నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు లేదా మూడు పెరిగే అవకాశాలున్నాయి. 2019 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాల సంఖ్య 12 నుంచి 13కు చేరనుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల భౌగోళిక స్థితిగతుల్లో కూడా మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండలాలు పక్క నియోజకవర్గంలో కలిసే అవకాశాలున్నాయి. దీనికితోడు రిజర్వు స్థానాల సంఖ్య కూడా పెరగనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించడంతో ఈ అంశం చర్చకు దారితీస్తోంది. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని సీఎం కూడా ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై కసరత్తు ప్రారంభించడంతో చర్చ మొదలైంది.
భారీ మార్పులు
గతంలో జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు మాత్రమే ఉండేవి. 2009లో జరిగిన పునర్విభజనతో కొత్తగా బెల్లంపల్లి నియోజకవర్గం ఆవిర్భవించగా, లక్సెట్టిపేట ఎమ్మె ల్యే స్థానం మంచిర్యాల నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు మరోమారు పునర్విభజన అంశం తెరపైకి రావడంతో మార్పులు అనివార్యం కానున్నాయి. 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని పునర్విభజన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ లెక్కల ప్రకా రం జిల్లాలో 27.41 లక్షల జనాభా ఉంది.
ప్రతి 2.30 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం చొప్పున పునర్విభజన జరిగే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావి స్తున్నాయి. దీంతో జిల్లాలో రెండు లేదా మూడు నియోజకవర్గాలు పెరగనున్నాయి. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో మార్పు లు అనివార్యం కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ అర్బన్, బోథ్ నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాలను కలిపి ఆదిలాబాద్ రూరల్ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
పెరగనున్న రిజర్వుడ్ స్థానాలు
తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో సగం అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వు అయ్యాయి. ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వు కాగా, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఎస్సీ సామాజికవర్గానికి కేటాయించారు. పునర్విభజనతో తెలంగాణలో పెరుగనున్న నియోజకవర్గాలకు సంఖ్యను బట్టి రిజర్వు స్థానాల సంఖ్య కూడా పెరగాల్సి ఉంటుంది. దీంతో గిరిజనుల జనాభా అధికంగా ఉన్న జిల్లాలో రిజర్వుడు స్థానాల సంఖ్య ఆరుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.