‘ఈ మార్కులు అప్పట్లో చాలా కష్టం’
● డీజీపీ శివధర్‌రెడ్డి, కొత్వాల్ సజ్జనర్
సాక్షి, సిటీబ్యూరో: ‘మా రోజుల్లో నూటికి 40, 50 శాతం రావడమే గగనమయ్యేది. ఆ స్థాయిలో మార్కులు వస్తే చాలని పరితపించే వాళ్లం. అయితే నేటి తరం విద్యనభ్యసించడంలో పోటీ పడుతోంది. అందుకే 90 నుంచి 95 శాతం మార్కులు సాధించగలుగుతోంది’ అని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్టుల పిల్లలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం స్కాలర్ షిప్స్, ప్రశంసా పత్రాలు అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జలవిహార్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘కష్టపడి ప్రతిభను చాటిన వారికి ఇచ్చే ఇలాంటి గౌరవం వారికి మరింత ప్రోత్సాహంగా నిలుస్తుందన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులోనూ ఉన్నత విజయాలు సాధించాలని పేర్కొన్నారు. నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడెమీ నిర్వాహకురాలు బాల లత, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్, కోశాధికారి రమేష్ వైట్లలతో పాటు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.


