ఆశల పల్లకీలో! | Delimitation Steps towards redistribution of constituencies Lok Sabha, State Assembly seats | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకీలో!

Mar 25 2026 3:59 AM | Updated on Mar 25 2026 4:03 AM

Delimitation Steps towards redistribution of constituencies Lok Sabha, State Assembly seats

నియోజకవర్గాల పునర్విభజన దిశగా వడివడిగా అడుగులు

2011 జనాభా లెక్కల ఆధారంగానే ప్రక్రియ షురూ 

అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరిగే చాన్స్‌ 

17 నుంచి 26కు లోక్‌సభ నియోజకవర్గాలు 

ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఇక ఒక జిల్లా పరిధిలోనే.. 

మహిళా కోటా అమలుతో 60 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలు రిజర్వ్‌

(శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి– సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు తొలి అడుగు పడింది. పునర్విభజన జరిగితే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రాజకీయంగా కూడా అవకాశాలు పెరుగుతాయి. 2027 జనాభా లెక్కలు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో 2011 లెక్కలతోనే ప్రక్రియ మొదలుకానుంది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కు పెరగనుండగా, లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగనున్నాయి. 

వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే..60 స్థానాలు పెరిగితే 179 కావాలి..కానీ ప్రతి లోక్‌సభ స్థానానికి 7 శాసనసభ స్థానాలు ఉండాలన్న నియమంతో 26 లోక్‌సభ స్థానాల పరిధిలో 182 శాసనసభ స్థానాలు ఏర్పాటు అయ్యే  అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనలతో వారికి శాసనసభలో 60, లోక్‌సభలో 9 స్థానాలు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నుంచే పెంపు అమల్లోకి వస్తుంది. 

ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం 
ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఒక శాసనసభ  నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలో ఉండాలన్న ప్రాథమిక నిబంధన మేరకు జిల్లా యూనిట్‌గా తీసుకుంటారు. ప్రస్తుతం పలు శాసనసభ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కానీ కొత్తగా చేపట్టే పునర్విభజనలో కొత్త నియోజకవర్గాల హద్దులు ఒకే జిల్లాకు పరిమితమవుతాయి. ఈ మేరకు పలు ప్రస్తుత నియోజకవర్గాల పరిధుల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధుల్లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటయ్యే 63 శాసనసభ స్థానాల్లో అత్యధికం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. 

పునర్విభజన ఇలా..! 
రాష్ట్రంలోని మొత్తం జనాభాను అన్ని నియోజకవర్గాలకు దాదాపు సమానంగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గానికి సగటుగా నిర్ణయించే జనాభా సంఖ్యలో 10 శాతం తక్కువ లేదా ఎక్కువ ఉండే వెసులుబాటు ఉంటుంది. 2011 లెక్కల మేరకు రాష్ట్ర జనాభా 3,51,90,260 మంది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గ సగటు 1,93,353గా ఉంటుంది. ఈ మొత్తానికి పది శాతం తక్కువ లేదా ఎక్కువ జనాభా సగటుతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పునర్విభజన కోసం ఏర్పాటు చేసే కమిషన్‌కు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు సభ్యులుగా ఉంటారు. కమిషన్‌ తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 

మహిళలకు ఎలా..? 
మహిళలకు కేటాయించే స్థానాలు లాటరీ ద్వారా కేటాయిస్తారా..లేక అత్యధిక జనాభా ఉన్న మొదటి 60 నియోజకవర్గాలను ఎంచుకుంటారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుంటే పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, వికారాబాద్‌ జిల్లాల్లో అత్యధిక స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. 

ఉమ్మడి జిల్లాల వారీగా కొత్తవి ఎన్ని..     
ఆదిలాబాద్‌లో 5  
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం 10 నియోజకవర్గాలుండగా కొత్తగా మరో ఐదు స్థానాలు పెరగనున్నాయి. కొత్తగా ఆదిలాబాద్‌ అర్బన్, ఉట్నూరు, మంచిర్యాల రూరల్‌ లేదా లక్సెట్టిపేట, నర్సాపూర్‌ (నిర్మల్‌) నియోజకవర్గాలతో పాటు మరొకటి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఉన్న ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న నార్నూరు, గాదిగూడ మండలాలు ఆదిలాబాద్‌ జిల్లాలో ఏర్పడే కొత్త నియోజకవర్గంలోకి వెళతాయి. నిర్మల్‌ జిల్లాలో ఉన్న ప్రాంతాలతోనే ఖానాపూర్‌ నియోజకవర్గం హద్దులు మార్చుకుంటుంది. 

