తటాక పతంగోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు ఉత్సవాలకు వేదికలు అవుతున్నాయి. గతేడాది బతుకమ్మ ఉత్సవాలు అంబర్‌పేటలోని బతుకమ్మకుంట వద్ద జరగ్గా.. ఈ ఏడాది సంక్రాంతి నేపథ్యంలో కై ట్ ఫెస్టివల్‌కు మరికొన్ని చెరువులు ముస్తాబయ్యాయి. మాదాపూర్‌లోని తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, పాతబస్తీలోని బుమ్రుక్ ఉద్ దౌలా చెరువులు దీనికోసం సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, మిగిలిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. నగరంలో చెరువులు 60 శాతం వరకూ కనుమరుగయ్యాయి. మిగిలిన చెరువులు చాలా వరకు ఆక్రమణలు, వ్యర్థాలు, మురుగు నీటితో నిండిపోయాయి. దీనిపై దృష్టి పెట్టిన హైడ్రా దశల వారీగా చెరువుల్ని అభివృద్ధి చేయడంతో పాటు వాటికి పునరుజ్జీవం కల్పిస్తోంది. ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు తమ్మిడికుంట, నల్ల చెరువు, బుమ్రుక్ ఉద్ దౌలా చెరువుల వద్ద జరుగనున్న కై ట్ ఫెస్టివల్‌కు వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించనున్నారు. తమ్మిడికుంట వద్దకు ఐటీ ఉద్యోగులు, కూకట్‌పల్లి నల్లచెరువు వద్దకు సినీ ప్రముఖులు, బుమ్రుక్ ఉద్ దౌలా చెరువు వద్దకు క్రీడా కారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో హైడ్రా పర్యాటక శాఖతో కలిసి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆక్రమణలతో 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తమ్మిడికుంటను 30 ఎకరాలకు, నల్ల చెరువును 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు, బుమ్రుక్ ఉద్ దౌలా చెరువును 4.12 ఎకరాల నుంచి 17 ఎకరాలకు విస్తరించిన హైడ్రా వీటికి పునరుజ్జీవలం కల్పించింది. హైడ్రా మొదట విడత చేపట్టిన ఆరు చెరువుల అభివృద్ధిని చేపట్టింది. వీటిలో బతుకమ్మకుంట ఇప్పటికే ప్రారంభం కాగా.. మరో మూడు సిద్ధమయ్యాయి. మాదాపూర్‌లోని సున్నం చెరువు, ఉప్పల్‌లోని నల్ల చెరువుల అభివృద్ధి వివిధ దశల్లో ఉంది.
ముస్తాబైన కూకట్‌పల్లి నల్ల చెరువు
ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ
అభివృద్ధి చేసిన చెరువుల వద్ద కై ట్ ఫెస్టివల్
ఏర్పాట్లు చేపట్టిన హైడ్రా


