సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మూసీ అంశంపై వాడీవేడి చర్చ నడిచింది. మూసీ అభివృద్ధిని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. మూసీ ప్రాజెక్ట్ వివరాలను ఇప్పటి వరకు ఎందుకు చెప్పడం లేదని పలు ప్రశ్నలు సంధించారు. ఆయన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.
సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. మూసీకి, మీర్‌అలాంకు సంబంధమేంటి?. రెండు మూడు అంశాలను క్లబ్ చేస్తే ఎలా?. అసెంబ్లీ అధికారులు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదు. సభ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. రెండేళ్ల నుంచి మూసీ పేరుతో కాలం గడుపుతుంది ఈ ప్రభుత్వం. మూసీ డెవలప్‌మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.. అసలు మూసీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది?. మూసీ ప్రాజెక్ట్ బాబు ఘాట్ వరకు ఉందని విన్నాను.. కానీ ప్రాజెక్టు వివరాలు సర్కార్ చెప్పడం లేదు.
నాకు తెలిసినంత వరకు అనంతగిరి నుంచి మూసీ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వం అనంతగిరి నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటుందా? లేదా?. మూసీలో ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది?. గోదావరి నీళ్లను హిమాయత్, ఉస్మాన్ సాగర్‌లోకి ఎలా తెస్తారు?. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచిమెంట్ ఏరియా ఎంతో చెప్పాలి?. గతంలో అవసరం లేకుండా హిమాయత్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరిచారు?. ఈ రెండు సాగర్లలో వర్షపు నీళ్లు వస్తాయి.. మరి గోదావరి నీళ్లు తెస్తే ఎలా? అని ప్రశ్నించారు.
మరోవైపు.. అక్బర్‌ద్దీన్ ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ..‘మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఆర్‌డీసీఎల్ చేపడుతుంది. ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు జరుగుతుంది. ప్రణాళిక, విశ్లేషణ, డిజైన్‌పై 18 నెలల్లో డీపీఆర్ సమర్పిస్తుంది. నల్లగొండ జిల్లా సాగు నీరుకు మూసీ నది ఉపయోగం. మూసీ పునరుజ్జీవనం జరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. మూసీ నది జంట నగరాలకే కాదు.. రాష్ట్రానికి సంబంధించిన అంశం. మీరాలం ఫీడెడ్ చానెల్ మూసీతో అనుసంధానమై ఉంది’ అని చెప్పుకొచ్చారు.


