ప్రగతి తెలంగాణే లక్ష్యం | Telangana Governor Shiv Pratap Shukla Speech In Telangana Budget Session 2026, Check Out Highlights Inside | Sakshi
Sakshi News home page

ప్రగతి తెలంగాణే లక్ష్యం

Mar 17 2026 4:26 AM | Updated on Mar 17 2026 10:18 AM

Telangana Governor Shiv Pratap Shukla Speech in Telangana Budget Session 2026

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా. చిత్రంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు తెచ్చేందుకు సర్కారు కృషి 

అందుకే తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌ డాక్యుమెంట్‌కు శ్రీకారం 

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు 

అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ముందడుగు 

ప్రజా భాగస్వామ్యంతో భవిష్యత్‌ తెలంగాణ నిర్మాణం 

క్యూర్, ప్యూర్, రేర్‌తో వికేంద్రీకృత వ్యూహం అమలు 

ప్రభుత్వ స్వప్నం సాకారానికి అందరం కలిసి పని చేద్దామని గవర్నర్‌ పిలుపు... అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్య 

ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం 

పథకాల్లో లోపాలు ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్‌ నిరసన

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ దిశగా బలమైన పునాదులు వేసేందుకు ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ఇదే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌కు శ్రీకారం చుట్టింది. దేశ పురోగతిలో ప్రధాన భూమిక పోషించే స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగేలా చర్యలు చేపట్టింది..’అని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా చెప్పారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని సోమ వారం ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

ప్రజా పాలన స్ఫూర్తి కొనసాగింపు 
రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరిస్తూ, వారిని గౌరవిస్తూ ప్రభుత్వం ప్ర జా పాలన స్ఫూర్తిని కొనసాగిస్తోంది. అమలు చేసే ప్రతి పథకం, ప్రతి విధానం, ప్రతి కార్యాచరణలో ప్రజల ఆత్మగౌరవం, సంక్షేమం, సామాజిక సమానత్వాన్ని ప్రభుత్వం పాటిస్తుందని విశ్వసిస్తున్నా. అదే ప్రజా పాలనకు గీటురాయి. రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్‌ కేంద్రంగా జరగాలనే పాత మోడల్‌కు ప్రజా ప్రభుత్వం ముగింపు పలికింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా, సమతుల్యంగా, సమ్మిళితంగా అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేసింది. క్యూర్‌ (కోర్‌ అర్బన్‌ రీజియన్, ప్యూర్‌ (పెరీ అర్బన్‌ రీజియన్‌), రేర్‌ (రూరల్‌ అగ్రి రీజియన్‌)తో వికేంద్రీకత వ్యూహాన్ని అనుసరిస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసి భవిష్యత్తు తెలంగాణను నిర్మిస్తోంది. 

ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి 
 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ’తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047’డాక్యుమెంట్‌ను ఆవిష్కరించింది. ’వికసిత్‌ భారత్‌– 2047 విజన్‌’కు అనుగుణంగా, నీతి ఆయోగ్, ఐఎస్‌బీ, నల్సార్‌ వర్సిటీని సంప్రదించి దీన్ని రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్థికంగా సుస్థిర స్థానంలో ఉంది. 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి నమోదు చేస్తోంది. 2025–26లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.17.82 లక్షల కోట్లు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.99 శాతం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి చేరుకుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని 0.2 శాతానికి ప్రభుత్వం నియంత్రించింది. ధరల స్థిరత్వం కొనసాగించింది.  

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు 
 గత రెండేళుŠాల్గ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. రాష్ట్రం వేగంగా పట్టణీకరణ చెందుతోంది. 2031 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుకుంటుందని అంచనా. పట్టణాల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్, హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లుగా విభజించింది.

ఇది నగర పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. మహా నగరంలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు హైదరాబాద్‌ పోలీసు అధికార పరిధిని విస్తరించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, కొత్తగా ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్లుగా పునర్వవ్యస్థీకరించింది.  

నీటి వనరుల పునరుద్ధరణకు హైడ్రా 
క్యూర్‌ పరిధిలోని ప్రాంతాన్ని పారిశ్రామిక కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. క్యూర్‌ ప్రాంతంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. క్యూర్‌ పరిధిలోని నీటి వనరులను పునరుద్ధరించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసి దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా ఆక్రమణకు, కబ్జాలకు గురైన చెరువు భూములు, ప్రభుత్వ భూములను తిరిగి స్వా«దీనం చేసుకుంది.