నిజామాబాద్‌లో 3 
నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలకు కొత్తగా మరో మూడు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయి. కొత్తగా నిజామాబాద్‌ సౌత్‌ లేదా నార్త్, బోధన్‌ నియోజకవర్గం నుండి కొన్ని ప్రాంతాలను విడదీసి ఎడపల్లి లేదా బోధన్‌ రూరల్‌ నియోజకవర్గం ఏర్పాటవుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలో కొత్తగా కామారెడ్డి రూరల్‌ æస్థానం ఏర్పాటుకు అవకాశం ఉంది. 

కరీంనగర్‌లో 5 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా, కొత్తగా ఐదు స్థానాలు ఏర్పడతాయి. కరీంనగర్‌ రూరల్, జగిత్యాల రూరల్, మెట్‌పల్లి, సుల్తాన్‌బాద్, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల జిల్లా) నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్‌ నుండి సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోకి సుమారు 10 మండలాలు వెళ్లటంతో తక్కువ నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి. 

మెదక్‌లో 7 
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రస్తుతం 11 స్థానాలుండగా, కొత్తగా 7 స్థానాలు ఏర్పాటవుతాయి. అందులో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రామచంద్రాపురం, అమీన్‌పూర్, సదాశివపేట, మెదక్‌ జిల్లాలో రామాయంపేట నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్‌లతో పాటు కొత్తగా సిద్దిపేట రూరల్‌ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రెండు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని తూప్రాన్, మనోహరాబాద్, దుబ్బాకలోని చేగుంట రామాయంపేటలో చేరతాయి. 

నల్లగొండలో 6  
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా కొత్తగా 6 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. కొత్తగా మిర్యాలగూడ రూరల్, నల్లగొండ రూరల్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి భువనగిరిలో రామన్నపేట లేదా చౌటుప్పల్‌ లేదా మోత్కూరు నియోజకవర్గం, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు 4 స్థానాలుండగా కొత్తగా సూర్యాపేట రూరల్, మునగాల నియోజకవర్గాలతో ఇంకో నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది.  

ఖమ్మంలో 2 
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలుండగా, పునర్విభజన అనంతరం కొత్తగా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్‌ మండలంలోని పలు ప్రాంతాలతో ఖమ్మం రూరల్‌ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. మిగిలిన స్థానాలు యథాతథంగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలుండగా కొత్తగా ఒక స్థానం పెరుగుతుంది. 

వరంగల్‌లో 9 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా కొత్తగా 9 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లాలో కాజీపేట, హసన్‌పర్తి, శాయంపేట, మడికొండ, వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ సెంట్రల్, గీసుకొండ, మహబూబాబాద్‌ జిల్లాలో మహబూబాబాద్‌ రూరల్, తొర్రూరు,, భూపాలపల్లిలో కాటారం, జనగామలో ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలు కొనసాగే అవకాశం ఉంది. 

మహబూబ్‌నగర్‌లో 6 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్తగా 6.. మహబూబ్‌నగర్‌ రూరల్, గండీడ్, కోస్గి, అమరచింత, పెబ్బేరు, ఐజ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా విడిపోనుంది. అందులో కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గంలో కోస్గి, మద్దూర్‌ ఇతర మండలాలు చేరితే,, వికారాబాద్‌ జిల్లాలో ఉన్న కొడంగల్, బొమ్మరాశిపేట, దుద్యాల, దౌల్తాబాద్‌ మరో రెండు మండలాలతో కొడంగల్‌ రూపురేఖలు మారనున్నాయి. 

హైదరాబాద్‌ చుట్టూ మొత్తం 51  
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం 51కి పెరగనుంది. హైదరాబాద్‌లో 5 స్థానాలు పెరిగి మొత్తం 20 నియోజకవర్గాలు ఏర్పాటు కానునున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో 31 స్థానాలు అవుతాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం వికారాబాద్‌లోని మండలాలతోనే ఏర్పాటవుతుంది. ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు రెండేసిగా ఏర్పడి మొత్తం 13 నియోజకవర్గాలు, మేడ్చల్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 స్థానాలకు తోడు కొత్తగా కాప్రా, అల్వాల్, బోడుప్పల్, కొంపల్లి, మూసాపేట తదితర స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement