
సాక్షి, హైదరాబాద్: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదన్నారు.
ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసిన కేటీఆర్.. ఫార్మా సిటీ భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడలేరని అసెంబ్లీలోనే రెండేళ్ల క్రితం హెచ్చరించానన్నారు. విజన్ లేని రేవంత్ వలన ప్రజాధనం వృధా అయ్యిందన్నారు. వేల కోట్ల రూపాయల ఫార్మా సిటీ పెట్టుబడులు వెనక్కి పోయాయి. లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతన్నలు మోసపోయారంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
గత కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20 వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసిందన్నారు.