సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో న్యూఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఫలితంగా న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నెల 25వ తేదీ నుంచి నిన్నటి వరకు మద్యం అమ్మకాల విలువ రూ.1350 కోట్లకు చేరింది. ముఖ్యంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లోనే దాదాపు రూ.1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.
29వ తేదీ రూ.280 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా..30వ తేదీన రూ.380 కోట్లు,31వ తేదీన రూ.315 కోట్ల అమ్మకాలతో.. మొత్తం మూడు రోజుల్లోనే 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగాయి.
రాష్ట్రంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, పార్టీలు, వ్యక్తిగత వేడుకల్లో మద్యం వినియోగం అధికంగా కనిపించింది. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించింది. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం, ఈ మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయల పన్ను ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరింది.
ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో మద్యం అమ్మకాలు పెరగడం సాధారణమే. అయితే ఈసారి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడం గమనార్హం. ఇది ప్రజల వినియోగ ధోరణిని, వినోదం పట్ల ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.


