నల్లగొండ: మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. గతంలో బీఆర్‌ఎస్ అవినీతి కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందన్నారు.
ఈరోజు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) నల్లగొండలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదు. యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయామన్న భావనలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు, స్మార్ట్ సిటీ, అమృత్, గృహ నిర్మాణం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి పథకాలకు వేగంగా నిధులు వస్తాయి. తెలంగాణ భవిష్యత్తు బీజేపీతోనే సురక్షితం. నల్లగొండ కార్పొరేషన్ లో 48 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశాం. నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం మా పార్టీకే లభిస్తుంది’ ధీమా వ్యక్తం చేశారు.


