పునర్వీభజన తర్వాత లోక్‌సభ స్థానాల సంఖ్య ఇదే!
లోక్‌సభకు వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం స్థానాల సంఖ్య 195కు
వాటి ప్రాతినిధ్యానికి నష్టమూ ఉండదని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య 17నుంచి 26కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి పెరగనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్వీభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల చట్ట రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై జరిగిన చర్చలో అమిత్ షా ప్రసంగించారు.
డీలిమిటేషన్ వల్ల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళనను ఆయన తోసిపుచ్చారు. పునర్విభజన అనంతరం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 129 నుంచి 50 శాతం, అంటే 195కు పెరుగుతుందని వెల్లడించారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గదు. పైపెచ్చు సభలో వాటి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది’’అంటూ గణాంకాలతో సహా మంత్రి వివరించారు. 
‘‘మొత్తం చర్చపై కేంద్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం సమాధానమిస్తాను. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పదలచాను. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రజలకు ఎలాంటి అపోహలూ వద్దు. ఈ బిల్లులతో లోక్‌సభలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుందని పెద్ద వాదనను లేవనెత్తుతూ భ్రాంతిని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వదలచాను. సభ ముందున్న బిల్లుల ఆధారంగా వాస్తవాలు అందరి దృష్టికీ తెస్తాను. నియోజకవర్గాల పునర్వీభజనతో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 25నుంచి 38కు, ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 4.60 నుంచి 4.65 శాతానికి పెరుగుతాయి.
తెలంగాణలో స్థానాలు 17 నుంచి 26కు, ప్రాతినిధ్యం 3.13 నుంచి 3.18కి పెరుగుతాయి. తమిళనాడులో సీట్లు 39 నుంచి 59కు, ప్రాతినిధ్యం 7.18 నుంచి 7.23 శాతానికి పెరుగుతాయి. కర్నాటకలో లోక్‌సభ స్థానాలు 28నుంచి 42కు, సభలో ప్రాతినిధ్యం 5.15 శాతం నుంచి 5.14 శాతానికి చేరతాయి. కేరళలో సీట్లు 20 నుంచి 30కి, లోక్‌సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 3.68 నుంచి 3.67 శాతానికి చేరతాయి. మొత్తమ్మీద దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్య 195కు పెరుగుతుంది. లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యం 23.76 శాతం నుంచి 23.97 శాతానికి పెరుగుతుందే తప్ప ఏ మాత్రమూ తగ్గదు. అలాంటప్పుడు దక్షిణాదికి అన్యాయమన్న ప్రశ్నే తలెత్తదు’’అని స్పష్టం చేశారు.
జనగణనతో పాటే కులగణన
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనతో పాటే కులగణన కూడా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘కులగణన చేపట్టాలని కేంద్రం భావించడం లేదని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తన్నాయి. మోదీ ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. జనగణన రెండు దశల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇళ్ల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. వ్యక్తిగత డేటాను తీసుకునేటప్పుడు కులగణన అంశం కూడా వస్తుంది’’అని ఆయన స్పష్టం చేశారు.
2029 తర్వాతే అమలు
నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో అమలు కాబోదని సభకు అమిత్ షా తెలియజేశారు. ‘‘డీలిమిటేషన్ కమిషన్ నివేదికను పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి ముద్ర పడిన తర్వాతే అమల్లోకి వస్తుంది. ఇదంతా 2029కి ముందు జరిగే ప్రసక్తే లేదు. కనుక అప్పటిదాకా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు పాత నియోజకవర్గాల ప్రాతిపదికనే జరుగుతాయి’’ అని చెప్పారు.
లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్య 816!
లోక్‌సభలో సీట్ల సంఖ్య పెంపుపై విపక్షాల ప్రశ్నలకు బదులిస్తూ అమిత్ షా ఒక ఉదాహరణ చెప్పారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ముందుగా మొత్తం సీట్లను 50 శాతం పెంచాలి. అప్పుడు వాటిలో 33 శాతం మహిళలకు కేటాయించినా మిగతా ఓపెన్ సీట్ల సంఖ్య యథాతథంగా ఉంటాయి. అంటే ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం పెంచితే వాటిలో 33 శాతాన్ని మహిళలకు రిజర్వ్ చేశాక కూడా ఓపెన్ కేటగిరీలో 543 సీట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టే 50 శాతం పెంపును ప్రతిపాదించాం’‘అని ఆయన వివరించారు. ‘‘లోక్‌సభ స్థానాల పెంపు గరిష్టంగా 850 దాకా అనేది సుమారుగా వేసిన సంఖ్య. కచ్చితమైన సంఖ్య బహుశా 815, లేదా 816గా ఉండవచ్చు. దీనిపై సభకు సమగ్రంగా వివరణ ఇస్తా’’అని చెప్పారు.


