సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద సమర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.
రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ పై అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల కేసులను ఫిబ్రవరి 2న అధికారులు పరిశీలించనున్నారు.
ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల పోరాటంలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టతకు వస్తుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో మున్సిపల్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


