ప్రతిష్టకు ఎగనామం
● మల్కాజిగిరిగా మారిన రాచకొండ కమిషనరేట్
● గ్లోబల్ సిటీ అంటూ ఇలా పెట్టడంపై అభ్యంతరం
● సికింద్రాబాద్ పేరుతోనే కొనసాగించాలనే అభిప్రాయం
● కొత్తవాటి మధ్య సిబ్బంది విభజన సైతం ఇబ్బందే
● ప్రస్తుతానికి తాత్కాలికంగా పనులు చేసుకోనున్న పోలీస్ బాస్‌లు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ మాదిరిగానే పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త జోన్లు, డివిజన్లు, పోలీసుస్టేషన్లు... పరిధులతో రూపురేఖలు మార్చింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధులు మారగా... రాచకొండ స్థానంలో మల్కాజిగిరి కమిషనరేట్ వచ్చింది. ఈ పేరుపైనే అనేక విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మేడ్చల్ పోలీసుస్టేషన్‌ను సైబరాబాద్ కమిషనరేట్‌లో కలపడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉండటం, మల్కాజిగిరి పేరుతో కమిషనరేట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మేడ్చల్‌ను సైబరాబాద్‌లో చేర్చడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ కమిషనరేట్లలో అధికారికంగా నేటి (శుక్రవారం) నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
అప్పట్లోనే అనేక విమర్శలు..
ఒకప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉండేది. 2002లో సైబరాబాద్ కమిషనరేట్‌కు రూపమిచ్చిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం 2016లో సైబరాబాద్‌ను విడగొడుతూ నల్లగొండలోని కొన్ని ప్రాంతాలను కలిపి మరో కమిషనరేట్ ఏర్పాటు చేసింది. తొలినాళ్లల్లో దీన్ని సైబరాబాద్ ఈస్ట్ అన్నా..ఆపై రాచకొండగా మార్చారు. దీనికి ఆ పేరు పెట్టడంపై అప్పట్లో అనేక విమర్శలు సైతం వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్. రాచకొండల్లో ఉన్న ప్రాంతాలతో ఏర్పడిన కొత్త కమిషనరేట్‌కు మల్కాజిగిరి అని పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జగమెరిగిన సికింద్రాబాదే మేలు..
దేశంలోనే కాదు.. ప్రపంచం పటంలోనే హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్ పేరు సుపరిచితమే. రైల్వేస్టేషన్, మహంకాళి దేవాలయం, పరేడ్ గ్రౌండ్స్, కంటోన్మెంట్ బోర్డు, బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ ఉండటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క సికింద్రాబాద్‌కు బ్రిటిషర్ల కాలం నుంచీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్‌లో ఈ ప్రాంతాలు కూడా ఉన్నాయి. దీంతో సికింద్రాబాద్ పేరు ఖరారు చేస్తే ఉత్తమం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బృహత్ జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్, గ్రేటర్ సైబరాబాద్‌గా మార్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే విషయం గమనార్హం.
సిబ్బంది విషయంలోనే
ఇబ్బందులు..
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ మధ్య సిబ్బంది విభజన విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించుకుని, భవిష్యత్తులో తుది చర్యలు తీసుకోనున్నారు.
ఇలా విస్తరించి ఉండటంతో...
హైదరాబాద్, సైబరాబాద్ మొత్తం చార్మినార్ జోన్‌లో భాగం. రాచకొండ మాత్రం చార్మినార్ జోన్‌తో పాటు యాదాద్రిలోనూ విస్తరించి ఉంది. ఈ కమిషనరేట్ మల్కాజిగిరిగా మారే వరకు యాదాద్రి ప్రాంతం కూడా ఇందులో భాగంగానే ఉండేది. దీంతో ఈ కమిషనరేట్‌లో రెండు జోన్లు ఉండేవి. పునర్వ్యవస్థీకరణ తర్వాత రాచకొండలోని కొన్ని ప్రాంతాలు మల్కాజిగిరిలో, కొన్ని హైదరాబాద్‌లో వచ్చి కలిశాయి. దీంతో ఇక్కడి సిబ్బంది సాంకేతికంగా హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లలో పని చేస్తున్నా... వారి నియంత్రణ అధికారం మాత్రం చార్మినార్, యాదాద్రి జోన్లకు సంబంధించిన డీఐజీలకే ఉంటుంది. దీంతో భవిష్యత్తులో వీరికి పదోన్నతులు కల్పించాలంటే ఈ రెండు జోన్లకు చెందిన డీఐజీలకు జాబితా పంపి, దాని ఆధారంగానే ముందుకు వెళ్లాల్సి ఉండటంతో సీనియారిటీ జాబితా తయారీలో సాకేంతిక ఇబ్బందులు వస్తాయి.
సైబరాబాద్‌లో కలుస్తున్న ‘జిల్లా’..
మల్కాజిగిరి కమిషనరేట్‌లోనూ ఇలాగే హైదరాబాద్, యాదాద్రి జోన్లకు ఎంపికై న వాళ్లు ఉన్నారు. మరోపక్క సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోకి పటాన్‌చెరు, అమీన్‌పూర్, ఆర్సీపురం తదితర ప్రాంతాలను తీసుకువచ్చి కలిపారు. కానిస్టేబుల్ స్థాయి అధికారుల రిక్రూట్‌మెంట్ రెవెన్యూ జిల్లా, యూనిట్ స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతం సైబరాబాద్‌లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు భౌగోళికంగా ఆ కమిషనరేట్‌కు చెందిన స్థానికులు అవుతారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన వాళ్లు అమీన్‌పూర్, పటాన్‌చెరువు, ఆర్సీపురం ఠాణాల్లో పని చేస్తూ ఉంటారు. ఈ కారణంగా వీరి సీనియారిటీ జాబితా తయారీ, పదోన్నతులు సైతం చార్మినార్ జోన్‌తో పాటు సంగారెడ్డిలకు పంపాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక కారణాలను అధిగమించాలంటే జోన్లను పునర్వవస్థీకరించాల్సి ఉంది. ఆ మేరకు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపి ఆ మొత్తం పొంది రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు వెలువడాలి. దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది విభజన చేసుకోనున్నారు.


