత చలనం వచ్చిందని.. దానికి తెలంగాణ దిక్సూచి గా మారిందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్‌గౌడ్ రాష్ట్ర తాజా రాజకీయాలు, ఇతర అంశాలపై ఆదివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...
మా అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పాం
‘మంత్రివర్గ కూర్పు విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, నేను, సీనియర్ నాయకులమంతా మా అభిప్రాయాలను ఏ ఐసీసీకి చెప్పాం. జూన్‌లో అధిస్టానం తుది నిర్ణయం ప్రకటిస్తుందని అనుకుంటున్నాం. వీలైనంత త్వరగా కేబినెట్, టీపీసీసీ కార్యవర్గ విస్తరణ జరగాలని కోరుకుంటున్న వారిలో నేను మొదటి వ్యక్తిని. ప్రభుత్వ, పార్టీపరమైన పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది.
నేను, రేవంత్ జోడెడ్లలా పనిచేస్తున్నాం
నాకు..రేవంత్‌రెడ్డి మధ్య సఖ్యత ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన, టీపీసీసీ అధ్యక్షుడుగా నేను జోడెడ్లలాగా పనిచేస్తున్నాం. అలా చేస్తేనే పార్టీకి నష్టం జరగకుండా ముందుకు పోతుంది. అంతా ఐక్యంగా ఉన్నారనే విశ్వాసంతోనే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు. వారి ఆకాంక్షలు, ఆశయాల మేరకు మేము పనిచేయాల్సిందే. ఒత్తిళ్తు, విభేదాలున్నా, వాటిని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నాం.
ఆ పార్టీ వ్యవహారాన్ని రాజకీయంగా మలచుకోం
కవిత ఎపిసోడ్‌తో రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. అందులో తలదూర్చాల్సిన అవసరమూ లేదు. ఆ తతంగాన్ని రాజకీయంగా మలచుకోవాలనే దురుద్దేశం మాకు లేదు. వాళ్ల ఆస్తుల పంపకాలకుగానీ, పదవుల పంపకాలకు గానీ మమ్మల్ని వారు పిలవలేదు. ఆమె లేఖ రాసేవరకు అందరూ ప్రేమగానే ఉంటున్నారని అనుకున్నాం. ఇప్పు డు లుకలుకలు బయటపడ్డాయి.
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి ఏం వెలగబెట్టారు?
తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు. రాష్ట్రం కోసం వీరు వెలగబెట్టిందేమిటి? ఏపీకి ఇచ్చినంత బడ్జెట్ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా పోయాయి. నష్టం జరిగింది. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిల గురించి బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు.
రాష్ట్ర ప్రయోజనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు సహకారం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అయితే తెలంగాణ నీటివాటా విషయం, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటామంటే అందుకు సహకరిస్తాం. అందులో తప్పేముంది? రాష్ట్రమే మాకు ముందు ప్రాముఖ్యం’అని మహేశ్‌గౌడ్ చెప్పారు.