ముస్లింల ప్రాతినిధ్యానికి కోత
డీలిమిటేషన్ బిల్లుపై లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా నియంత్రణ పాటించి దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ పేరుతో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘‘దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే కుట్రలో భాగంగానే బీజేపీ సర్కార్ ఈ బిల్లులను తీసుకొచ్చింది.
దేశ జీడీపీలో 30 శాతం వాటాతో పాటు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న దక్షిణాదికి ఎంపీ సీట్ల కోతతో శిక్ష విధించడం దారుణం. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు తక్కువ సీట్లు, జనాభా పెంచిన ఉత్తరాదికి ఎక్కువ సీట్లు ఇవ్వడం ఇదెక్కడి న్యాయం?. అస్సాం, జమ్మూకశ్మీర్‌లలో ముస్లింల ప్రాతినిధ్యాన్ని తగ్గించినట్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ కుట్రను అమలు చేసి ముస్లిం ఎంపీలు లేకుండా చేయాలని చూస్తున్నారు. దక్షిణాదికి, మైనార్టీలకు అన్యాయం జరగకుండా జనాభాతో పాటే ఆర్థిక పనితీరుకు కూడా ప్రాధాన్యం ఇస్తూ కెనడా తరహా ‘హైబ్రిడ్ మోడల్’ను అమలు చేయాలి’’ అని ఆయన సూచించారు.


