కాల్పులు జరిపి తప్పించుకోవాలని.. | Sensational details in the remand report of the Farmhouse Party case | Sakshi
Sakshi News home page

కాల్పులు జరిపి తప్పించుకోవాలని..

Mar 17 2026 5:05 AM | Updated on Mar 17 2026 5:05 AM

Sensational details in the remand report of the Farmhouse Party case

ఫాంహౌస్‌ను ‘ఈగల్‌’ పోలీసులు చుట్టుముట్టడంతో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి బృందం ప్లాన్‌ 

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసు రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు 

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిప్రకారం ఫాంహౌస్‌ను ‘ఈగల్‌’ బృందం, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అవాక్కైన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ , పైలట్‌ రోహిత్‌ల బృందం వారిపై కాల్పులు జరిపి తప్పించుకోవాలని ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నమిత్‌ శర్మ 0.32 జర్మనీ తయారీ రివాల్వర్‌తో తొలుత మూడు రౌండ్లపాటు కాల్పులకు దిగాడు. 

తాము పోలీసులమని, సోదాలకు వచ్చామని చెబుతున్నా నమిత్‌ శర్మ మాత్రం తమను లక్ష్యంగా చేసుకొని కూడా ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడని రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ బుల్లెట్‌ ఎవరికీ తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాల్పుల శబ్దాలు వినగానే తాము అప్రమత్తం అయ్యామని.. అదే సమయంలో ‘కాల్చి పారేయండి.. మొత్తం నేను చూసుకుంటాను. ఏం జరిగినా నాదే బాధ్యత’ అంటూ ఒకరు గట్టిగా అరిచినట్లు వినిపడిందని వివరించారు. తమను భయభ్రాంతులకు గురిచేసి కాల్పులు జరిపి ఫాంహౌస్‌ నుంచి తప్పించుకొని పారిపోవాలని అక్కడున్న వారు ప్లాన్‌ వేశారని పేర్కొన్నారు. 

ఈ వ్యవహారంలో నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం, ఎక్సైజ్‌ చట్టాలతోపాటు ఆయుధాల చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కాల్పులతో సంబంధం ఉన్న పైలట్‌ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌ శర్మలను అరెస్ట్‌ చేశారు. కాల్పులుకు తెగబడ్డ నమిత్‌ శర్మను ఏ–1గా, ఫాంహౌస్‌ యజమాని, పార్టీ ఏర్పాటు చేసిన పైలట్‌ రోహిత్‌రెడ్డిని ఏ–2గా, అతడి సోదరుడు, కాల్పుల జరిగిన తుపాకీ లైసెన్స్‌ కలిగిన రితేశ్‌రెడ్డిని ఏ–3గా పేర్కొన్నారు. పోలీసులపై హత్యాయత్నం, వారి విధులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం నిందితులకు జ్యుడీíÙయల్‌ కస్టడీ విధించింది. 

మరింత కిక్కు కోసమే మద్యంలో కొకైన్‌.. 
రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. మత్తు కిక్కు కోసమే టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వారి మిత్రులు మద్యంలో కొకైన్‌ కలుపుకొని తాగారు. పార్టీని రంజుగా ఎంజాయ్‌ చేసేందుకే ఖరీదైన పలు బ్రాండ్ల మద్యంతోపాటు కొకైన్‌ తెప్పించుకున్నారు. పోలీసుల సోదాల అనంతరం పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్‌ టెస్ట్‌లు, అనంతరం రక్త పరీక్షలు నిర్వహించగా పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, కౌశిక్‌ రవి, నమిత్‌ శర్మలకు పాజిటివ్‌ వచ్చింది. 

నమిత్‌ శర్మ మూడు రకాల డ్రగ్స్‌ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయింది. పార్టీలో వాడిన కొకైన్‌ను తానే తెచ్చానని కౌశిక్‌ రవి పోలీసుల ఎదుట అంగీకరించాడు. సిమ్లాలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్‌ పార్టీ కోసమే కొకైన్‌ను ఒక్కో గ్రాము రూ. 15,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్‌ అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement