డీలిమిటేషన్‌ దంగల్‌  | Womens Reservation and Delimitation Bills set for Parliament | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌ దంగల్‌ 

Apr 16 2026 5:17 AM | Updated on Apr 16 2026 5:17 AM

Womens Reservation and Delimitation Bills set for Parliament

కేంద్రం, విపక్షాలు నువ్వా, నేనా? 

నేటినుంచే పార్లమెంటు ప్రత్యేక భేటీ 

మహిళా రిజర్వేషన్ల చట్టానికి సవరణ 

నేడు లోక్‌సభలో బిల్లు పెట్టనున్న కేంద్రం 

మూడొంతుల మెజారిటీ ఉంటేనే ఆమోదం 

కేంద్రానికి విపక్షాల మద్దతు తప్పనిసరి 

సభ ముందుకు 2 డీలిమిటేషన్‌ బిల్లులు

న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుకు, కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాలకు నడుమ పార్లమెంటులో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. మహిళా రిజర్వేషన్ల చట్టం సత్వర అమలుకు వీలు కల్పించేందుకు ఉద్దేశించిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లు ఇందుకు వేదిక కానుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ను 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు పట్టుదలగా ఉంది. 

అందుకోసమే గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ మేరకు మహిళా రిజర్వేషన్ల చట్టానికి చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టేలా రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026ను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం గురు, శుక్రవారాల్లో బిల్లుపై కీలక చర్చ జరగనుంది. ఇందుకు 18 గంటల సమయం కేటాయించారు. చర్చకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చాక బిల్లుపై ఓటింగ్‌ జరుగుతుంది. 

ఆ తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం రాజ్యసభలో ప్రవేశపెడతారు. 10 గంటల చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్‌ జరగనుంది. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచనున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్‌ వ్వవస్థీకరణకు వీలుగా డీలిమిటేషన్‌ బిల్లు–2026ను కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ రెండు బిల్లులనూ కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్‌ ప్రవేశపెడతారు. వాటితో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టం (సవరణ) బిల్లు–2026 కూడా సభ ముందుకు రానుంది. దాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టనున్నారు. 

కేంద్రంపై గుర్రుగా విపక్షాలు 
మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణకు మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలన్నీ గుర్రుగా ఉన్నాయి. తమతో మాటమాత్రం కూడా సంప్రదించకుండా, వివరాలేవీ వెల్లడించకుండా గుట్టుగా వ్యవహరించడం వెనక మతలబు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నాయి. దీనికి తోడు డీలిమిటేషన్‌పైనా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాధికారం అసమంజసంగా పెరిగిపోతుందని, తద్వారా తమకు తీరని నష్టం, అన్యాయం జరుగుతాయని అవి వాదిస్తున్నాయి. 

దీనిపైనా కేంద్రం వ్యవహార శైలిని విపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. అంతేగాక మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణకు డీలిమిటేషన్‌తో ఎందుకు ముడి పెట్టాల్సి వచ్చిందన్నది వాటి ప్రధాన అభ్యంతరం. మహిళా రిజర్వేషన్ల అమలు సాకుతో లోక్‌సభ స్థానాలను పెంపుకు ఆమోదం పొందేందుకు కేంద్రం ప్రయతి్నస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును వ్యతిరేకించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ విషయంలోమోదీ సర్కారు వ్యవహార శైలిని తీవ్రంగా ఎండగట్టాలని కూడా భావిస్తున్నాయి. దాంతో సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కన్పిస్తోంది. 

దీనికి తోడు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు మోదీ సర్కారుకు విపక్షాల మద్దతు తప్పనిసరి కానుంది! ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై లోతుగా చర్చించాయి. అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. విపక్షాలన్నీ డీలిమిటేషన్‌ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటేస్తాయని ఆయన ప్రకటించారు! ‘‘మేం మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. మోదీ సర్కారు రాజకీయ లబ్ధి కోసం బిల్లు తెచ్చిన తీరునే వ్యతిరేకిస్తున్నాం’’అన్నారు. సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్‌ తమ ఎంపీలకు విప్‌ జారీ చేశాయి.

గరిష్టంగా 850కి లోక్‌సభ స్థానాలు 
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వు చేసేలా 2023లోనే ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’పేరుతో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది 2034కు ముందు అమలయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు నిర్ణయించింది. అందుకు వీలుగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి గరిష్టంగా 850 దాకా> పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. తుది సంఖ్యను త్వరలో ఏర్పాటయ్యే డీలిమిటేషన్‌ కమిషన్‌ నిర్ధారిస్తుంది. దాంతోపాటు అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం మేరకు పెంచనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా జనాభా లెక్కలను, అంటే 2011 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు బిల్లు ముసాయిదాలో వెల్లడించింది. మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలుగా 81వ ఆరి్టకల్‌కు సవరణలు ప్రతిపాదించింది.

అవన్నీ వదంతులే 
‘దక్షిణాదికి అన్యాయం’పై కేంద్రం 
లోక్‌సభ నియోజకవర్గాల పెంపులో దక్షిణాదికి అన్యా యం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘‘వాస్తవానికి ఆ రాష్ట్రాలకే లబ్ధి చేకూరబోతోంది. సీట్ల పెంపులో దామాషా ప్రాతినిధ్య పద్ధతిని అనుసరిస్తుండటమే ఇందుకు కారణం’’అని తెలిపాయి. ఈ విషయమై పార్లమెంటులో ప్రధాని స్పష్టత ఇవ్వనున్నట్టు అవి వెల్లడించాయి. దీనిపై వదంతులు ప్రచారం చేయొద్దని సూచించాయి.  

సవరణ బిల్లు గట్టెక్కేనా? 
రాజ్యంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. లోక్‌సభలో మూడు ఖాళీలు పోను ప్రస్తుత సభ్యుల సంఖ్య 540. ఆ లెక్కన మూడింట రెండొంతుల మెజారిటీ 360. అధికార ఎన్డీఏ కూటమికి సభలో ఉన్నది 292 మంది సభ్యులే. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యులు 245. ఒక స్థానం ఖాళీగా ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీ 163 కాగా ఎన్డీఏ కూటమికి ఉన్నది 139 సభ్యుల బలమే. కనుక ఉభయ సభల్లోనూ సభ్యులంతా ఓటింగ్‌కు హాజరయ్యే పక్షంలో బిల్లు ఆమోదానికి అధికార పక్షానికి లోక్‌సభలో మరో 68 మంది, రాజ్యసభలో 24 మంది ఎంపీలు అవసరం. ఇందుకు విపక్షాల మద్దతు తప్పనిసరి. లోక్‌సభలో విపక్ష ఇండియా కూటమి బలం 233. మరో 15 మంది చిన్న పార్టీలకు చెందిన/స్వతంత్ర ఎంపీలున్నారు. రాజ్యసభలో ఇండియా కూటమికి 75 మంది, ఇతర విపక్షాలన్నింటికీ కలిపి 30 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి పార్టీలన్నీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాయని ఖర్గే ప్రకటించిన నేపథ్యంలో బిల్లు గట్టెక్కడంపై కేంద్రం ధీమా ఏమిటన్నది అంతుపట్టడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement