ఫ్యూచర్ సిటీలోనే కమిషనరేట్!
మూడు జోన్లు, 22 ఠాణాలతో దీని స్వరూపం
● 30– 40 ఎకరాల స్థలాన్వేషణలో యంత్రాంగం
● నాలుగు నెలల తర్వాత ఫ్యూచర్‌కు కొత్త పోలీసు బాస్?
ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌కు తొలి కమిషనర్‌గా జి.సుధీర్‌బాబును నియమించింది. ఇప్పటివరకు రాచకొండ కమిషనర్‌గా ఉన్న ఈయన ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భారత్ ఫ్యూచర్ సిటీకి పోలీసు బాస్‌గా నియమించారనే ప్రచారం జరుగుతోంది. మరో 3–4 నెలల్లో సుధీర్ బాబు పదవీకాలం ముగియనుంది. దీంతో ఫ్యూచర్ సిటీకి కొత్త పోలీసు బాస్ నియామకం అనివార్యం. ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత కూడా సుధీర్ బాబునే కమిషనర్‌గా కొనసాగిస్తే.. పదవీ విరమణ తర్వాత కూడా పోలీసు కమిషనర్‌గా కొనసాగిన తొలి కమిషనర్‌గా సుధీర్ బాబు రికార్డ్ సృష్టించినట్లవుతుందనే ప్రచారం జరుగుతోంది.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను పునర్ వ్యవస్థీకరించడంతో రాజధానిలో శాంతి భద్రతలను కాపాడటం, పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చడం, సమర్థమైన పర్యవేక్షణ అనివార్యమైన నేపథ్యంలో గ్రేటర్ పోలీసు విభాగాన్ని కూడా పునర్విభజించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లు ఉండగా.. కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్, రాచకొండలోని పలు శాంతి భధ్రతలు, ట్రాఫిక్ జోన్లను వేరు చేసి.. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు బదలాయించారు. దీంతో ప్రస్తుతం ఈ కొత్త కమిషనరేట్ పరిధిలో శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం లా అండ్ ఆర్డర్ జోన్ల పరిధిలోని 22 ఠాణాలు, మాదాపూర్, ఎల్బీనగర్ ట్రాఫిక్ జోన్ల పరిధిలోని నాలుగు పీఎస్‌లతో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ స్వరూపం ఉంటుంది. ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలిక కాలం పాటు ఇక్కడి నుంచే కమిషనరేట్ కార్యకలాపాలు సాగించనుంది. త్వరలోనే ప్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిలో కమిషనరేట్‌కు స్థలం కేటాయించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే 30– 40 ఎకరాల స్థలం కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
కొత్త కమిషనరేట్ ఎందుకంటే?
ఔటర్ రింగ్ రోడ్ వరకూ జీహెచ్‌ఎంసీ విస్తరణ తర్వాత గ్రేటర్ పరిధి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి మధ్యలో ముచ్చర్ల ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు పలు బహుళ జాతి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీంతో అంతర్జాతీయ పెట్టుబడులు, కంపెనీలకు శాంతిభద్రతలు, పెట్టుబడులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో కొత్తగా ఫ్యూచర్ సిటీ పరిధి వరకు పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సైబరాబాద్, రాచకొండలోని పలు ప్రాంతాలను వేరు చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు.
ఠాణాలివీ
జోన్లు (3): శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం
డివిజన్లు (6): శంషాబాద్, షాద్‌నగర్, చేవెళ్ల, నార్సింగి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం
ఠాణాలు (22): కొత్తూరు, నందిగామ, ఆమన్‌గల్, తలకొండపల్లి, కడ్తాల్, శంషాబాద్/పెద్దషాపూర్, షాద్‌నగర్ టౌన్, కేశంపేట, కొందుర్గ్, చౌదరిగూడెం, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, మోకిల, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, కందుకూరు, మహేశ్వరం, మాడ్గుల.
ఠాణాలివీ
జోన్లు (3): శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం
డివిజన్లు (6): శంషాబాద్, షాద్‌నగర్, చేవెళ్ల, నార్సింగి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం
ఠాణాలు (22): కొత్తూరు, నందిగామ, ఆమన్‌గల్, తలకొండపల్లి, కడ్తాల్, శంషాబాద్/పెద్దషాపూర్, షాద్‌నగర్ టౌన్, కేశంపేట, కొందుర్గ్, చౌదరిగూడెం, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, మోకిల, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, కందుకూరు, మహేశ్వరం, మాడ్గుల