ఫలితంగా బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్‌ రుక్‌ ఉద్‌దౌలా చెరువులు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ ఆర్‌ మధ్య ఉన్న ప్యూర్‌ ప్రాంతాన్ని ఇ¯న్‌ఫ్రాస్ట్రక్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ పశి్చమ ప్రాంతంలో ఉన్న కొడంగల్‌ ఏరియా ఇండ్రస్టియల్‌ హబ్‌ గా మారనుంది. జహీరాబాద్‌లో 3,245 ఎకరాల్లో నేషనల్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధి జరుగుతోంది. 

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు 
హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల మూసీ రివర్‌ ఫ్రంట్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్‌ వరకు ఫేజ్‌–1 ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుంది. గోదావరి నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు అనుసంధానించడం ద్వారా 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అందిస్తారు. దీంతో క్యూర్‌ ప్రాంతానికి రోజుకి 300 మిలియన్‌ గ్యాలన్ల తాగునీరు అందుతుంది.

హైదరాబాద్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ, అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీ¯న్‌ఫీల్డ్‌ హైదరాబాద్‌–అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై, పుణెలకు మూడు హైస్పీడ్‌ బుల్లెట్‌ రైళ్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ను బుల్లెట్‌ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 56 గ్రామాలు, ఏడు మండలాలతో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటైంది. 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ గ్రీన్‌ ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీగా ఏర్పాటు కానుంది. 

భారీగా పెట్టుబడుల ఆకర్షణ 
తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా మార్చేలా ఆవిష్కరణలకు, పెట్టుబడుల సాధనకు, సుస్థిర అభివద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇటీవల తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగంలోని ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. ఇటీవలి 23వ బయో ఏషియా సదస్సులో దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 

సాగునీటికి, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత 
    రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, పునరావాస ప్రక్రియను కొన్ని నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించటంతో పాటు రైతు సంక్షేమ పథకాలు అమలు చేసింది.

రైతు భరోసా పెట్టుబడి సహాయ పథకం కింద ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ.8,744 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రూ.2 లక్షల లోపు రైతుల పంట రుణాలను మాఫీ చేసింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది.  

3.38 కోట్ల మందికి ఆహార భద్రత 
    రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పిస్తోంది. రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 42.90 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్లను అందిస్తోంది. 53.09 లక్షల కుటుంబాలు గృహజ్యోతి ఉచిత కరెంటు సరఫరాతో ప్రయోజనం పొందుతున్నాయి. విద్యార్థులకు డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్‌ చార్జీలను 212 శాతం పెంచింది. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. డ్రగ్స్‌ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈగల్‌ (ఎలైట్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఫర్‌ డ్రగ్‌ లా ఎ¯న్‌ఫోర్స్‌మెంట్‌)ను ఏర్పాటు చేసింది. 

రూ.3.13 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు 
    తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దాదాపు 9.39 లక్షల మంది యువతీ యువకులు ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత ప్రోత్సహించడానికి, రూ.15 వేల కోట్లతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030 ప్రకటించింది. దీంతో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు రానున్నాయి.  

చారిత్రక మార్పు దశలో రాష్ట్రం 
    రాష్ట్రం ఒక చారిత్రక మార్పు దశలో నిలబడింది. ఈ బడ్జెట్‌ కేవలం ఆర్థిక కేటాయింపులకే పరిమితం కాదు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతనమైన భవిష్యత్‌ తెలంగాణ నిర్మాణానికి మార్గదర్శనం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను తీర్చేందుకు, తెలంగాణ సమగ్ర అభివద్ధికి ఉపయోగపడే రోడ్‌ మ్యాప్‌. రాష్ట్ర సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధిపై ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది.

అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరు. అభివృద్ధి చెందిన దేశాలు, నగరాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ చేరుకుంటుంది. ప్రజా ప్రభుత్వ స్వప్నాన్ని సాకారం చేయడానికి ఐకమత్యంతో, ఆత్మవిశ్వాసంతో నిలువెత్తు నిబద్ధతతో మనమందరం కలిసి పని చేద్దాం. తెలంగాణాను ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుపుదాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement