
మీరు వద్దనుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్లను
కొన్ని పార్టీల తప్పుడు ప్రచారం నమ్మొద్దు
స్థానిక ఎన్నికల్లో ఇల్లిల్లూ తిరిగి మిమ్మల్ని గెలిపించుకుంటా
వస్త్ర వ్యాపారులకు రాజకీయాలెందుకు?
సిరిసిల్లలో పార్టీ శ్రేణులతో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
కుటుంబ సభ్యుల కోసమే సీఎం ఫ్యూచర్ సిటీ ప్రచారమని విమర్శ
బీఆర్‌ఎస్ కార్యకర్త కుంటయ్య కూతురు వివాహం జరిపించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/గంభీరావుపేట/సిరిసిల్ల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు తెలిపారు. తాను హైదరాబాద్ శివార్లలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని, దానిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ సమావేశమై మాట్లాడారు. ‘మీ ఆశీర్వాదంతోనే రాజకీయంగా ఎదిగాను. మీరు వద్దనుకునే వరకు ఇక్కడే పోటీ చేస్తాను. వచ్చే ఎన్నికల్లో నేను సిరిసిల్లలో పోటీ చేయనని, హైదరాబాద్ శివారుల్లో పోటీ చేస్తానని కొన్ని పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దు’అని కోరారు.
మిమ్మల్ని దగ్గరుండి గెలిపించుకుంటా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను దగ్గరుండి గెలిపించుకుంటానని కేటీఆర్ తెలిపారు. ‘నా గెలుపు కోసం మీరంతా కష్టపడ్డారు. మీ గెలుపు కోసం మున్సిపల్ ఎన్నికల్లో నేను కష్టపడుతాను. ఇంటింటికీ వెళ్తాను. అభ్యర్థులకు బీఆర్‌ఎస్ టిక్కెట్ల నేనే ఇస్తాను. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే. సిరిసిల్ల వస్త్రవ్యాపారులు కొందరు రాజకీయాలు చేస్తున్నారు. వారు వ్యాపారం చేసుకోవాలే తప్ప, వాళ్లకు రాజకీయాలు ఎందుకు?’అని ప్రశ్నించారు.
యూరియా కొరతతో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్‌ఐఆర్)తో పాటు ఎన్నికల సంఘానికే సమగ్ర ప్రక్షాళన అవసరమని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంపై ఆయన ‘ఎక్స్’ లో స్పందించారు.
‘ఎన్నికల సంఘం నిర్వహించిన మీడియా సమావేశంలో సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువగా మిగిలాయి. దీనిపై ఎన్నికల ప్రధాన కమిషనర్ ఇచ్చిన వివరణలో, సమస్యల పరిష్కారాల కన్నా సాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడాల్సిన ఎన్నికల సంఘం, ఎన్డీయే ప్రభుత్వానికి అనుబంధ విభాగంలా పనిచేస్తోంది. ఓటర్ల జాబితాలో లోపాలను అంగీకరించినప్పుడు, తమ విధులను నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదు
సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే ప్రచారం చేస్తున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న సీఎం ఆకాంక్ష నెరవేరదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి విజన్ లేని నాయకుడు. ఆయన నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతోంది. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందనే దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ’అని మండిపడ్డారు. ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
కుంటయ్య కూతురు పెళ్లి చేసిన కేటీఆర్
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరికవేణి కుంటయ్య ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన కూతురు లక్షిత (భార్గవి) పెళ్లి బాధ్యతలను కేటీఆర్ నిర్వహించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో పెళ్లి వేడుకలకు ఆదివారం హాజరయ్యారు. పెళ్లి ఖర్చులను పార్టీ పరంగా కేటీఆర్ భరించారు. కుంటయ్య చిన్న కూతురుకు కొంత డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా అందించారు.
ఆ ఆహ్వానం నాకెంతో ప్రత్యేకం
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నవిత వివాహానికి కూడా కేటీఆర్ ఆదివారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘అన్నా.. నాకు నాన్న, అన్న లేరు. మీరు అన్నయ్యగా పెళ్లికి వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి’ నవిత వాట్సాప్‌లో పంపిన ఆహ్వానం తన మనస్సును కదిలించిందని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి.
ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది. కానీ నా చెల్లి తన నాన్న, అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చాలని నన్ను పిలిచింది. ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు.. అది నా మీద ఉంచిన నమ్మకం. ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ. ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించాను’అని పేర్కొన్నారు.